ఒంగోలు వన్‌టౌన్ : ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పాఠశాల విద్య గుంటూరు ఆర్‌జేడీ పి.పార్వతి ఆదేశించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక అంబేద్కర్ భవన్‌లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంగోలు, పర్చూరు విద్యాడివిజన్ల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్‌జేడీ మాట్లాడుతూ ఇటీవల తాను కొన్ని పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించానని, ప్రధానోపాధ్యాయులు బాధ్యత లేకుండా రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతమైతే ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. ఉన్నత పాఠశాలల్లో కచ్చితంగా మూమెంట్ రిజిస్టర్ నిర్వహించాలన్నారు. పాఠశాల వదిలి వెళ్లేటప్పుడు ఎక్కడకు వెళ్తుందీ స్పష్టంగా మూమెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని హెచ్‌ఎంలను ఆదేశించారు.
ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలో ప్రార్థనా సమావేశాలకు హాజరుకావాలన్నారు. ప్రార్థనా సమావేశాలకు హాజరుకాని ఉపాధ్యాయులకు సీఎల్ మార్కు వేయాలని ఆమె సూచించారు. పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లను ఎట్టి పరిస్థితుల్లో బోధనేతర పనులకు వినియోగించరాదన్నారు. సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు వేరువేరుగా తరగతులు నిర్వహించాలన్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధన జరిగేలా హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పాఠశాలలకు వరుస సెలవులు ప్రకటించరాదన్నారు. పాఠశాలల్లో చదవడం, రాయడం రాని విద్యార్థులను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. డివిజన్ స్థాయిలో తాను ప్రతినెలా హెచ్‌ఎంల సమావేశం నిర్వహించి పనితీరును సమీక్షిస్తానని తెలిపారు. హైస్కూళ్లల్లో సక్రమంగా పనిచేయని మధ్యాహ్న భోజనం కుకింగ్ ఏజెన్సీలను తొలగించి సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులను కుకింగ్ ఏజెన్సీలుగా నియమించాలని ఆమె సూచించారు. పాఠశాలలోని గ్రంథాలయ పుస్తకాలను పాఠ్యాంశాలకు అనుగుణంగా విద్యార్థులకు అందజేసి వారితో చదివించాలన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు సైన్సుబోధనలో కచ్చితంగా ప్రయోగాలు చేసి చూపించాలని ఆర్‌జేడీ సూచించారు.
ప్రాథమిక, మాధ్యమికను ప్రోత్సహించాలి...
ఉన్నత పాఠశాలల్లోని హిందీ టీచర్లు విద్యార్థులతో ప్రాథమిక, మాధ్యమిక లాంటి పరీక్షలు రాయించేందుకు ప్రోత్సహించాలని ఆర్‌జేడీ పార్వతి సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడ్ని పర్యవేక్షకునిగా ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులకు సెల్‌ఫోన్లు తీసుకెళ్లే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇప్పటి వరకు ఆధార్ అనుసంధానం కాని విద్యార్థులకు వెంటనే ఆధార్ నంబర్లు అనుసంధానం చేయాలన్నారు. ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయులే తయారు చేసి పరీక్షలు నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డీఈవో బి.విజయభాస్కర్ మాట్లాడుతూ ఆర్‌ఎంఎస్‌ఏ గ్రాంట్ల వినియోగానికి సంబంధించి 11, 12, 13 తేదీల్లో ప్రత్యేక బృందాలు పాఠశాలలను సందర్శిస్తాయని తెలిపారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులు త్రైమాసిక పరీక్షల్లో సాధించిన మార్కులపై ఆర్‌జేడీ సమీక్షించారు. సమావేశంలో ఒంగోలు ఉపవిద్యాశాఖాధికారి ఇ.సాల్మన్, హెచ్‌ఎంల సంఘ జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రావు, డీసీఈబీ కార్యదర్శి ఆర్.హనుమంతరావు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఎంఎస్‌ఏ ఉపవిద్యాశాఖాధికారి వి.రామ్మోహనరావు పాల్గొన్నారు.
హెచ్‌ఎంలు బాధ్యతగా పనిచేయాలి
Published Thu, Nov 6 2014 3:38 AM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM
Advertisement
Advertisement