ఇండియాలో పత్రికా స్వాతంత్య్రం కుంచించుకుపోతోంది. 2016 జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ సాగిన 16 నెలల్లో పౌరుల సమాచార హక్కు, ఇంటర్నెట్ అందుబాటు, ఆన్‌లైన్ స్వాతంత్య్రంపై ఆంక్షల వల్ల దేశంలో స్వేచ్ఛాస్వాతంత్య్రాలు తగ్గిపోతున్నాయనే భావన వ్యాపించింది. బుధవారం పత్రికా స్వాతంత్య్ర దినం సందర్భంగా మీడియా తీరుతెన్నులు నిరంతరం గమనించే లాభాపేక్షలేని సంస్థ ద హూట్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో మొత్తం 180 దేశాల్లో ఇండియా 136 స్థానంలో ఉందని రిపోర్టర్స్ విదౌట్ బోర్డర్స్ అనే సంస్థ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈ కాలంలో జర్నలిస్టులపై కనీసం 54 దాడులు జరిగాయని మీడియాలో వార్తలొచ్చాయి. మీడియాకెక్కని కేసులను కూడా కలిపితే దాడుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వారిలో ఒకరు వార్తలు రాయడానికి సంబంధించిన వివాదంలో ప్రాణం పోగొట్టుకున్నారని హూట్ నివేదిక వెల్లడించింది. ఈ దాడుల్లో అత్యధికం పోలీసులు(9) చేసినవే. ఏడు కేసుల్లో రాజకీయ పార్టీల నేతలు, వారి మద్దతుదారుల పాత్ర ఉండగా, చట్టవ్యతిరేకంగా సాగే నిర్మాణాలు, ఇసుకతీత, బొగ్గు గనుల పరిశ్రమలకు చెందినవారు అయిదు కేసుల్లో దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఈ వివేదిక వివరించింది. ఇంకా మీడియా కవరేజ్‌ను మూకలు అడ్డుకున్న ఘటనల(9)తోపాటు లాయర్ల దాడులు నాలుగు వరకూ ఉన్నాయి. ఈ ఘటనల్లో చాలా వరకు పలువురు జర్నలిస్టులపై భౌతిక దాడులకు సంబంధించినవే.
విధులు నిర్వహిస్తున్న పాత్రికేయాలపై కనీసం 25 సందర్భాల్లో దాడులు జరిగాయి. ఈ దాడులు రాజకీయపక్షాల సభ్యులు, చట్టాలు చేతుల్లోకి తీసుకునే అరాచక మూకలు, లాయర్లు, ట్విటర్ ట్రాల్స్, గనుల మాఫియాలు చేసిన పనేనని ఈ నివేదిక వెల్లడించింది. సమాజ్ ఏక్తా మంచ్ పేరుతో మావోయిస్టు వ్యతిరేక వర్గం బెదిరింపుల వల్ల ప్రసిద్ధ న్యూస్ వెబ్‌సైట్ స్క్రాల్.ఇన్ విలేకరి మాలినీ సుబ్రమణ్యం కిందటేడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ వదిలిపోవాల్సివచ్చింది. ఈ దాడులు, బెదిరింపులను పరిశీలిస్తే భారత్‌లో పరిశోధించి వార్తలు రాయడం ప్రమాదకరమైన వృత్తిగా మారిపోతోందని స్పష్టమౌతోంది. ఇంత జరుగుతున్నా దాడులు చేసినవారు సేచ్ఛగా తిరుగుతున్నారు. 2014లో కేవలం 32 మందిని మాత్రమే 114 కేసుల్లో అరెస్టు చేశారు.
సెన్సార్‌షిప్–ఇంటర్నెట్ బంద్
మీడియా సంస్థలపై సెన్సార్‌షిప్, ఇంటర్నెట్ ప్రసారాల నిలిపివేత నిత్యకృత్యాలుగా మరాయి. కిందటేడాది జనవరిలో పఠాన్‌కోట్‌లోభారతవైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు భారత ఆర్మీ సాయుధ చర్యలకు సంబంధించిన కీలకసమాచారం వెల్లడించిందనే ఆరోపణపై ఎన్డీటీవీ ప్రసారాలను 24 గంటలపాటు నిలిపివేయాలని కిందటి నవంబర్‌లో కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆదేశించింది. తర్వాత ఈ ఆదేశాన్ని నిలిపివేసింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
మీడియాపై దాడులు
Published Thu, May 4 2017 5:10 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement