విలేకరులతో మాట్లాడుతున్న పరశురాం
టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు పరశురాం
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమంలో జాడలేని కొంతమంది జర్నలిస్టు సంఘాల నాయకులు.. ఇప్పుడు ప్రెస్‌అకాడమీ చైర్మన్ లక్ష్యంగా «చేసుకుని ధర్నాలకు దిగటం సరికాదని టీయుడబ్ల్యూజే(హెచ్-143) రాష్ట్ర నాయకుడు పరశురాం అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను లక్ష్యంగా చేసుకుని ధర్నాలకు దిగటాన్ని తప్పుబట్టారు. గతంలోని అకాడమీ చైర్మన్‌లు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. కానీ, అల్లం నారాయణ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
గతంలో అందజేసిన హెల్డ్‌కార్డులకు లక్ష రూపాయల వరకు మాత్రమే పరిమితి ఉండేదని, ప్రస్తుతం పరిమితి లేదని చెప్పారు. ఇళ్ల స్థలాలతో పాటు డబుల్‌బెడ్‌రూమ్‌లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సముఖత వ్యక్తం చేశారని, అది ప్రెస్ అకాడమీ చైర్మన్ నారాయణ ఘనత అని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ప్రెస్ అకాడమీకి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
పాత్రికేయుల పిల్లల విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి విషయాలు గమనించకుండా ప్రెస్ అకాడమీని నిర్వీర్యం చేసేలా ఐజీయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నాలు చేస్తామనటం సరికాదన్నారు. సమావేశంలో సంఘం నాయకులు సునీల్, మోహన్, సత్తార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.