
'ప్రసార మాధ్యమాల భాగస్వామ్యం అవసరం'
విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు లక్ష్యం నెరవేరాలంటే ప్రసార మాధ్యమాల భాగస్వామ్యం అవసరం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుపై ఎప్పటికప్పడు ప్రచారం కోసం ఎమ్మెస్వోలతో చర్చించామని, స్థానిక, జాతీయ ఛానెళ్లలో కూడా ఈ సదస్సుపై ప్రచారం, అవగాహన కల్పించాలని ప్రతినిధులను కోరామని చెప్పారు.
సినిమా హాళ్లలో కూడా ప్రచారం చేపడతామంటూ ఇందుకు లఘుచిత్రాలను రూపొందించామన్నారు. పార్టీలకతీతంగా ఈ సదస్సులో పాల్గొనాలని కోరామని, పార్టీల నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ సహా ఇతర అన్ని పార్టీలకు లేఖలు రాసి సదస్సుకు ఆహ్వానించామన్నారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు 15 రాష్ట్రాల స్పీకర్లు హాజరవుతారని తెలిపారు. ఫిబ్రవరి 10న దలైలామా హాజరుకానున్నారని కోడెల చెప్పారు.