
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోపు తెలంగాణ మీడియా అకాడమీ భవనం అందుబాటులోకి వస్తుందని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సోమవారం సమాచార భవన్‌లో నిర్వహించిన అకాడమి పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత భవనాన్ని కూల్చేసి కొత్త భవన నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో టెండర్లు కూడా ఖరారయ్యాయని చెప్పారు. నూతన భవన శంకుస్థాపన త్వరలో సీఎం కేసీఆర్ చేతులు మీదుగా ప్రారంభమవుతుందన్నారు. అకాడమీకి రూ.15 కోట్లు మంజూ రు చేశారని తెలిపారు. నూతన అకాడమీ భవనం పూర్తైతే రూ.100 కోట్ల జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి శాశ్వతతరగతి గదులను నిర్మించి జర్నలిజం కోర్సు కూడా ప్రవేశపెడతామని వెల్లడించారు.
150 కుటుంబాలకు ఆర్థిక చేయూత
గతంలో ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి వంద కోట్లు ప్రకటించి, రూ.34.50 కోట్లను విడుదల చేసిందని అల్లం నారాయణ వివరించారు. మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు వాటి నుంచి రూ.లక్ష చొప్పున రూ.కోటి యాభై లక్షలు, తీవ్ర అనారోగ్యం బారిన పడిన జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున 26 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.3,000 చొప్పున 5 ఏళ్ల వరకు ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 104 మంది పిల్లలకు 1 నుంచి 10వ తరగతి వరకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లిస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ పత్రికల ఎడిటర్లు, సీనియర్ పాత్రికేయులు, తెలుగు వర్సిటీ జర్నలిజం శాఖాధిపతి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment