కొలువులకు కొదవుండదు | new jobs for telangana peoples in government sector | Sakshi
Sakshi News home page

కొలువులకు కొదవుండదు

Published Mon, Aug 19 2013 5:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM

new jobs for telangana peoples in government sector

 ఖమ్మం, న్యూస్‌లైన్: ‘అన్ని వనరులు, పరిశ్రమలు ఉన్నా ఉద్యోగ, ఉపాధి మార్గాలు లేక యువత ఇబ్బంది పడుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జిల్లా నిరుద్యోగులకు కొలువుల జాతరే ఉంటుంది. నాటి తొలిదశ ఉద్యమం, నేటి మలిదశ ఉద్యమంలో జిల్లా ఉద్యోగులు చూపిన పోరాట పటిమ, పట్టుదల ఎనలేనివి. భద్రాచలం తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమే. అక్కడి ప్రజలు, ఉద్యోగుల కూడా ఈ ప్రాంతంలోనే ఉండాలని కోరుకుంటున్నారు’ అని అన్నారు టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు. తెలంగాణ పునర్నిర్మాణం, జిల్లా ప్రజలకు కలిగే లాభాలపై ఆయన ఆదివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం భద్రాచలం ప్రాంతంపై రచ్చచేస్తున్నారని అన్నారు. పోలవరం కడితే భద్రాచలం డివిజన్‌లో ముంపునకు గురయ్యే గ్రామాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను పరిరక్షించడంతోపాటు, ఉద్యోగులకు మేలు కలుగుతుందని అన్నారు.
 
 తొలిదశ, మలిదశ ఉద్యమాలకు  అంకరార్పణ ఇక్కడే..
 ప్రత్యేత తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన తొలి, మలి దశ ఉద్యమాలకు అంకురార్పణ జిల్లా నుంచే మొదలు కావడం ఇక్కడి ప్రజలకు గర్వకారణం అన్నారు.   కేటీపీఎస్, ఇతర పరిశ్రమల్లో స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడంపై నాన్ ముల్కీ గోబ్యాక్ అనే నినాదంతో ఖమ్మం గాంధీచౌక్‌లో నిరాహార దీక్ష చేసిన రవీంద్రనాధ్ రగిలించిన ఉద్యమం 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ పోరుకు ఆజ్యం పోసిందని చెప్పారు. ఐదో జోన్‌లో పనిచేస్తున్న ఎన్నెస్పీ ఉద్యోగులను 1985లో తెలుగుగంగ ప్రాజెక్టు పనులు జరుగుతున్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు పంపించారని, అక్కడికి వెళ్లిన తెలంగాణ ఉద్యోగులను ఆ ప్రాంత ఉద్యోగుల చులకన చేశారని అన్నారు.
 
  బట్టలు విడిపించి హేలన చేసి అక్కడ పనిచేయవద్దని వెళ్లగొట్టారని, దీనిపై ఆగ్రహించిన టీఎన్‌జీవో సంఘ నాయకుల అప్పటి రాష్ట్ర అధికారి స్వామినాధన్‌కు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తెలంగాణలో ఏ ప్రాంత ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో విచారణ జరపాలని రిటైడ్ ఐఏఎస్ అధికారి జయభారత్‌రెడ్డి కమిషన్ వేశారని, ఈ విచారణలో ఖమ్మం జిల్లాలో 10 వేల మంది, తెలంగాణాలో మొత్తం 58,968 మంది స్థానికేతరులు ఉన్నారని తేలిందని వివరించారు. దీనిపై 1986 మార్చి 31న విడుదల చేసిన 610 జీవో ప్రకారం స్థానికేతరులు ఇక్కడి నుంచి  వెళ్లాలని చెప్పినా నేటికీ ఒక్కరు కూడా జిల్లాను వదిలి వెళ్లలేదని అన్నారు. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన గ్లిర్‌గ్లానీ కమిటీ కూడా స్థానికేతరుల విషయం ప్రస్థావించి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తేల్చిచెప్పిందన్నారు
 
 . చంద్రబాబు సీమాంధ్ర నాయకుడు కావడంతో తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేయలేదన్నారు. నాడు 10 వేల మంది ఉన్న స్థానికేతర  ఉద్యోగులు నేడు జిల్లా వ్యాప్తంగా 40 వేలకు చేరారని తెలిపారు. ఇలా జిల్లాలోని వనరులు, ఖనిజ సంపదతోపాటు ఈ ప్రాంత ఉద్యోగులు కూడా దోపిడీకి గురయ్యారని, దీనికి వ్యతిరేకంగా వచ్చిన మలిదశ ఉద్యమంలో జిల్లా ప్రజలు, ఉద్యోగులు చూపిన పోరాట పటిమ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిందని చెప్పారు. కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించినప్పుడు బాసటగా నిలిచారని, సకల జనుల సమ్మెలో 44వేల మంది ఉద్యోగులు 42 రోజులు ఏకధాటిగా పాల్గొని రూ. 160 కోట్ల వేతనాలను త్యాగం చేశారని వివరించారు.
 
 కొత్తరాష్ట్రం ఏర్పడితే కొలువులకు కొదువలేదు..
 కొత్త రాష్ట్రం ఏర్పడితే జిల్లాలోని చదువుకున్న విద్యార్థులకు వారి ప్రతిభ అధారంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రంగరాజు చెప్పారు. జిల్లాలో ఉన్న స్థానికేతరులు వెళ్లిపోతే ఆ స్థానాలు కూడా జిల్లా నిరుద్యోగులతోనే భర్తీ చేస్తారని అన్నారు. ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నవారికి త్వరగా ప్రమోషన్లు వస్తాయన్నారు.   ఇప్పటి వరకు వివిధ శాఖలో పనిచేస్తున్న 6 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. కేటీపీఎస్, బీపీఎల్, హెవీవాటర్‌ప్లాంట్, సింగరేణి, అశ్వారావుపేట వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కీలకమైన పోస్టుల్లో సీమాంధ్రులే ఉన్నారని, గేట్ కీపర్లు, అటెండర్‌లు మాత్రమే స్థానికులు ఉన్నారని, ప్రత్యేక రాష్ర్టంలో అన్ని స్థాయిల ఉద్యోగాలు మన ప్రాంతం వారికే వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు ఏ వనరులు లేని సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సీలు, మెడికల్ కాలేజీలు నెలకొల్పారని, మన ప్రాంతం వేరైన తర్వాత జిల్లాలో గిరిజన యూనివర్సీటీ, మైనింగ్ యూనివర్సీటీ నెలకొల్పి ఉన్నత విద్యను గిరిజనులకు అందుబాటులోకి తేవాలని అన్నారు.
 
 రాజకీయ లబ్ధికోసమే భద్రాచలంపై రచ్చ
 వందల సంవత్సరాలుగా తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలంపై కొందరు నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసమే రచ్చ చేస్తున్నారని రంగరాజు విమర్శించారు. భద్రాచలం డివిజన్ ప్రజలు, ఉద్యోగులు ఏనాడూ సీమాంధ్రలో కలపాలని కోరలేదన్నారు. జిల్లాలో నిర్మించే పోలవరం ప్రాజెక్టుతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలు కనుమరుగవుతాయని, వందలాది గ్రామాలు ముంపునకు గురికావడంతో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న సుమారు 12వేల మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని అన్నారు.  పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలన్నారు. స్వాతంత్య్రానికి ముందే ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం, దవళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించాలని భావించినా దవళేశ్వరం మినహా ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదని, వాటిని పూర్తి చేస్తే తెలంగాణ రతనాలు పండే నేలగా విరజిల్లుతుందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement