- ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ జర్నలిస్టుల జీవితాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం జరిగిన కాకతీయ ప్రెస్‌క్లబ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అల్లం నారాయణ, శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులకు కనీస వేతనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక నేటికీ దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వారందరికీ నివేశన స్థలాలు అందించాలని వారం రోజుల క్రితమే ములుగు ఆర్డీఓ మహేందర్‌జీకి ఆదేశాలు జారీ చేశానన్నారు. అనంతరం కాకతీయ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, స్పీకర్ మధుసూదనాచారిని ఘనంగా సన్మానించారు. అలాగే డైరీ ఆవిష్కరణకు సహకరించిన టీబీజీకెఎస్ నాయకుడు మంగళగిరి అప్పయ్యదాస్, 9వ వార్డు కౌన్సిలర్ శిరుప అనిల్‌కుమార్‌ను సన్మానించారు. టీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రమణ, నాయకులు బీఆర్ లెనిన్, ఇస్మాయిల్, జిల్లా అధ్యక్షుడు కక్కెర్ల అనిల్‌కుమార్, నాయకులు సుధాకర్, నవాబ్, భూపాలపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, చంద్రు శ్రీధర్ పాల్గొన్నారు.