- జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం
- తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లుది కీలకపాత్ర
- టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : ఉద్యమకారులు, ప్రజల నిరవధిక పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ర్ట కన్వీనర్ అల్లం నారాయణ అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. పార్లమెం ట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడాన్ని పురస్కరించుకుని టీజేఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్టులు నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. అనంత రం జర్నలిస్టులు తెలంగాణ ఆటపాటలతో ర్యాలీ నిర్వహిం చి, కాళోజీ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిం దన్నారు. అలాగే బీజేపీ ముందు నుంచి చెప్పిన మాట పై నిలబడిందన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీతో పాటు అన్ని జేఏసీలు, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు కలిసి వచ్చాయన్నారు. ఎంఎల్ పార్టీలు, మావోయిస్టు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశాయని, న్యాయవాదులు కూడా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లు జిల్లా ప్రజలు కీలకపాత్ర పోషించారని, స్వరాష్ట్ర సాధన కోసం రాజకీయాలకతీతంగా ఇక్కడి వారంతా ఐక్యంగా ఉద్యమించారన్నారు. ప్రధానంగా జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యం చేశారని, రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న సీమాంధ్ర పక్షపాతి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి జిల్లాలోని రాయినిగూడెంలో ముచ్చెమటలు పట్టించారని చెప్పారు.
ఉద్యమానికి అండగా నిలిచారు : పరిటాల
మలిదశ తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు అండగా నిలి చారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన జర్నలి స్టులు చిరకాలం గుర్తుంటారని పేర్కొన్నారు. తెలం గాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావా ల న్నారు.
ర్యాలీలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్, నగర అధ్యక్షుడు రాంకిషన్, ప్రధాన కార్యదర్శి సోమయ్య, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్‌మోహన్‌రావు, కళాకారుల జేఏసీ జిల్లా కన్వీనర్ దారా దేవేందర్, కళాకారుడు గద్దర్ సాంబయ్య, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కోశాధికారి రమణ, జిల్లా కన్వీనర్ కూన మహేందర్, నాయకులు గటిక విజయ్‌కుమార్, బీఆర్ లెనిన్, పీవీ.కొండల్‌రావు, దొంతు రమేష్, నూర శ్రీనివాస్, సుధాకర్, ప్రెస్‌క్ల బ్ ప్రధాన కార్యదర్శి దుంపల పవన్‌కుమార్, డెస్క్ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శంకేసి శంకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్, నాయకులు కెంచ కుమారస్వామి, నుగునూతుల యాకయ్య పాల్గొన్నారు.