జలీల్‌ఖాన్‌కు ఝలక్‌! | MLA Jaleel Khan Gives Shock To CM Chandrababu | Sakshi
Sakshi News home page

జలీల్‌ఖాన్‌కు ఝలక్‌!

Published Sun, Nov 11 2018 9:16 AM | Last Updated on Sun, Nov 11 2018 9:22 AM

MLA Jaleel Khan Gives Shock To CM Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు సీఎం ఝలక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఆశపడి, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి పచ్చ కండువా కప్పుకున్నా ఆశించిన ప్రయోజనం దక్కని పరిస్థితి ఎదురైంది. మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి చుట్టూ పలుమార్లు కాళ్లరిగేలా తిరిగారు. మంత్రి వర్గ విస్తరణ సమయం ఆసన్నమవ్వడంతో మైనార్టీ కోటాలో మంత్రి పదవి పొందేందుకు శనివారం ఉండవల్లిలో మరోసారి ముఖ్యమంత్రిని కలిశారు. మంత్రి పదవి పొందుతున్న ఎన్‌ఎండీ ఫరూక్‌ కంటే తాను సీనియర్‌నని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అందువల్ల తనకే మంత్రి పదవి ఇవ్వాలంటూ సీఎం వద్ద పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఫరూక్‌ పేరు ఖరారు చేశామని, ఇద్దరు మైనార్టీలకు మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యపడదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అలిగినా పెద్దగా ప్రయోజనం ఉండబోదని, కనీసం బుజ్జగించే ప్రయత్నాలు కూడా బాబు చేయరని భావిం చిన జలీల్‌ మౌనంగా ఇంటిదారి పట్టినట్టు తెలుస్తోంది. 

వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా వివాదాస్పద నిర్ణయాలు
మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా, ఇక మంత్రివర్గ విస్తరణ ఉండదు. జలీల్‌ఖాన్‌ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు మంత్రి పదవి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదంటూ జలీల్‌ఖాన్‌ సరిపుచ్చుకుంటున్నారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఆయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్లే ముఖ్యమంత్రి ఆయన్ను దూరంగా పెడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఆయన తీసుకున్న  నిర్ణయాలను ముస్లిం మత పెద్దలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాళేశ్వరరావు మార్కెట్‌ ఎదురుగా ఉన్న జమ్మా మసీద్‌ వక్ఫ్‌ భూమిని ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. భవానీపురంలో మరో భూమి విషయంలోనూ ఆయనకు చుక్కెదురైంది. జలీల్‌కు మంత్రి పదవి వస్తే పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోయేదని ఆయన నియోజకవర్గం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి.  

ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూ.. 
జలీల్‌ఖాన్‌ మాట్లాడే విధానమే ఆయన్ను ఇబ్బందుల్లో పడవేస్తోందని, అదే మంత్రి పదవికి దూరం చేసిందని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు. ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను బీకాంలో ఫిజిక్స్‌ చదివానని చెప్పడంతో ఆయన నవ్వులపాలయ్యారు. పార్టీ మారినందుకు చంద్రబాబు డబ్బులు ఇస్తామని చెప్పినా తాను తీసుకోలేదంటూ బహిరంగంగా చెప్పడం ద్వారా చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని చెప్పకనే చెప్పారు. ఈ వీడియో రాష్ట్రమంతా వైరల్‌ అయ్యింది. దీనికి తోడు  పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల్నే ఆయన కలుపుకొని ముందుకు వెళ్లడం లేదు. ఆయన నోటి దురుసుతనం వల్ల తన ప్రతిష్టతో పాటు పార్టీ పరువు తీస్తున్నందున చంద్రబాబు ఆయనకు మంత్రి పదవికి దూరంగా ఉంచారని నియోజకవర్గంలోని పలువురు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.  

మూడు పార్టీలు మారినా.. 
జలీల్‌ఖాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయనకు రాజకీయ జీవితం ప్రసాదించి ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించిన కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్రతోనే ఆయన విభేదించారు. నాటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి పార్టీకి దూరమయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరినా ప్రయోజనం లేకపోయింది. రాజకీయ జీవితం ముగిసిపోయిందన్న దశలో 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆయనకు పశ్చిమ నియోజకవర్గ సీటు ఇచ్చి గెలిపించారు. అయితే మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించినా ఫలితం మాత్రం దక్కలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement