separate telangana state
-
జననీ.. జయకేతనం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్, డప్పుల దరువులు..కళాకారుల ఆటాపాటలతో యువత ఊర్రూతలూగింది. చిందుయక్షగానం..శ్రీకృష్ణార్జునయుద్ధం ఇక్కడి సాంస్కృతిక వైభవం చాటగా.. మరోవైపు నోరూరించే ఫుడ్‌కోర్టు భోజనప్రియులను ఆహ్వానించింది. ఇదీ..జిల్లాకేంద్రంలోని ఎన్జీకాలేజీలో జరుగుతున్న తెలంగాణ సంబురాలలో శుక్రవారం రాత్రి నెలకొన్న సందడి. అంతకుముందు ఉత్సవాలలో భాగంగా కలెక్టర్ టి.చిరంజీవులు జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించింది ఈ అపురూప క్షణం కోసమే అని పేర్కొన్నారు. తెలంగాణకు గొప్ప సాంస్కృతిక, సాహితీ వైభవం ఉందని, ఇక్కడి సంప్రదాయాలు పేరెన్నికగన్నవన్నారు. తెలంగాణ సాకారమైన సందర్భంగా వాటన్నింటినీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతోపాటు ఇక్కడి వంటలతో ఫుడ్‌కోర్టును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఎస్పీ రమారాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని, ఇంత పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా రెవెన్యూశాఖకు అభినందనలు తెలిపారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా లలిత సుమాంజలి గణపతి ప్రార్థన, కూచిపూడి నృత్యం, జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం పాటకు పాలబిందెల బాలు బృందం ఆధ్వర్యంలో ఉషారాణి, జిషిత, పాలబిందెల సాత్విక తదితరులు నృత్యం చేశారు. హైదరాబాద్‌కు చెందిన కళానృత్యనికేతన్ బిందు, అభినయ్ బృందం వారి రాచలీల, అన్నమాచార్య కీర్తన, ‘‘వచ్చెను అలివేలు మంగా, బ్రహ్మమొక్కటే’’ అంశాలు ప్రదర్శించారు. నల్లగొండ న్యూస్ స్కూల్ నుంచి గౌస్‌బాబా బృందం ఆధ్వర్యంలో భారత వేదమున నృత్యం పేరిట వెంకట్ బృందంతో పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..., శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన చింతల చెర్వునాగభూషణం బృందం చిందు యాక్షగానం.. శ్రీకృష్ణార్జున యుద్ధం నిర్వహించారు. ఆహా ఏమిరుచి... అంతకుముందు జిల్లా కలెక్టరు చిరంజీవులు కళాశాల మైదానం రెండవ భాగంలో నిర్వహిస్తున్న ఫుడ్‌కోర్టును ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన వంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాల్స్‌లో చికెన్, మటన్ దమ్‌బిర్యాని, చేపల పులుసు, సకినాలు, కారపప్పలు, పుల్లట్లు, సర్వపిండితో పాటు లడ్డూలు వగైరా అందుబాటులో ఉంచారు. పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు బారులు తీరి బిర్యాని, చేపల వంటకాలను ఆహా ఏమి రుచీ అంటూ ఆరగించారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఏజేసీ వెంకట్రావు, ఆర్డీఓ జహీర్, కొండకింది చినవెంకట్‌రెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి, సినీ దర్శకుడు ఎన్.శంకర్, టీజేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, టీఎన్జీఓ కార్యదర్శి వై.వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు ఖలీమ్, ఆదిరెడ్డి, శంకరమ్మ, రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రముఖులకు సన్మానం 60 ఏళ్ల కళ సాకారమైన సందర్భంగా జిల్లాలోని ప్రముఖులకు సన్మానించనున్నట్టు కలెక్టర్ చిరంజీవులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సన్మానం పొందే వారిలో హైకోర్టు జడ్జి ఈశ్వరయ్యగౌడ్, ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఆర్టీఐ కమిషనర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ సెక్రటరీ చోల్లెటి ప్రభాకర్, ప్రభుత్వ ఉద్యోగి కిషన్‌రెడ్డి, స్కాడ్రన్ లీడర్ ఆర్.జయసింహ, సినిమా డెరైక్టర్ ఎన్.శంకర్, సినీ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ, పద్మ అవార్డు గ్రహీత గజం అంజయ్య, గజం గోవర్ధన్, పారిశ్రామికవేత్త మీలా సత్యనారాయణ. విద్యావేత్త కె.చినవెంకట్‌రెడ్డి, పాస్‌పోర్టు ఆఫీసర్ శ్రీకర్‌రెడ్డి, ప్రముఖ అడ్వకేట్ మహాముద్ అలీ, ఐబీసీ న్యూస్ ఛానల్ అధినేత ఏచూరి భాస్కర్, కళాకారులు వివేక్, ప్రముఖ సేవకులు జగిని కుశలయ్య, సాహితీ ప్రముఖులు కూరేళ్ల విఠలాచారి, సాంస్కృతిక ప్రముఖలు చల్లం పాండురంగారావు (ప్రజాన్యాటమండలి), సినిమా కమేడియన్ ఆర్టిస్టు వేణుమాధవ్, కార్టూనిస్ట్ శంకర్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి సురేందర్ ఉన్నారు. -
ఇది ప్రజా విజయం
గుండాల, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరులను మరిచిపోతే మన లక్ష్యాన్ని మరిచిపోయినట్లేనని, తెలంగాణ ఏర్పాటు ఏ ఒక్కరిదీ కాదని.. ఇది ప్రజల విజయమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. గుండాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ.. వేణుగోపాల్ రెడ్డి, యాదన్న, యాదిరెడ్డి, శ్రీకాంతాచారి తదితరుల ఆత్మహత్యలన్నీ నిరసన రూపాలని అన్నారు. వారి త్యాగాలు ఉద్యమానికి ఊపిరిపోశాయని అన్నారు. 1969 నాటి సంఘటనలకు.. ఇప్పటి ఘటనలకు చాలా తేడా ఉందన్నారు. ఉద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మె కూడా చారిత్రాత్మకమైనదని, ఇలాంటి ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి జయశంకర్, ఇతర అమరవీరుల సాక్షిగా కృషి చేస్తామని ప్రకటించారు. చదువుకున్న వారు మౌనంగా ఉంటే టైజం కంటే ప్రమాదమని అన్నారు. ప్రజలను చైతన్యం చేసేలా, తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకె ళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ ఊపిరి పోస్తే, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కదలించిందని అన్నారు. ఖమ్మంలో కేసీఆర్ దీక్ష చేపడితే.. ఆ దీక్షను న్యూడెమోక్రసీ ముందుకు నడిపిందని చెప్పారు. జేఏసీలో లేకపోయినప్పటికీ సీపిఐ నిర్వహించిన పోరాటం కూడా మరువలేనిదని అన్నారు. చివరి సమయంలో ప్రజలు సంఘటితంగా ఉండడ ంల వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, పంపకాల్లోనూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాల్సిన భాద్యత ఉందని అన్నారు. పోలవరం నిర్మాణంతో ఆదివాసీల మనుగడకు ముప్పు ఏర్పడిందని, ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గోదావరి జలాలలపై ఆంధ్రా ప్రాంతానికి హక్కు ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రాంతాన్ని ముంపు పేరుతో తరలించుక పోవడం సరైంది కాదన్నారు. గ్రామాల తర లిపుంపును నిలిపివేసేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు యాసారపు తిరుపతి, సాయన్న, డి.శ్రీను, నాగరాజు అద్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, రేగా కాంతారావు, ఊకె అబ్బయ్య, జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం నాయకులు ఎన్.వెంకటపతిరాజు, న్యూడెమెక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నాయకులు ముక్తార్‌పాషా, ముక్తి సత్యం పాల్గొన్నారు. -
మోడీ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది
తూప్రాన్, న్యూస్‌లైన్: మోడీ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలోని లక్ష్మినర్సింహా ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల నేరవేరిందన్నారు. బీజేపీ వల్లే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలు విసిగిపోయారన్నారు. నాయకులు అవినీతిలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏనాడు ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. కేవలం తమ ఆస్తులను కూడబెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులతో పాటు మెదక్ ఎంపీ అభ్యర్థిగా చాగన్ల నరేంద్రనాథ్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌లో ఇమడలేకపోయా: చాగన్ల కాంగ్రెస్ పార్టీ రౌడీల పార్టీ నరేన్ ట్రస్టు అధినేత, బీజేపీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి చాగన్ల నరేంద్రనాథ్ విమర్శించారు. కాంగ్రెస్ కోసం తన వంతు కృషి చేశానన్నారు. తన సొంత నిధులతో ప్రజా సేవ చేస్తుంటే కొందరు అది సహించేకపోయారన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, తూప్రాన్ పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డిని తనపైకి పురిగొల్పారన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుపడ్డారన్నారని, ఎమ్మెల్యే నర్సారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తూప్రాన్ వచ్చిన సందర్భంగా స్టేజీపైకి రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారన్నారు. ఈ విషయాన్ని సీఎం గమనించి తనను స్టేజీ పైకి పిలిపించారని గుర్తుచేశారు. దీంతో తాను కాంగ్రెస్‌లో ఇమడలేనని గ్రహించి ప్రజల అభీష్టం మేరకే బీజేపీలో చేరానని వివరించారు. -
సోనియా చొరవతోనే తెలంగాణ
నర్సాపూర్‌రూరల్, న్యూస్‌లైన్: అమరుల త్యాగ ఫలితం, సోనియాగాంధీ చొరవతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ఆత్మ బలి దానాలు చేసుకున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చొరవ తీసుకున్నారన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్న బీజేపీ రాజ్య సభలో మెలిక పెట్టి బిల్లును అడ్డుకునేందుకు కుట్రపన్నిందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరిచి, రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రి చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపై ఉందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రిని ముందుగా స్థానిక నేతలు మాజీ ఉపముఖ్యమంత్రి జగన్నాథరావు విగ్రహం వద్ద ఘనంగా సన్మానించి ఓపెన్‌టాప్ జీపులో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ గాంధీ, బాబూజగ్జీవన్‌రామ్, వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ర్యాలీలో కార్యకర్తలు బ్యాండ్ మేళాలతో నృత్యం చేయడంతో పాటు పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, శ్రీధర్‌గుప్తా, చంద్రాగౌడ్, మాజీ ఎంపీపీ లలిత, శ్రీనివాస్‌గౌడ్, అనిల్‌గౌడ్ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు .. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు తెలిసి సమాచారం వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం లేదన్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ నిర్ణయమే తుది నిర్ణయమని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా కొత్త ముఖ్యమంత్రి నియమించాలనే ఆలోచనలో ఆయన ఉన్నారన్నారు. కొత్త కాలనీల అభివృద్ధికి నిధులు నర్సాపూర్ నియోజకవర్గం కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి భవనానికి రూ. 11 కోట్లు విడుదలయ్యాయని, దీంతో పాటు వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి రూ. 98 లక్షలు, మం డలాల్లోని కొత్త కాలనీల అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే చెక్‌డ్యాంల నిర్మాణానికి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మంజూరుకు నిధులు, హత్నూర, కౌడిపల్లి, కొ ల్చారం మండలాలకు రూ. 7. 50 కోట్లు, ని యోజకవర్గంలోని చెరువులు, కుంటల అభివృద్ధికి రూ. కోటి 8 లక్షలు, బీటీ రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం నిధులు విడుదలైనట్లు మంత్రి చెప్పారు. ఏడుపాయల జాతరను పురస్కరించుకొని ప్రభుత్వం సింగూర్ నుంచి నీటి విడుదల కోసం చర్యలు తీసుకుంటోందన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి నర్సాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నర్సాపూర్‌లో 100 పడకల ఆస్పత్రి భవనంతో పాటు జూనియర్ కళాశాల భవనం, హత్నూర, శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం మండలాలకు సంబంధించిన బీటీ రోడ్ల మరమ్మతులు, తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు, కాంగ్రెస్ పా ర్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు వెల్దుర్తి: నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం వెల్దుర్తిలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి హాస్టల్ బాలికలతో మాట్లాడారు. తెలంగాణ విద్యార్థులు, యువకుల పోరాటాలు, బలిదానాలకు స్పందించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాలికలు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం మంత్రి బాలికలతో జై సోనియాగాంధీ, జై తెలంగాణ అంటూ నినాదాలు చేయించారు. మంత్రి వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు. -
పోరాటాల ఫలితమే తెలంగాణ
జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లుది కీలకపాత్ర టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : ఉద్యమకారులు, ప్రజల నిరవధిక పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ర్ట కన్వీనర్ అల్లం నారాయణ అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. పార్లమెం ట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడాన్ని పురస్కరించుకుని టీజేఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్టులు నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. అనంత రం జర్నలిస్టులు తెలంగాణ ఆటపాటలతో ర్యాలీ నిర్వహిం చి, కాళోజీ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిం దన్నారు. అలాగే బీజేపీ ముందు నుంచి చెప్పిన మాట పై నిలబడిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీతో పాటు అన్ని జేఏసీలు, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు కలిసి వచ్చాయన్నారు. ఎంఎల్ పార్టీలు, మావోయిస్టు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశాయని, న్యాయవాదులు కూడా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లు జిల్లా ప్రజలు కీలకపాత్ర పోషించారని, స్వరాష్ట్ర సాధన కోసం రాజకీయాలకతీతంగా ఇక్కడి వారంతా ఐక్యంగా ఉద్యమించారన్నారు. ప్రధానంగా జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యం చేశారని, రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న సీమాంధ్ర పక్షపాతి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి జిల్లాలోని రాయినిగూడెంలో ముచ్చెమటలు పట్టించారని చెప్పారు. ఉద్యమానికి అండగా నిలిచారు : పరిటాల మలిదశ తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు అండగా నిలి చారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన జర్నలి స్టులు చిరకాలం గుర్తుంటారని పేర్కొన్నారు. తెలం గాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావా ల న్నారు. ర్యాలీలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్, నగర అధ్యక్షుడు రాంకిషన్, ప్రధాన కార్యదర్శి సోమయ్య, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు, కళాకారుల జేఏసీ జిల్లా కన్వీనర్ దారా దేవేందర్, కళాకారుడు గద్దర్ సాంబయ్య, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కోశాధికారి రమణ, జిల్లా కన్వీనర్ కూన మహేందర్, నాయకులు గటిక విజయ్‌కుమార్, బీఆర్ లెనిన్, పీవీ.కొండల్రావు, దొంతు రమేష్, నూర శ్రీనివాస్, సుధాకర్, ప్రెస్‌క్ల బ్ ప్రధాన కార్యదర్శి దుంపల పవన్‌కుమార్, డెస్క్ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శంకేసి శంకర్రావు, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్, నాయకులు కెంచ కుమారస్వామి, నుగునూతుల యాకయ్య పాల్గొన్నారు. -
ఎందరో అమరులు
కామారెడ్డి, న్యూస్‌లైన్ : దశాబ్దాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించనుంది. దీని వెనుక ఎందరెందరివో త్యాగాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో పేగు బంధాన్ని, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో రక్త సంబంధాన్ని, కట్టుకున్నవారితో అనుబంధాన్ని, స్నేహబంధాలను తెంచుకుని వెళ్లిపోయిన వారెం దరో... నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఆత్మహత్యల కు పాల్పడ్డారు. కొందరు ఉరితాడును ముద్దాడితే, మరికొందరు నిప్పం టించుకున్నారు. ఇంకొందరు రైలుకు ఎదురుగా వెళ్లి తనువులు చాలించా రు. ఎక్కడా లేని విధంగా స్వయంపాలన కోసం బలవన్మరణాలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం మరీ మరణ వాంగ్మూలాలు రాసి వెళ్లిపోయారు. ఆత్మహత్యలను ఉద్య మ రూపంగా మార్చుకున్న తీరు ఎక్క డా కనిపించదు. తెలంగాణవ్యాప్తంగా 1200 వందల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడితే జిల్లాకు చెందినవారు 30మందికి పైగా ఆ జాబితాలో ఉన్నారు. తెలంగాణ కల సాకారమైన వేళ అన్ని వర్గాల ప్రజ లు అమరులను స్మరించుకుంటు న్నారు. వారి త్యాగాలు వృథా పోలేదని, వారు కలలు గన్న రాష్ట్రం వచ్చిందని అంటున్నారు. తెలంగాణ రాష్ర్టంలో అన్ని రకాలుగా న్యాయం జరిగినపుడే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని అంటున్నారు. ఎన్కౌంటర్లో అసువులుబాసిన జనసభ సుదర్శన్ టీఆర్ఎస్ ఆవిర్భావానికన్నా ముందే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన తెలంగాణ జనసభను జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేసిన టి.సుదర్శన్ ఎన్కౌంటర్లో నేలకొరిగారు. నక్సల్స్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న సమయంలో 2005 జనవరి 16న మావోయిస్టుల వద్దకు వెళ్లిన సందర్భంలో ఈ ఎన్‌కౌం టర్ జరిగింది. ఆయన జనసభ రాష్ట్రకమిటీ సభ్యునిగా, జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. రైల్వే మెయిల్ సర్వీసెస్ డిపార్టుమెంటులో పనిచేసిన సుదర్శన్ తెలంగాణ కోసం తపించి అమరుడయ్యాడు. తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య భిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య కేసీఆర్ దీక్షను భగ్నం చేసిన సందర్భంలో 2009 నవంబర్ 30న కామారెడ్డి పట్టణంలో ఓ సెల్ టవర్‌పైకి ఎక్కి తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నా డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజలకు న్యా యం జరుగుతుందని ఆయన మరణ వాంగ్మూలంగా రాసుకున్న లేఖ లో స్పష్టంగా పేర్కొన్నాడు. ఏకే 47తో కాల్చుకున్న కానిస్టేబుల్ గంగాధర్ మాక్లూర్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసిన గంగాధర్ 2009 డిసెంబర్ 22న స్టేషన్లోనే ఏకే 47తో కాల్చుకున్నాడు. తెలంగాణ కోసం ఆయన బలిదానానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి బత్తుల రాజు తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బత్తుల రాజు సూసైడ్ నోట్ రాసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో క్రియాశీల కంగా పనిచేసిన యువకుడు. ఆయన మరణంతో కుటుంబం రోడ్డున పడింది. రైలుకు ఎదురెళ్లిన కరీం తాడ్వాయి మండలం కన్కల్ గ్రామాని కి చెందిన క రీం తెలంగాణ కోసం రైలుకు ఎ దురెళ్లి ఆత్మబలిదానం చేశాడు. కోపోద్రిక్తులైన ఉద్యమకారులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేవగిరి రైలుపై రాళ్లదాడి చేశారు. కరీం శవంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీలో కొనసాగిన ఎమ్మెల్యే అదే రోజు ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో కలిశారు. పట్టాలపై పడుకుని రమేశ్ సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామానికి చెందిన రమేశ్ అనే యువకుడు తెలంగాణ రాష్ట్రం రాదేమోనన్న బెంగతో స్థానిక రైల్వేస్టేషన్లో పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేశ్ అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొని కన్నీటి నివాళులర్పించడమే గాక ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రమేశ్ మరణం ఆయన కుటుంబానికి తీరని దుఖాన్ని మిగిల్చింది. ఉరిపోసుకుని కడెం నరేశ్ మృతి తెలంగాణ కోసం కడెం నరేశ్ ఉరివేసుకుని తనువు చాలించాడు. ఇతనిది మాచారెడ్డి మండలం ఇసాయిపేట. కామారెడ్డిలో నివాసముంటూ చదువుకుంటున్న నరేశ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఆయన మృతితో కన్నవారికి ఆసరా లేకుండాపోయింది. -
తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంలో మేకపాటి పిటిషన్!
న్యూఢిల్లీ: లోకసభ ఆమోదించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రతిపాదన ఆమోదిస్తూ అక్టోబర్ 3 తేదిన కేబినెట్ తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషన్ లో మేకపాటి పేర్కోన్నారు. ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించినట్టు ప్రకటించి.. ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టుకు మేకపాటి విజ్క్షప్తి చేశారు. లోకసభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. బిల్లుకు ఆమోదం తెలుపకముందు ముందుగా విచారణ చేపట్టడం సరికాదని.. సరియైన సమయంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని.. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 7, 17 తేదిల్లో సుప్రీం కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు ఫిబ్రవరి 18 తేదిన లోకసభ ఆమోదించిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ ఫిబ్రవరి 19న మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. -
హోరెత్తిన తెలం‘గానం’
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : రెండు వందల మంది కళాకారులు.. సుమారు 8 గంటలు.. ఒక్కో గొంతుక నుంచి ఒక్కో ఉద్యమ గానం అదే ప్రత్యేక తెలంగాణం. కళాకారుల ఆట పాటలకు అనుగుణంగా హాజరైన ప్రజల ఈలలు, చప్పట్లతో హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణం మారుమోగింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక ధూం ధాంలు నిర్వహించి బాసటగా నిలిచిన కళాకారులు.. తెలంగాణ కల సాఫల్యమవుతున్న నేపథ్యంలో మరోసారీ ఒక్కచోట చేరా రు. తెలంగాణ జానపద కళాకారులైన వరంగల్ శంకర్, దీకొండ సారంగపాణిలను స్మరించుకుంటూ తెలంగాణ క్రాంతి దళ్ చేపట్టిన‘మువ్వల సవ్వడి’ వారందరినీ ఏకం చేసింది. క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కొనసాగిన ధూం ధాంకు ప్రజా యుద్ధనౌ క గద్ధర్, ప్రజాగాయని విమలక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్, సారంగపాణి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ జానపదం అంట రానితనం భరిస్తున్న దళిత స్త్రీ నుంచి వచ్చిందని, అది ఉద్యమ పాటకు దారి తీసిందన్నారు. తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతుంటే వాటిని పరిరక్షించుకునే క్రమంలోనే తెలంగాణలో కవులు, కళాకారులు పుట్టారని పేర్కొన్నారు. తాను రాసిన భాగవతాన్ని ఆనాడు కన్నడ రాజు తనకు అంకితం చేయాలని కోరితే ధైర్యంతో ఎదురొడ్డిన గొప్ప ధీశాలి పోతన.. ఆయన వరంగల్ జిల్లాకు చెందిన వాడు కావడం గర్వకారణమన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ సంక్రాంతి, అట్లతద్ది పండుగులను జరుపుతున్న ఆంధ్రా పాలకులు తెలంగాణ బతుకమ్మలను మరిచిపోయిండ్లని విమర్శించారు. ప్రస్తుతం మూడు జాతరలు జరుగుతున్నా యని, అందులో ఒకటి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, మరోటి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఎన్నికల జాతర ప్రారంభమైందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి టికెట్లు ఇస్తామంటూ ఇప్పటికే తెలంగాణలో నాయకుల జాతర కొనసాగుతోందని చెప్పారు. సీనియర్ జర్నలి స్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారే తప్ప ఎవరూ ఇవ్వలేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో పార, గడ్డపార పట్టిన వాళ్లనే గెలిపిద్దామన్నారు. ముఖ్యమంత్రినే ఎదురించినానంటూ గొప్ప లు చెబుతున్న మంత్రి శ్రీధర్‌బాబు ల్యాండ్, సాండ్, గ్రానైట్ మాఫియాకు అధిపతి అని చెప్పారు. తెలంగాణ గురించి మాట్లాడుతున్న ఆయన 1200ల మంది విద్యార్థులు మరణించినపుడు ఎక్కడపోయిండని ప్రశ్నించారు. మళ్లీ మంత్రి కావాలంటే ముక్కు నేలకు రాసి, తప్పులను ఒప్పుకోవాలని చెప్పారు. ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య మాట్లాడుతూ కళ లేని దేశం దీపం లేని ఇల్లు లాంటిది.. కళలను, కళాకారులను ప్రజలు ఆదరించినపుడే భవిష్యత్ తరాలకు అందుతాయన్నారు. గొల్లమల్లమ్మ కోడలా అంటూ కొందరు రాసి న పాట ఎందరినో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాటలు రాసేప్పుడు ఆలోచించాలని హితవుపలికారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు పదవులు పోతాయని భయపడ్డరు.. ఇప్పుడు ముం దుండి నడిపిస్తున్నరు.. వారికి అండగా ఉందామని చెప్పా రు. జానపద పాటలను అనేక రాష్ట్రాలకు పరిచయం చేసింది శంకర్, సారంగపాణిలేనని పేర్కొన్నారు. తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరా జ్ మాట్లాడుతూ జానపద గాయకులైన వరంగల్ శంకర్, దీకొండ సారంగపాణి విగ్రహాలను పబ్లిక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇడ్లి సాంబార్, విద్యార్థి ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలైన అమరుల పేర్లు ఇప్పటికీ తెలంగా ణ నాయకులకు తెలియకపోవడం బాధాకరమని అన్నారు. రజాకార్లకు భయపడి ఆంధ్రాకు వలస పోయిన తెలంగాణ ప్రజలను పిరికివాళ్లుగా భావించి పప్పులు, కూరగాయలు, ఇంటి కిరాయిలు పెంచి కమర్శియల్‌గా సంపాధించుకున్న ఆంద్రోళ్లు నేడు తెలుగు భాష మాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ కవులను, కళాకారులను వారు విస్మరించారని మండిపడ్డారు. పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ మాట్లాడుతూ 1971లో ఐక్య రాజ్యసమితిలో తాను మిమిక్రీ కళను ప్రదర్శించేందుకు వెలితే అమెరికా అధ్యక్షుడు ఈ కళ ఎప్పడి నుంచి ఉందని అడిగితే మీదేశం పుట్టక ముందు నుంచి ఉందని చెప్పానని చమత్కరించారు. మిమిక్రీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో భీముడు స్త్రీలా మాట్లాడి శత్రువును సంహరిస్తాడని గుర్తు చేశారు. మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ నేరేళ్ల వేణుమాధవ్, తాను క్లాస్మేట్స్ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. విద్యార్థిగా హైద్రాబాద్‌లో ఉద్యమంలో పాల్గొన్న విషయాలను నెమరువేసుకున్నాడు. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిపై రాసిన కవితను చదివి వినిపించాడు. మా ఆయన పాటలంటే ప్రాణం కళనే నమ్ముకున్న నా భర్త తదనానంతరం నన్ను ఎవరూ చేరదీయలేదు. ఇద్దరు పిల్లల తో ఎన్నో కష్టాలు పడ్డాను. భర్త ఉద్యోగంతోనే నేడు బతుకుతున్నాను. అయినప్పటికీ శంకర్ నుంచి వచ్చిన జానపద పాటలంటే ప్రాణం. - సంధ్య, వరంగల్ శంకర్ సతీమణి భర్త స్నేహితులే ఆదుకున్నారు జానపద కళాకారుడిగా నా భర్త సారంగపాణి సంపాధించింది ఏమీ లేదు. ఆయన మరణాంతరం స్నేహితులే కుటుంబాన్ని ఆదుకున్నారు. పిల్లలను చదివించి ప్రయోజకులను చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. భర్త లేని తనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆర్థిక సాయం అందించాడు. - ప్రమీల, సారంగపాణి సతీమణి చదివించారు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి ఫీజులు లేకుండా చదివించారు. - రాజమహేందర్, సారంగపాణి కొడుకు -
మోదం.. ఖేదం..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ చరిత్ర పుటలో మరో ఏడాది చేరింది. ‘తెలంగాణ’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన పార్టీలు ప్రజలకు చేరువయ్యేందుకు పాట్లు పడ్డాయి. జిల్లా రాజకీయ ముఖచిత్రంపై మార్పులు చోటు చేసుకున్నాయి. ‘తెలంగాణ’పై అధిష్టానం సానుకూలంగా స్పందించడం కాంగ్రెస్కుకలిసొచ్చిన అంశం. అయితే ఆ పార్టీలో రెండు గ్రూపుల పోరు చేటయ్యింది. టీఆర్ఎస్కు ‘సహకార’, ‘స్థానిక’ ఎన్నికలు ఊపునిచ్చాయి. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం జిల్లాలో టీడీపీకి శరాఘాతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకార సంఘాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. నాలుగు రాష్ట్రాల్లో విజయం, ‘మోడీ’ నాయకత్వంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. సీపీఐ, సీపీఎంలు పోరుబాటలో సాగాయి. ఎమ్మెల్సీ, సహకార, పంచాయతీ ఎన్నికలు, తెలంగాణ ప్రకటనతో ఆందోళనలు జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి. కాగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని నిర్మల్ పోలీసులు అరెస్టు చేయడం, ఆదిలాబాద్ జైలుకు తరలించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ను వదలని గ్రూపులు.. అధికార కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వ ప్రకటన కలిసొచ్చిన అంశం. అయితే అప్పుడూ, ఇప్పుడూ ఆ పార్టీ జిల్లాలో సాధించిన విజయాలు ఏమీ లేవు. ఆ పార్టీని గ్రూపుల వివాదాలు అంటుకునే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావు, నిర్మల్ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డి రెండు వర్గాలుగా ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి మహేశ్వర్‌రెడ్డి గ్రూపునకు మద్దతు ఇస్తున్నారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న అధికార పార్టీకి ఎంపీ వివేక్ దూరమయ్యారు. డీసీసీ కాల పరిమితి తీరి రెండేళ్లు దాటినా కొత్త అధ్యక్షుడిని నియమించ లేకపోయారు. నిర్మల్ వేదికగా నిర్వహించిన తెలంగాణ కృతజ్ఞత సభ సక్సెస్ కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. అవసానదశకు టీడీపీ.. తెలుగుదేశం పార్టీ జిల్లాలో అవసానదశకు చేరింది. టీడీపీ నేతల తెలం‘గానం’ను ప్రజలు విశ్వసించడం లేదు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంపై విసిగిన ఇద్దరు ఎమ్మెల్యేలు గతేడాదే ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ, టీఆర్ఎస్ల వైపు చూస్తున్నారు. ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలున్న ఆ పార్టీకి ఎంపీతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలే మిగలగా భవిష్యత్‌లో ఆ పార్టీకి ఎవరూ మిగులుతారనేది చర్చనీయాంశమైంది. తెలంగాణ జిల్లాలన్నింటితో పోలిస్తే జిల్లాలో పార్టీని ఆదరించిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో టీడీపీ పరిస్థితి అవసానదశకు చేరింది. పదును తగ్గని ఉద్యమం.. ‘ప్రత్యేక’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ జిల్లాలో నిరంతర ఉద్యమాలతో దూసుకెళ్లింది. ఈ ఏడాదంతా ‘ప్రత్యేక’ ఉద్యమాలకు అంకితమైన టీఆర్ఎస్ పార్టీ రాజకీయ జేఏసీ, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో కలిసి ఆందోళనల్లో పాల్గొంది. కేసీఆర్ జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు హాజరై నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. సహకార, పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి సుధాకర్ రెడ్డి, పట్టభద్రుల నుంచి స్వామిగౌడ్‌లు ఎమ్మెల్సీలు కాగా, ఎంపీ వివేక్ జూన్ 2న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరడం పార్టీకి బలం పెరిగింది. జూన్ 30న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడటం ఆ పార్టీ విజయంగా శ్రేణులకు సంకేతం ఇచ్చింది. నవంబర్ 31, డిసెంబర్ 9 తేదీలలో దీక్ష, విజయ్ దివస్లకు మంచి స్పందన వచ్చింది. బీజేపీలో ‘మోడీ’ జోష్.. ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్న పార్టీల జాబితాలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీ అగ్రనేత నరేంద్రమోడి జోష్ పెరిగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ ఉద్యమాలు నిర్వహించింది. పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతలకు జిల్లా బీజేపీ ఆహ్వానం పలుకుతుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు వద్దంటూ జిల్లా బీజేపీ ఆ పార్టీ అధిష్టానంకు లేఖలు రాయడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం ఆ పార్టీ కేడర్‌లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ‘స్థానిక’ంలో వైఎస్సార్ సీపీ విజయం దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి వచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజల మధ్యకు వచ్చిన వైఎస్సార్ సీపీ అనతికాలంలో ప్రజలకు చేరువైంది. ఈ ఏడాదిలో జరిగిన సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖాతా తెరిచి సత్తా చాటింది. పార్టీ ఆవిర్భావం సమయంలో జిల్లా కన్వీనర్‌గా వ్యవహరించిన నేత బి.జనక్‌ప్రసాద్, కొత్తగా కన్వీనర్‌గా నియమితులైన కొమ్ముల వినాయక్‌రెడ్డి, జిల్లా కో-కన్వీనర్ ఎన్.రవిప్రసాద్, ఆదిలాబాద్ సమన్వయకర్త బి.అనిల్‌కుమార్, చల్లగుళ్ల విజయశ్రీ, ముత్తినేని రవికుమార్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు మేకల ప్రమీలలతోపాటు పలువురు జిల్లాలో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నారు. జిల్లాలో మూడు పర్యాయాలు పర్యటించిన విజయమ్మ జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంపై స్పందించిన తుమ్మిడిహెట్టి వద్ద దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన శిలాఫలకానికి క్షీరాభిషేకం చేసి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. జులైలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన విజయమ్మ బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. పోరుబాటలో సీపీఐ, సీపీఎంలు.. సీపీఐ, సీపీఎంలో జిల్లాలో తమ ఉద్యమ పంథాను పదునెక్కించాయి. వామపక్ష ఉద్యమాలు, కార్మిక సమస్యలపై దృష్టిసారించిన సీపీఐ జిల్లాలో తెలంగాణ ఉద్యమాల్లో ఉధృతంగా పాల్గొంది. ప్రత్యేక తెలంగాణ అజెండాకు కట్టుబడిన సీపీఐ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకుంది. సమైక్యవాద నినాదానికి కట్టుబడిన సీపీఎం ఈ ఏడాది జెండా, అజెండాల మేరకు పనిచేసింది. రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని వినిపించగా.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి సమైక్యవాదానికి కట్టుబడింది. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలను నిర్వహించిన సీపీఎం పార్టీ నిర్మాణం, పార్టీ కార్యక్రమాల అమలుపై దృష్టి సారించింది. -
బీజేపీ ఒత్తిడితోనే తెలంగాణ ప్రకటన
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: బీజేపీ ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఘట్కేసర్ మండల కేంద్రంలో శనివారం ఆయన పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో అంజన్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో బీజేపీ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. రాబో యే ఎన్నికల్లో నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని సూచించారు. ఈనెల 15న మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘యూనిట్ ఫర్ రన్’ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లో ఆవిష్కరణను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పార్టీలకతీంగా ప్రజలంతా పాల్గొనే విధంగా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు సత్యనారాయణ, యువమోర్చ జాతీయ కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుండ్ల బాల్‌రాజ్, రాష్ట్ర గిరిజన మోర్చ నాయకుడు బిక్కునాథ్‌నాయక్, రాష్ట్ర నాయకుడు మోహన్‌రెడ్డి, పర్యావరణ రాష్ట్ర కన్వీనర్ నల్ల భాస్కర్‌రెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రామోజీ, దళిత మోర్చ జిల్లా ప్రధానకార్యదర్శి మారేష్, పార్టీ జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి, మీడియా సెల్ జిల్లా కన్వీనర్ తిరుమలరెడ్డి, మండల అధ్యక్షుడు లోడే చంద్ర య్య, ప్రధాన కార్యదర్శి కర్ణాకర్, కీసర మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్, మహేందర్, ప్రభాకర్, సత్యనారాయణ, వీరేశం, రజనిరెడ్డి, నర్సింహారెడ్డి ఉన్నారు. -
ఎమ్మెల్సీలకు పదవీ గండం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముగ్గురు ఎమ్మెల్సీలు తమ పదవులు కోల్పోనున్నారు. అదెలా అంటారా... ఏ రాష్ట్రంలోనైనా ఎమ్మెల్యేల సంఖ్య120 మంది కంటే తక్కువ ఉంటే.. అక్కడ శాసనమండలిని కొనసాగించే అవకాశం లేదని రాజ్యాంగం, రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే పది జిల్లాల్లో 119 మంది శాసనసభ్యులు ఉన్నందున తక్షణమే ‘మండలి’ రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్సీలు బి.వెంకట్రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, కె.స్వామిగౌడ్ తమ పదవులు కోల్పోయే అవకాశం ఉంది. పది జిల్లాలతో కూడిన రాష్ట్రంలో 121కి పైగా ఎమ్మెల్యేలుంటే.. పార్లమెంట్ ఆమోదంతో శాసనమండలిని తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. దీనికి జిల్లాలు, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా వెంటనే జరిగేది కాదు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజనతో తక్షణమే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ అనుబంధ సింగరేణి ట్రేడ్ యూనియన్ ఐఎన్టీయూసీ నుంచి ఎదిగిన బి.వెంకట్రావు, తెలంగాణ ఉద్యమాల ద్వారా ఉపాధ్యాయులు, పట్టభద్రులకు చేరువైన స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డిలు ఇప్పటి వరకు పరోక్ష రాజకీయాల్లో ఉన్న వారే. అయితే రాష్ట్ర విభజన అనంతరం శాసనమండలి రద్దయి, ఆ తర్వాత శాసనసభకు ఎన్నికలు జరిగితే ఆ ముగ్గురు పదవులకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో స్వామిగౌడ్‌తోపాటు పాతూరి సుధాకర్‌రెడ్డి, బి.వెంకట్రావులు తిరిగి రాజకీయ భవిష్యత్తును కోరుకుంటే ప్రత్యామ్నాయం చూసుకోవడం తప్పనిసరని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరిగే ఈ పరిణామాలు రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. ఎమ్మెల్సీల భవిష్యత్తుపై రాజకీయ విశ్లేషకుల్లో చర్చ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పదవీ కాలం ఈ ఏడాది మే మాసంలో ముగిసింది. అప్పటికీ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల జరగని కారణంగా ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా సంక్రమించే పదవులకు దూరంగా ఉన్నారు. అయితే కలిసొస్తే మంచిర్యాల, సిర్పూరు(టి) నియోజక వర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాకు ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్సీల పరిస్థితి ఏమిటనేదే తాజా రాజకీయాంశం. ఐఎన్టీయూసీ నేతగా ఉన్న బి.వెంకట్రావుకు సింగరేణి ఉద్యమాలే ఆయన బ్యాక్ గ్రౌండ్. అయితే శాసనమండలి రద్దయి పదవులను కోరుకుంటే ప్రత్యామ్నాయంగా ఏ అసెంబ్లీ వెతుక్కోవాలన్నది చర్చనీయాంశమే. ఇదిలా వుంటే నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పాతూరి సుధాకర్‌రెడ్డి టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా గెలుపొందారు. రాజకీయపార్టీ బలపర్చినా ఉపాధ్యాయులు ఆయనను ఆదరించి అండగా నిలిచారు. తిరిగి ఆయన రాజకీయాల్లోనే ఉండాలనుకుంటే ఏదేని శాసనసభ స్థానంను ఎంచుకోవాల్సిందే. అలాగే పట్టభద్రుల అభ్యర్థిగా గెలుపొంది నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కె.స్వామిగౌడ్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల నేతగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. రాష్ర్ట విభజన అనంతరం ‘మండలి’ రద్దయి ప్రత్యక్ష రాజకీయాలకు చేరువవ్వాలంటే ఆయన కూడ ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. -
లక్ష గొంతుకలను ఢిల్లీకి వినిపిద్దాం..
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఈ నెల 30న తలపెట్టిన లక్షగొంతుల ఆకాంక్షను ఢిల్లీకి వినిపించాలని అఖిలపక్ష కమిటీ తీర్మానించింది. మంగళవారం స్థానిక షాదీఖానాలో లక్ష గొంతుకల ఉద్యమంపై కులసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు హాజరై కార్యక్రమం విజయవంతంపై దశాదిశను నిర్ధేశించారు. 30న వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి ఉంచాలన్న నిర్ణయాన్ని వ్యాపారులు సమావేశంలో ప్రకటించారు. లక్సెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి రోడ్లు దిగ్బంధించాలని నిర్ణయించారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం వరకు లక్ష మందితో ఎక్కడికక్కడే తమ గళాన్ని వినిపించాలని తీర్మానం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యమంలో భాగస్వాములు అవుతారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణవాదులుగానే కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ జెండాలను ఎవరూ తీసుకరావద్దని వక్తలు కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు మంగీలాల్సోమాని, ఆర్.కృష్ణారావు, వ్యాపార సంస్థల ప్రతినిధి గురిజాల రాధాకిషన్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జగన్మోహన్రావు, టీడీపీ జిల్లా కన్వీనర్ గాజుల ముకేశ్‌గౌడ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ ప్రతినిధులు బాలాజీ, ప్రవీణ్, కళాశాలల ప్రతినిధు లు భూమేశ్, మల్లారెడ్డి, డీటీఎఫ్ నాయకుడు కె.రాంరెడ్డి, టీయూటీఎఫ్ ప్రతినిధి ఆగాచారి, కమ్యూనిస్టు పార్టీ కన్వీనర్, కో కన్వీనర్ నైనాల వెంకటేశ్వర్లు, జయరావు, న్యాయవాది చుంచు సదానందం, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొగరి సుధాకర్, నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు. -
కొలువులకు కొదవుండదు
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘అన్ని వనరులు, పరిశ్రమలు ఉన్నా ఉద్యోగ, ఉపాధి మార్గాలు లేక యువత ఇబ్బంది పడుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జిల్లా నిరుద్యోగులకు కొలువుల జాతరే ఉంటుంది. నాటి తొలిదశ ఉద్యమం, నేటి మలిదశ ఉద్యమంలో జిల్లా ఉద్యోగులు చూపిన పోరాట పటిమ, పట్టుదల ఎనలేనివి. భద్రాచలం తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమే. అక్కడి ప్రజలు, ఉద్యోగుల కూడా ఈ ప్రాంతంలోనే ఉండాలని కోరుకుంటున్నారు’ అని అన్నారు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు. తెలంగాణ పునర్నిర్మాణం, జిల్లా ప్రజలకు కలిగే లాభాలపై ఆయన ఆదివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం భద్రాచలం ప్రాంతంపై రచ్చచేస్తున్నారని అన్నారు. పోలవరం కడితే భద్రాచలం డివిజన్లో ముంపునకు గురయ్యే గ్రామాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను పరిరక్షించడంతోపాటు, ఉద్యోగులకు మేలు కలుగుతుందని అన్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమాలకు అంకరార్పణ ఇక్కడే.. ప్రత్యేత తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన తొలి, మలి దశ ఉద్యమాలకు అంకురార్పణ జిల్లా నుంచే మొదలు కావడం ఇక్కడి ప్రజలకు గర్వకారణం అన్నారు. కేటీపీఎస్, ఇతర పరిశ్రమల్లో స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడంపై నాన్ ముల్కీ గోబ్యాక్ అనే నినాదంతో ఖమ్మం గాంధీచౌక్‌లో నిరాహార దీక్ష చేసిన రవీంద్రనాధ్ రగిలించిన ఉద్యమం 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ పోరుకు ఆజ్యం పోసిందని చెప్పారు. ఐదో జోన్లో పనిచేస్తున్న ఎన్నెస్పీ ఉద్యోగులను 1985లో తెలుగుగంగ ప్రాజెక్టు పనులు జరుగుతున్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు పంపించారని, అక్కడికి వెళ్లిన తెలంగాణ ఉద్యోగులను ఆ ప్రాంత ఉద్యోగుల చులకన చేశారని అన్నారు. బట్టలు విడిపించి హేలన చేసి అక్కడ పనిచేయవద్దని వెళ్లగొట్టారని, దీనిపై ఆగ్రహించిన టీఎన్జీవో సంఘ నాయకుల అప్పటి రాష్ట్ర అధికారి స్వామినాధన్‌కు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తెలంగాణలో ఏ ప్రాంత ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో విచారణ జరపాలని రిటైడ్ ఐఏఎస్ అధికారి జయభారత్‌రెడ్డి కమిషన్ వేశారని, ఈ విచారణలో ఖమ్మం జిల్లాలో 10 వేల మంది, తెలంగాణాలో మొత్తం 58,968 మంది స్థానికేతరులు ఉన్నారని తేలిందని వివరించారు. దీనిపై 1986 మార్చి 31న విడుదల చేసిన 610 జీవో ప్రకారం స్థానికేతరులు ఇక్కడి నుంచి వెళ్లాలని చెప్పినా నేటికీ ఒక్కరు కూడా జిల్లాను వదిలి వెళ్లలేదని అన్నారు. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన గ్లిర్‌గ్లానీ కమిటీ కూడా స్థానికేతరుల విషయం ప్రస్థావించి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తేల్చిచెప్పిందన్నారు . చంద్రబాబు సీమాంధ్ర నాయకుడు కావడంతో తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేయలేదన్నారు. నాడు 10 వేల మంది ఉన్న స్థానికేతర ఉద్యోగులు నేడు జిల్లా వ్యాప్తంగా 40 వేలకు చేరారని తెలిపారు. ఇలా జిల్లాలోని వనరులు, ఖనిజ సంపదతోపాటు ఈ ప్రాంత ఉద్యోగులు కూడా దోపిడీకి గురయ్యారని, దీనికి వ్యతిరేకంగా వచ్చిన మలిదశ ఉద్యమంలో జిల్లా ప్రజలు, ఉద్యోగులు చూపిన పోరాట పటిమ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిందని చెప్పారు. కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించినప్పుడు బాసటగా నిలిచారని, సకల జనుల సమ్మెలో 44వేల మంది ఉద్యోగులు 42 రోజులు ఏకధాటిగా పాల్గొని రూ. 160 కోట్ల వేతనాలను త్యాగం చేశారని వివరించారు. కొత్తరాష్ట్రం ఏర్పడితే కొలువులకు కొదువలేదు.. కొత్త రాష్ట్రం ఏర్పడితే జిల్లాలోని చదువుకున్న విద్యార్థులకు వారి ప్రతిభ అధారంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రంగరాజు చెప్పారు. జిల్లాలో ఉన్న స్థానికేతరులు వెళ్లిపోతే ఆ స్థానాలు కూడా జిల్లా నిరుద్యోగులతోనే భర్తీ చేస్తారని అన్నారు. ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నవారికి త్వరగా ప్రమోషన్లు వస్తాయన్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖలో పనిచేస్తున్న 6 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. కేటీపీఎస్, బీపీఎల్, హెవీవాటర్‌ప్లాంట్, సింగరేణి, అశ్వారావుపేట వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కీలకమైన పోస్టుల్లో సీమాంధ్రులే ఉన్నారని, గేట్ కీపర్లు, అటెండర్లు మాత్రమే స్థానికులు ఉన్నారని, ప్రత్యేక రాష్ర్టంలో అన్ని స్థాయిల ఉద్యోగాలు మన ప్రాంతం వారికే వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు ఏ వనరులు లేని సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సీలు, మెడికల్ కాలేజీలు నెలకొల్పారని, మన ప్రాంతం వేరైన తర్వాత జిల్లాలో గిరిజన యూనివర్సీటీ, మైనింగ్ యూనివర్సీటీ నెలకొల్పి ఉన్నత విద్యను గిరిజనులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. రాజకీయ లబ్ధికోసమే భద్రాచలంపై రచ్చ వందల సంవత్సరాలుగా తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలంపై కొందరు నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసమే రచ్చ చేస్తున్నారని రంగరాజు విమర్శించారు. భద్రాచలం డివిజన్ ప్రజలు, ఉద్యోగులు ఏనాడూ సీమాంధ్రలో కలపాలని కోరలేదన్నారు. జిల్లాలో నిర్మించే పోలవరం ప్రాజెక్టుతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలు కనుమరుగవుతాయని, వందలాది గ్రామాలు ముంపునకు గురికావడంతో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న సుమారు 12వేల మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలన్నారు. స్వాతంత్య్రానికి ముందే ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం, దవళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించాలని భావించినా దవళేశ్వరం మినహా ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదని, వాటిని పూర్తి చేస్తే తెలంగాణ రతనాలు పండే నేలగా విరజిల్లుతుందని అన్నారు.