జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్న సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి
కొరుక్కుపేట (చెన్నై): రాజకీయ ప్రమేయాలే మీడియాపై దాడులకు కారణమవుతున్నాయని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా లీడ్ పేరుతో మీడియాపై ‘దాడులు– బెదిరింపులు–మీడియాలో నేటి పరిస్థితి’పై జాతీయ సదస్సు ఆదివారం నిర్వహించారు. ఇందులో సాక్షి మీడియా తరఫున రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, ది హిందూ చైర్మన్ ఎన్.రామ్, ఎడిటర్ ముకుంద్ పద్మనాభన్, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ అరుణ్‌రామ్, నటి, సామాజిక కార్యకర్త గౌతమి, తమిళనాడు మంత్రి ఎం.పాండియరాజన్, ఎన్‌డీ టీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావిస్ కుమార్, డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, వెటరన్ జర్నలిస్ట్ భాస్కర్‌లతో పాటు పలు తమిళ మీడియా, ఇతర పత్రికలు, చానళ్ల సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.
రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. మీడియాలో రాజకీయాల పాత్ర ఎంతున్నా, ప్రస్తుతం మీడియా, రాజకీయాలు విడిపోయాయన్నారు. తమకు అనుకూలంగా లేకపోతే ఏకంగా ప్రభుత్వాలే దాడులకు దిగడం వేదన కలిగిస్తుందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలకు, మీడియాకు వివరణ ఇచ్చేందుకు సాహసించడం లేదన్నారు. ఈ సందర్భంగా మీడియాపై సాగుతున్న దాడులపై చర్యలు, మీడియా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై 5 తీర్మానాలు చేశారు. తీర్మానాలను కేంద్రంతోపాటు దక్షిణ భారతంలోని రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించనున్నట్లు సదస్సు కోఆర్డినేటర్ సంధ్య రవిశంకర్ తెలిపారు. సదస్సులో జర్నలిజం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment