తూప్రాన్, న్యూస్‌లైన్: మోడీ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలోని లక్ష్మినర్సింహా ఫంక్షన్ హాల్‌లో సోమవారం బీజేపీ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల నేరవేరిందన్నారు. బీజేపీ వల్లే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలు విసిగిపోయారన్నారు. నాయకులు అవినీతిలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏనాడు ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. కేవలం తమ ఆస్తులను కూడబెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులతో పాటు మెదక్ ఎంపీ అభ్యర్థిగా చాగన్ల నరేంద్రనాథ్‌ను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్‌లో ఇమడలేకపోయా: చాగన్ల
కాంగ్రెస్ పార్టీ రౌడీల పార్టీ నరేన్ ట్రస్టు అధినేత, బీజేపీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి చాగన్ల నరేంద్రనాథ్ విమర్శించారు. కాంగ్రెస్ కోసం తన వంతు కృషి చేశానన్నారు. తన సొంత నిధులతో ప్రజా సేవ చేస్తుంటే కొందరు అది సహించేకపోయారన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, తూప్రాన్ పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డిని తనపైకి పురిగొల్పారన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుపడ్డారన్నారని, ఎమ్మెల్యే నర్సారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తూప్రాన్ వచ్చిన సందర్భంగా స్టేజీపైకి రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారన్నారు. ఈ విషయాన్ని సీఎం గమనించి తనను స్టేజీ పైకి పిలిపించారని గుర్తుచేశారు. దీంతో తాను కాంగ్రెస్‌లో ఇమడలేనని గ్రహించి ప్రజల అభీష్టం మేరకే బీజేపీలో చేరానని వివరించారు.
మోడీ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది
Published Mon, Feb 24 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
Advertisement
Advertisement