‘సాక్షి’ జర్నలిస్టులపై ఎమ్మెల్యే దౌర్జన్యం
♦ అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డ ఏపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్
♦ విప్ ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపైనా..
సాక్షి, విజయవాడ: విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ‘సాక్షి’ పత్రిక ఫొటో జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్‌పై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దాడికి తెగబడ్డారు. అనుచరులతో కలిసి తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ కెమెరాలు లాక్కొని పిడిగుద్దులు కురిపించారు. చెక్క కుర్చీలు, ఫర్నీచర్‌తో తీవ్రంగా కొట్టి గాయపర్చారు. 2014 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జలీల్‌ఖాన్ ఇటీవలే వైఎస్సార్‌సీపీని వీడి అధికార టీడీపీలో చేరారు.
అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్య వినియమ బిల్లుపై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు వైఎస్సార్‌సీపీ విప్ జారీ చేసింది. ఆ విప్‌ను వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు అంజిరెడ్డితోపాటు మరో నలుగురు నాయకులు జలీల్‌ఖాన్‌కు ఇవ్వడానికి ఆదివారం మధ్యాహ్నం వెళ్లారు. ఈ న్యూస్‌ను కవర్ చేసేందుకు ‘సాక్షి’ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఐ.సుబ్రహ్మణ్యం, సాక్షి టీవీ కెమెరామెన్ సంతోష్ వ్యాస్‌లు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు. వైఎస్సార్‌సీపీ నాయకులు విప్‌ను అందజేస్తుండగా జలీల్‌ఖాన్ రెచ్చిపోయారు. అనుచరులతో కలిసి సుబ్రహ్మణ్యం, సంతోష్‌పై దాడి చేశారు.
కింద పడేసి కాళ్లతో తన్ని గాయపర్చారు. చెక్క కుర్చీలు, ఫర్నీచర్‌తో కొట్టారు. కెమెరాలను లాక్కొని వాటిలోని ఫొటోలు, వీడియోలను తొలగించి నేలకేసి కొట్టారు. జర్నలిస్టులు అక్కడి నుంచి బయటపడి విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విప్ ఇచ్చేందుకు వెళ్లిన పార్టీ నేతలపైనా దాడి చేశారు. వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తన కార్యాలయంలోకి కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా ప్రవేశించారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ జలీల్‌ఖాన్ కూడా పోలీసులకు కౌంటర్ ఫిర్యాదు చేశారు.
అమానుషం: ఐజేయూ
విధి నిర్వహణలో ఉన్న ఫొటో, వీడియో జర్నలిస్టులపై దాడి చేయడం అమానుషమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మండిపడ్డారు. సమాజం మేలు కోసం పనిచేసే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.