సర్దార్జీ జోకుల్ని ఆపలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సర్దార్జీలపై జోకులను నియంత్రించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి ఆదేశాలిచ్చినా వాటిని పాటించేలా చేయడం అసాధ్యమని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతిల ధర్మాసనం పేర్కొంది. సిక్కులపై జోకులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ మహిళా న్యాయవాది హర్విందర్ పిల్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. ‘ఒకవేళ అలాంటి ఆదేశాలిచ్చినా వాటిని ఎవరు అమలు చేస్తారు? ఎవరు పాటిస్తారు? జోకులు మనస్తత్వానికి సంబంధించినవి. పౌరులు ఇలానే ప్రవర్తించాలని ఎలా నియంత్రించగలం’అని ప్రశ్నించింది.
మీడియా కవరేజీ నిబంధనలపై ఏమంటారు?
మీడియా సమావేశాలు, ఎన్‌కౌంటర్లు, ఉగ్రవాద దాడుల వంటి వాటిపై మీడియా కవరేజీ నిబంధనలకు సంబంధించిన ప్రశ్నావళిపై రెండు వారాల్లోగా సానుకూల స్పందన తెలపాలని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రం, రాష్ట్రాలకు నోటీసు జారీ చేసింది. కోర్టు సలహాదారు గోపాల్ శంకరనారాయణన్ రూపొందించిన ఈ ప్రశ్నావళిపై కేంద్రం, చాలా రాష్ట్రాలు ఇంతవరకు స్పందించకపోవడంపై చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్‌వీ రమణల బెంచ్ మండిపడింది. నేరాల తర్వాత వచ్చే మీడియా కవరేజీల వల్ల నిందితుల ప్రాథమిక హక్కులకు, న్యాయ ప్రక్రియకు భంగం కలుగుతుందా? వంటి అంశాలపై మార్గదర్శకాల ఇచ్చేందుకు సుప్రీం కోర్టు తర్జనభర్జన పడుతోంది.