కేసులకు భయపడను: మాజీ సీఎం
శివాజీనగర్: 150 కోట్ల రూపాయల ముడుపుల ఆరోపణలు కానీ, జంతకల్ మైనింగ్ కేసులో తాను ఏ తప్పు చేయలేదని కాబట్టి భయపడేది లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ. కుమారస్వామి స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే రానున్న రోజుల్లో వారు తవ్వుకున్న గోతిలో వారే పడిపోతారని పరోక్షంగా సీఎం సిద్ధరామయ్యను హెచ్చరించారు. ఆదివారం బెంగళూర్ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్ట్ గిల్డ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో కుమారస్వామి మాట్లాడుతూ.. తనను అపరాధి స్థానంలో నిలపాలనుకునే వారికి ఇది తాత్కలిక ఆనందం మాత్రమే అన్నారు.
సీఎం సిద్ధరామయ్య నడుపుతున్న ద్వేష రాజకీయాలను ఒంటరిగానే ఎదుర్కొని పోరాడుతామని చెప్పారు. ‘ జంతకల్ మైనింగ్ కేసుకు సంబంధించి నాకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పే కోర్టు మెట్లు ఎక్కేటట్లు చేశారు. ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసిన దానిపై స్పందించను, ప్రజలే తుది తీర్పు చెబుతారు. అవినీతి రహిత పాలననున అందిస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పిన మాట ప్రకారం నడుచుకోవటం లేదని ఆయన అన్నారు.
లోకాయుక్త సంస్థను మూసివేసి ఏసీబీ సంస్థను సృష్టించారు’ అని కుమరస్వామి విమర్శించారు. పధకాల గురించి సీఎం గొప్పలు చెప్పుకొంటున్నారని, అయితే రాష్ట్రంలో ఎంత మంది వీటి వల్ల లబ్ధిపోందారనేది ప్రకటించాలని కోరారు. అవినీతిలో కూరుకుపోయిన వికాస్ బనసోడను న్యాయ సలహాదారుగా సీఎం సిద్ధరామయ్య నియమించుకున్నారని కుమార స్వామి దుయ్యబట్టారు.
బీబీఎంపీలో మిత్రదోహం
బీబీఎంలో కాంగ్రెస్‌పార‍్టీ మిత్ర ద్రోహానికి పాల్పడిందని కుమారస్వామి ధ్వజమెత్తారు. అందుచేత ముందు జరిగే మేయర్, ఉప మేయర్ ఎన్నికల సమయంలో తమ పార్టీ మద్దతును కొనసాగించాలా, లేదా అనే విషయమై త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. తమ పార్టీ మహిళా కార్పొరేటర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుదారులు దాడికి పాల్పడినందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు.