
హాస్యంతోనే జీవితంలో సంతోషం
జీవితంలో చాలా సమస్యలకు హాస్యమే సరైన మందని ప్రధాని మోదీ అన్నారు. ఒక తిట్టు లేదా ఆయుధం కన్నా
నిజజీవితంలో హాస్యం చాలా అవసరమన్న మోదీ
- ‘తుగ్లక్’ వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ప్రసంగం
- చో రామస్వామి జర్నలిజానికీ, రాజకీయాలకూ స్ఫూర్తి అని వ్యాఖ్య
చెన్నై/న్యూఢిల్లీ: జీవితంలో చాలా సమస్యలకు హాస్యమే సరైన మందని ప్రధాని మోదీ అన్నారు. ఒక తిట్టు లేదా ఆయుధం కన్నా సరసమైన నవ్వే బలమైన ఆయుధమన్నారు. దివంగత సీనియర్ జర్నలిస్టు చో రామస్వామి స్థాపించిన తమిళ మాగజైన్ ‘తుగ్లక్’ 47వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని ప్రసంగించారు. చో రామస్వామి జీవితాన్ని ఉదహరిస్తూ జర్నలిస్టు జీవితంలో, ఆ మాటకొస్తే అందరి జీవితాల్లోనూ హాస్యం, చతురత చాలా అవసరమన్నారు. ‘మనలో మరింత హాస్యం అవసరమని నేననుకుంటున్నా. హాస్యంతోనే జీవితాల్లో సంతోషం వస్తుంది. చాలా సమస్యలకు ఇదే సరైన మందు.
చాలామటుకు బంధాలు హాస్యం వల్లే బలపడతాయి. చాలా బంధాలు తెగిపోకుండా కలకాలం నిలుస్తాయి’ అని ప్రధాని తెలిపారు. తనపై గతంలో వేసిన కార్టూన్‌ను గుర్తుచేసుకుంటూ.. వర్తమానానికి అది సరిపోతుందన్నారు. ‘చో వేసిన ఓ కార్టూన్ నాకు బాగా గుర్తుంది. కొందరు నన్ను లక్ష్యంగా చేసుకుని తుపాకులు ఎక్కుపెడుతున్నారు. ప్రజలేమో నాకు మద్దతుగా నిలుస్తున్నారు. అప్పుడు ఆ కొందరి లక్ష్యం మోదీనా? ప్రజలా? అని ప్రశ్నిస్తూ చో కార్టూన్ వేశారు. ఇప్పటి పరిస్థితులకు ఇది సరిపోతుంది’ అని చెప్పారు.
మీడియాలో ప్రజాస్వామిక వాది
చో రామస్వామికున్న హాస్య జ్ఞానం ఒకరినుంచి నేర్చుకున్నది కాదని.. దేవుడిచ్చిన వరమన్నారు. ఒకసారి తనపై గుడ్లు వేస్తున్న వ్యక్తిపై కోప్పడకుండా.. ఎందుకయ్యా పచ్చిగుడ్లు వేస్తున్నావు. కాస్త ఆమ్లెట్లు చేసి వేయొచ్చుగా అన్న హాస్యచతురత రామస్వామికే చెల్లిందన్నారు. అలాంటి వ్యక్తి తమ మధ్యన లేకపోవటం వ్యక్తిగతంగా తనకు పూడ్చలేని నష్టమని మోదీ తెలిపారు. హాస్యం నుంచే మానవుని సృజనాత్మకత బయటపడుతుందని మోదీ అన్నారు. ఓ జర్నలిస్టుగా, నటుడిగా, న్యాయవాదిగా, రాజకీయ వ్యాఖ్యాతగా అన్ని పాత్రల్లో సమర్థవంతంగా రాణించిన గొప్ప వ్యక్తి చో రామస్వామి అని ప్రధాని ప్రశంసించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటినుంచీ రామస్వామితో సత్సంబంధాలున్నాయి.
కొత్త రిపోర్టుతో మళ్లీ రండి
వ్యవసాయ రంగంలోని సమస్యలపై అధికారులు మరింత సమర్థవంతమైన పరిష్కారాలతో ముందుకు రావాలని మోదీ ఆదేశించా రు. జనవరి 5న వ్యవసాయ రంగంపై ఏర్పాటుచేసిన కార్యదర్శుల బృందం ఇచ్చిన ప్రజంటేషన్‌పై తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి సమావేశంలో మరింత లోతైన విశ్లేషణతో ముందుకు రావాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలకు సంబంధించిన అంశాలపై కార్యదర్శి స్థాయి అధికారులు 17–18 స్లైడ్స్‌తో ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ రంగాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందు కు విధివిధానాల రూపకల్పన కోసం ప్రధాని 10 బృందాల (గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీస్)ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.