ఎయిర్‌పోర్టు వివాదంపై మాట్లాడను: జేసీ
విజయవాడ: విశాఖ విమానాశ్రయం వివాదంపై తానేమీ మాట్లాడనని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తానేమీ మాట్లాడినా ఉన్నది లేనట్లుగా చూపిస్తున్నారని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. మీడియా మేనేజ్‌మెంట్లు తమపై ఆధారపడి బతుకున్నాయని జేసీ వ్యాఖ్యానించారు. ఎంపీల సమావేశంలో తన వివాదంపై చర్చ జరగలేదని, ఆ సమావేశంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా తనను ఏమీ అడగలేదని జేసీ పేర్కొన్నారు.
కాగా శంషాబాద్ విమానాశ్రయంలో జేసీ దివాకర్ రెడ్డికి నిన్న చేదు అనుభవం ఎదురైంది. ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ టూటీ–200 విమానంలో ఉదయం 6.40 గంటలకు విజయవాడ వెళ్లేందుకు ఆయన విమానాశ్రయానికి వచ్చారు. ముందుగానే టికెట్ తీసుకున్న ఆయన బోర్డింగ్ పాస్ తీసుకునేందుకు విమానాశ్రయంలోకి వెళ్లగా ట్రూజెట్ సంస్థ ఆయన ప్రయాణానికి అడ్డుచెప్పింది. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. గత నెల విశాఖపట్నం విమానాశ్రయంలో ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో బోర్డింగ్ పాస్‌ను నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో జేసీ గొడవపడిన విషయం తెలిసిందే.