రామవరప్పాడు : టీడీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘జన్మభూమి- మన ఊరు’ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ మురళీ రామవరప్పాడు, ప్రసాదంపాడులకు అనుసంధానంగా ఉన్న బల్లెంవారి వీధిలోని స్థలాన్ని సోమవారం పరిశీలించారు. సభా వేదికకు వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
సభా ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించాలని, అవసరమైనచోట మెరక చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. స్థానిక పశువైద్యశాల వద్ద వెటర్నరీ క్యాంపు, మండల పరిషత్ పాఠశాలలో ఆరోగ్య శిబిరానికి అనువుగా ఉందని గుర్తించారు.
సభాస్థలి పనులు ప్రారంభం
సభా ప్రాంగణ ప్రాంతాన్ని ఎంపిక చేసిన అనంతరం జేసీబీతో చదును చేసే నిమిత్తం నిర్మాణ పనులు ప్రారంభించారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. వంశీ మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు.
సమస్యల ‘గోడు’...
పేరుకుపోయిన సమస్యలను సీఎంకు వివరించడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రధాన సమస్యలను గుర్తించి జాబితా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా రామవరప్పాడు వంతెన, తిప్పగుంట డ్రెయిన్ సమస్యలను వివరించనున్నారు. విజయవాడ అర్బన్ తహశీల్దార్ శివరావు, ఆర్‌అండ్ బీ అధికారులు రామవరప్పాడు, ప్రసాదంపాడు వీఆర్‌వోలు, ప్రసాదంపాడు పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ప్రసాదంపాడు ఉప సర్పంచి కొమ్మా కోటేశ్వరరావు, రామవరప్పాడు ఉప సర్పంచి కొల్లా ఆనంద్ కుమార్, నాయకులు జీతం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
‘జన్మభూమి-మన ఊరు’ 2న శ్రీకారం
Published Tue, Sep 30 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement