
ఐ డోంట్ కేర్ !
► జంతకల్ మైనింగ్‌పై నిరాధార ఆరోపణలు
► నిరూపిస్తే ఆత్మహత్యకైనా సిద్ధం : జేడీఎస్ నేత కుమారస్వామి
బొమ్మనహళ్లి : జంతకల్ మైనింగ్‌కు సంబంధించి తాను డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, నిరూపిస్తే తాను ఆత్మహత్యకైనా సిద్ధమని మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కొందరు కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల్లో తనను పలుచన చేయడానికి యత్నిస్తున్నారని, ఐడోంట్ కేర్ నన్ను ఏమీ చేయలేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయుడు రవి బెళగెరెను కావాలనే జైలుకు పంపించిన శాసనసభ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అనారోగ్య నిర్ణయాలు మంచివి కాదన్నారు. ఈ విషయంపై తాను స్పీకర్ కోళివాడను కలిసి వినతి పత్రం అందజేస్తానన్నారు.