జననీ.. జయకేతనం | telangana celebrations | Sakshi
Sakshi News home page

జననీ.. జయకేతనం

Published Sat, May 31 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

జననీ.. జయకేతనం

జననీ.. జయకేతనం

నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్, డప్పుల దరువులు..కళాకారుల ఆటాపాటలతో యువత ఊర్రూతలూగింది. చిందుయక్షగానం..శ్రీకృష్ణార్జునయుద్ధం ఇక్కడి సాంస్కృతిక వైభవం చాటగా.. మరోవైపు నోరూరించే ఫుడ్‌కోర్టు భోజనప్రియులను ఆహ్వానించింది. ఇదీ..జిల్లాకేంద్రంలోని ఎన్జీకాలేజీలో జరుగుతున్న తెలంగాణ సంబురాలలో శుక్రవారం రాత్రి నెలకొన్న సందడి. అంతకుముందు ఉత్సవాలలో భాగంగా  కలెక్టర్ టి.చిరంజీవులు జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించింది ఈ అపురూప క్షణం కోసమే అని పేర్కొన్నారు.

 తెలంగాణకు గొప్ప సాంస్కృతిక, సాహితీ వైభవం ఉందని, ఇక్కడి  సంప్రదాయాలు పేరెన్నికగన్నవన్నారు. తెలంగాణ సాకారమైన సందర్భంగా వాటన్నింటినీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతోపాటు ఇక్కడి వంటలతో ఫుడ్‌కోర్టును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఎస్పీ రమారాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని, ఇంత పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా రెవెన్యూశాఖకు అభినందనలు తెలిపారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా లలిత సుమాంజలి గణపతి ప్రార్థన, కూచిపూడి నృత్యం, జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం పాటకు పాలబిందెల బాలు బృందం ఆధ్వర్యంలో ఉషారాణి, జిషిత, పాలబిందెల సాత్విక తదితరులు నృత్యం చేశారు.  హైదరాబాద్‌కు చెందిన కళానృత్యనికేతన్ బిందు, అభినయ్ బృందం వారి రాచలీల, అన్నమాచార్య కీర్తన, ‘‘వచ్చెను అలివేలు మంగా, బ్రహ్మమొక్కటే’’ అంశాలు ప్రదర్శించారు. నల్లగొండ న్యూస్ స్కూల్ నుంచి గౌస్‌బాబా బృందం ఆధ్వర్యంలో భారత వేదమున నృత్యం పేరిట వెంకట్ బృందంతో పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..., శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన చింతల చెర్వునాగభూషణం బృందం చిందు యాక్షగానం.. శ్రీకృష్ణార్జున యుద్ధం నిర్వహించారు.

ఆహా ఏమిరుచి...
అంతకుముందు జిల్లా కలెక్టరు చిరంజీవులు కళాశాల మైదానం రెండవ భాగంలో నిర్వహిస్తున్న ఫుడ్‌కోర్టును ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన వంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాల్స్‌లో చికెన్, మటన్ దమ్‌బిర్యాని, చేపల పులుసు, సకినాలు, కారపప్పలు, పుల్లట్లు, సర్వపిండితో పాటు లడ్డూలు వగైరా అందుబాటులో ఉంచారు.

పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు బారులు తీరి బిర్యాని, చేపల వంటకాలను ఆహా ఏమి రుచీ అంటూ ఆరగించారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఏజేసీ వెంకట్రావు, ఆర్‌డీఓ జహీర్, కొండకింది చినవెంకట్‌రెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి, సినీ దర్శకుడు ఎన్.శంకర్, టీజేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, టీఎన్‌జీఓ కార్యదర్శి వై.వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు ఖలీమ్, ఆదిరెడ్డి, శంకరమ్మ, రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ప్రముఖులకు సన్మానం
60 ఏళ్ల కళ సాకారమైన సందర్భంగా జిల్లాలోని ప్రముఖులకు సన్మానించనున్నట్టు కలెక్టర్ చిరంజీవులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సన్మానం పొందే వారిలో హైకోర్టు జడ్జి ఈశ్వరయ్యగౌడ్, ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌టీఐ కమిషనర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ సెక్రటరీ చోల్లెటి ప్రభాకర్, ప్రభుత్వ ఉద్యోగి కిషన్‌రెడ్డి, స్కాడ్రన్ లీడర్ ఆర్.జయసింహ, సినిమా డెరైక్టర్ ఎన్.శంకర్, సినీ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ, పద్మ అవార్డు గ్రహీత గజం అంజయ్య, గజం గోవర్ధన్, పారిశ్రామికవేత్త మీలా సత్యనారాయణ.

 విద్యావేత్త కె.చినవెంకట్‌రెడ్డి, పాస్‌పోర్టు ఆఫీసర్ శ్రీకర్‌రెడ్డి, ప్రముఖ అడ్వకేట్ మహాముద్ అలీ, ఐబీసీ న్యూస్ ఛానల్ అధినేత ఏచూరి భాస్కర్, కళాకారులు వివేక్, ప్రముఖ సేవకులు జగిని కుశలయ్య, సాహితీ ప్రముఖులు కూరేళ్ల విఠలాచారి, సాంస్కృతిక ప్రముఖలు చల్లం పాండురంగారావు (ప్రజాన్యాటమండలి), సినిమా కమేడియన్ ఆర్టిస్టు వేణుమాధవ్, కార్టూనిస్ట్ శంకర్, పబ్లిక్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో నుంచి సురేందర్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement