H.D.kumaraswamy
-
ఐ డోంట్ కేర్ !
► జంతకల్ మైనింగ్‌పై నిరాధార ఆరోపణలు ► నిరూపిస్తే ఆత్మహత్యకైనా సిద్ధం : జేడీఎస్ నేత కుమారస్వామి బొమ్మనహళ్లి : జంతకల్ మైనింగ్‌కు సంబంధించి తాను డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, నిరూపిస్తే తాను ఆత్మహత్యకైనా సిద్ధమని మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అన్నారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కొందరు కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో తనను పలుచన చేయడానికి యత్నిస్తున్నారని, ఐడోంట్ కేర్ నన్ను ఏమీ చేయలేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయుడు రవి బెళగెరెను కావాలనే జైలుకు పంపించిన శాసనసభ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అనారోగ్య నిర్ణయాలు మంచివి కాదన్నారు. ఈ విషయంపై తాను స్పీకర్ కోళివాడను కలిసి వినతి పత్రం అందజేస్తానన్నారు. -
కేసులకు భయపడను: మాజీ సీఎం
శివాజీనగర్: 150 కోట్ల రూపాయల ముడుపుల ఆరోపణలు కానీ, జంతకల్ మైనింగ్ కేసులో తాను ఏ తప్పు చేయలేదని కాబట్టి భయపడేది లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ. కుమారస్వామి స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే రానున్న రోజుల్లో వారు తవ్వుకున్న గోతిలో వారే పడిపోతారని పరోక్షంగా సీఎం సిద్ధరామయ్యను హెచ్చరించారు. ఆదివారం బెంగళూర్ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్ట్ గిల్డ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో కుమారస్వామి మాట్లాడుతూ.. తనను అపరాధి స్థానంలో నిలపాలనుకునే వారికి ఇది తాత్కలిక ఆనందం మాత్రమే అన్నారు. సీఎం సిద్ధరామయ్య నడుపుతున్న ద్వేష రాజకీయాలను ఒంటరిగానే ఎదుర్కొని పోరాడుతామని చెప్పారు. ‘ జంతకల్ మైనింగ్ కేసుకు సంబంధించి నాకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పే కోర్టు మెట్లు ఎక్కేటట్లు చేశారు. ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసిన దానిపై స్పందించను, ప్రజలే తుది తీర్పు చెబుతారు. అవినీతి రహిత పాలననున అందిస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పిన మాట ప్రకారం నడుచుకోవటం లేదని ఆయన అన్నారు. లోకాయుక్త సంస్థను మూసివేసి ఏసీబీ సంస్థను సృష్టించారు’ అని కుమరస్వామి విమర్శించారు. పధకాల గురించి సీఎం గొప్పలు చెప్పుకొంటున్నారని, అయితే రాష్ట్రంలో ఎంత మంది వీటి వల్ల లబ్ధిపోందారనేది ప్రకటించాలని కోరారు. అవినీతిలో కూరుకుపోయిన వికాస్ బనసోడను న్యాయ సలహాదారుగా సీఎం సిద్ధరామయ్య నియమించుకున్నారని కుమార స్వామి దుయ్యబట్టారు. బీబీఎంపీలో మిత్రదోహం బీబీఎంలో కాంగ్రెస్‌పార్టీ మిత్ర ద్రోహానికి పాల్పడిందని కుమారస్వామి ధ్వజమెత్తారు. అందుచేత ముందు జరిగే మేయర్, ఉప మేయర్ ఎన్నికల సమయంలో తమ పార్టీ మద్దతును కొనసాగించాలా, లేదా అనే విషయమై త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. తమ పార్టీ మహిళా కార్పొరేటర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుదారులు దాడికి పాల్పడినందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. -
'మౌనంగా' ఉండమని శాసించారు
బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో జేడీఎస్ తీవ్ర పరాభవంపై మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. తాము బెంగళూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని భావిస్తే ఓటర్లు మాత్రం అందుకు స్పందించలేదని అన్నారు. ఓటమి అనంతరం ఆయన 'బీబీఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే విషయం కంటే బెంగళూరు నగరానికి మరోసారి అపాయం ఎదురవుతోందని మాత్రం చెప్పవచ్చు. ఈ ఫలితాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడరాదు, చెరువులు, భూములను కబ్జా చేసిన వారిపై పోరాటం చేయకూడదు. ఇంకా వీలైతే ఇలాంటి వాళ్లతో మీరూ (జేడీఎస్) కలిసిపోండి, అది చేతకాకపోతే మౌనంగా ఉండిపోండి' అని ప్రజలు తమ తీర్పులో స్పష్టంగా చెప్పారు' అని కుమారస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.