ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్..నవతరం అధ్యయన సాధనం | Project-based learning tool lerningnavataram | Sakshi
Sakshi News home page

ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్..నవతరం అధ్యయన సాధనం

Published Sun, Jul 20 2014 11:32 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

Project-based learning tool lerningnavataram

‘బోర్డ్‌పై టీచర్ ఒక ప్రాబ్లమ్ కాన్సెప్ట్‌ను వివరించడం.. విద్యార్థులు తమ పుస్తకాల్లో నోట్ చేసుకోవడం’.. క్లాస్ రూం అనగానే సాధారణంగా గుర్తొచ్చే ఊహాచిత్రం. ఇందుకు భిన్నంగా ఇటీవల కాలంలో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఒక అంశంపై అత్యంత మెరుగైన నైపుణ్యాన్ని అందించేందుకు ఎన్నో మార్గాలు, సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో సరికొత్త అధ్యయన సాధనంగా విద్యార్థుల ఆదరణ పొందుతోంది.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. విద్యార్థులనుభాగస్వాములను చేస్తూ.. ఒక అంశంపై రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌పై ఈ వారం ఫోకస్..
 
క్రియేటివిటీ.. కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్.. ఒక విద్యార్థి కెరీర్‌లో రాణించడానికి అత్యంత అవసరమైన నాలుగు ప్రధాన లక్షణాలు. ఈ నాలుగు లక్షణాలు అలవడేలా.. ప్రాక్టికల్ నైపుణ్యాల్ని అందించే సాధనమే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్! ఏదైనా ఒక పాఠంలోని అంశానికి సంబంధించి సమస్యను గుర్తించడం.. టీచర్ పర్యవేక్షణలో ఆ సమస్యకు మూలాలు.. పరిష్కార మార్గాలు కనుగొనడం.. ఆ దిశగా పరిశోధన చేయడం.. వెరసి సదరు అంశంపై ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవడం.. స్థూలంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ముఖ్య ఉద్దేశం ఇది. ఎన్నో ఏళ్ల క్రితమే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు అంకురార్పణ జరిగినా.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది.  
 
ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.. ప్రాక్టికల్ స్వరూపం

ఇప్పటివరకు మనకు తెలిసిన యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు అడ్వాన్స్‌డ్ స్వరూపమే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌లో పాఠ్య పుస్తకంలోని నిర్దిష్ట అంశానికి సంబంధించిన ప్రాక్టికల్ యాక్టివిటీస్ ద్వారా అవగాహన లభిస్తుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానంలో.. తరగతిలోని విద్యార్థుల ముందు ఒక సమస్యను ఉంచి.. ఆ సమస్య పరిష్కారానికి వాస్తవ సామాజిక పరిస్థితుల కోణంలో మార్గాలు అన్వేషించేలా ప్రోత్సహిస్తారు. అందుకే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే.. ఒక చిన్నపాటి పరిశోధన చేయడం! ఒక సమస్యను గుర్తించాక.. ఆ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించడం.. అన్నింటిలోకి అత్యంత అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవడం.. తర్వాత దశలో ఆ సమస్యకు సంబంధించి.. అప్పటికే  తాము పాఠ్య పుస్తకంలో నేర్చుకున్న అంశాల పరిజ్ఞానాన్ని అన్వయించడం.. వాటిని సామాజిక పరిస్థితులతో బేరీజు వేసుకుంటూ పరిష్కారం కనుగొనడం.. మొత్తంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ స్వరూపం ఇలా ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు తమ సృజనాత్మక నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకునే అవకాశం లభిస్తుంది. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా అలవడతాయి. ఫలితంగా భవిష్యత్తులో ఎంచుకున్న రంగంలో మరింత ఉన్నతంగా రాణించడానికి మార్గం సులభం అవుతుంది.
 
నిరంతర ప్రాజెక్ట్ వర్క్

ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో.. నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేసే విధంగా ప్రాజెక్ట్ వర్క్ తప్పనిసరి. ఈ ప్రాజెక్ట్ వర్క్ అంశం ఎంపిక అనేది విద్యార్థి ఆసక్తి, అభిరుచి, బ్రాంచ్ లేదా స్పెషలైజేషన్‌పై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల సదరు విద్యార్థికి ఒక అంశంలో మాత్రమే క్షేత్రస్థాయి నైపుణ్యాలు అలవడతాయి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది తరగతి గదిలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఫలితంగా విద్యార్థులు అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. సిలబస్‌లో నేర్చుకున్న అంశాల ఆధారంగా వాస్తవ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతమవుతుంది.
 
అన్నింటిపైనా అవగాహన

ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లోని మరో ప్రధాన ప్రయోజనం.. విద్యార్థులకు తమ కోర్ సబ్జెక్ట్‌లు మొదలు.. సామాజిక పరిస్థితులపైనా అవగాహన లభించడం. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానంలో ఒక అంశానికి సంబంధించి సమస్యను పరిష్కరించే క్రమంలో.. సామాజిక పరిస్థితులపై సమస్య ప్రభావం.. ఆ సమస్య పరిష్కారం ద్వారా సామాజికంగా కలిగే లాభాల గురించి కూడా తెలుస్తుంది. దీనిద్వారా విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ కూడా అలవడటం ఈ విధానంలోని మరో ప్రయోజనం.
 
సోషల్ టు టెక్నికల్.. హైస్కూల్ టు పీజీ

ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానం కేవలం టెక్నికల్, మేనేజ్‌మెంట్ కోర్సులు.. ఉన్నత స్థాయి చదువులకే పరిమితం కాదు. సోషల్ సెన్సైస్ నుంచి సాంకేతిక విభాగం కోర్సుల వరకు.. హైస్కూల్ స్థాయి నుంచి పీజీ కోర్సుల వరకు ప్రతి విభాగంలో ప్రతి కోర్సులో.. ప్రతి స్థాయిలో అమలు చేయొచ్చు. కోర్సు.. స్థాయి ఏదైనా ఈ విధానం ఉద్దేశం విద్యార్థుల్లో సహజ నైపుణ్యాలను వెలికితీయడమే. పూర్తిగా గ్రాఫ్‌లు, ఫార్ములాలకే పరిమితమయ్యే మ్యాథమెటిక్స్‌లో నైపుణ్యం ఆధారంగా కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు ఆస్కారం ఉందనడం అతిశయోక్తి కాదు.
 
పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా..
 
కేవలం పాఠ్యాంశాలు, సిలబస్‌లోని నిర్దేశిత అంశాలకే పరిమితం కాకుండా.. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా.. ఏ అంశంలోనైనా ఒక సమస్యను పరిష్కరించేలా ప్రోత్సహించడం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లోని మరో ప్రత్యేకత. దీని ప్రధాన ఉద్దేశం సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించడం. ఈ తరహా నైపుణ్యాలను తెలుసుకునేందుకు కొన్ని సంస్థలు ఉమ్మడి వేదికల ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. ఇన్ఫోసిస్ వంటి సంస్థలు పోటీలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు ఒక ఐడియాతో వెళ్లి.. దానికి కార్యరూపమిస్తే బహుమతులు అందించడంతోపాటు.. తమ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.
 
క్రమేణా పెరుగుతున్న అవగాహన

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎప్పటి నుంచో సమర్థంగా అమలవుతోంది. మన దేశంలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌పై ఇప్పుడిప్పుడే అవగాహన  పెరుగుతోంది. ప్రధానంగా టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్ ఈ తరహా విధానానికి తెరదీస్తున్నాయి. ఐఐటీ-గాంధీనగర్ తొలిసారి అకడెమిక్ స్థాయిలో పీబీఎల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఐఐటీ-బాంబే కూడా ‘ఈ-యంత్ర రోబోటిక్స్ కాంపిటీషన్’ పేరుతో వ్యవసాయ సాగు విధానాలలో రైతులకు తోడ్పడే సాధనాలను ఆవిష్కరించడానికి పోటీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.
 
పలు సంస్థల ప్రతిపాదన

మన దేశంలోని ప్రస్తుత కరిక్యులం, వాస్తవ అవసరాల మధ్య తేడాను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ), నాస్కామ్ తదితర సంస్థలు అకడెమిక్ స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నేటి అవసరాలను తీర్చే విధంగా కరిక్యులంలోనే పీబీఎల్ విధానాన్ని అంతర్భాగం చేయాలని సీఐఐ సూచించింది.
 
అధ్యాపకుల పాత్ర కీలకం

పీబీఎల్ విధానం అమలులో అధ్యాపకులదే ప్రధాన పాత్ర. విద్యార్థులకు నిర్దిష్ట సమస్యను కేటాయించడం.. దాని పరిష్కారం కనుగొనే దిశగా పర్యవేక్షణ, సలహాలు, సూచనలు అందించడంలో అధ్యాపకులే కీలకం.  ఈ మేరకు ఆబ్జెక్టివ్స్, చెక్‌లిస్ట్ రూపొందించ డం వంటి వాటిపై ముందుగా వారికి అవగాహన ఉండాలి. ఒక సమస్యను కేటాయించే ముందు ఆ సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కారాల గురించి కూడా తెలిసుండాలి. అంతేకాకుండా తమ తరగతిలోని విద్యార్థుల ఆసక్తి, అభిరుచిని గుర్తించి..  విద్యార్థులను ఒక బృందంగా ఏర్పరచడం అత్యంత కీలకం. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లో.. ఒక తరగతిలో ఆలోచనలు, ఆసక్తుల్లో సారూప్యమున్న విద్యార్థులను గుర్తించడం.. బృందాలుగా ఏర్పరచడం ద్వారానే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అందుకే.. పీబీఎల్‌పై అధ్యాపకులకు కూడా పూర్తి స్థాయి అవగాహన లభించేలా.. అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు (ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్) నిర్వహిస్తున్నారు.
 
STEMవిభాగంలో ఎంతో అవసరం

మన సామాజిక అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌ను అకడెమిక్ స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా TEM (Science, Technology, Engineering, Management)విభాగంలో పీబీఎల్ ద్వారా విద్యార్థులకు రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. దీనికోసం.. విద్యా సంస్థలతోపాటు, సంబంధిత పరిశ్రమ వర్గాల తోడ్పాటు ఉంటే మంచి ఫలితాలు ఆశించొచ్చు. విద్యార్థులను కాలేజ్ స్థాయి నుంచే కంపెనీల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దొచ్చు. పీబీఎల్ వల్ల ఫ్లెక్సిబుల్ లెర్నింగ్‌కు ఎంతో ఆస్కారం లభిస్తుంది. కరిక్యులంలో లేదు కదా.. అనే భావన వీడి విద్యార్థులు.. అధ్యాపకులు ఈ విధానానికి శ్రీకారం చుడితే అద్భుత నైపుణ్యాలు సొంతమవుతాయి. భవిష్యత్తులో చక్కటి అవకాశాలు అందుకోవడానికి వీలవుతుంది.
 - ప్రొఫెసర్ బి.వి. నారాయణ
 ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్, ఐఐఎస్‌సీ-బెంగళూరు

 
ఆర్ అండ్ డీ దిశగా తొలి అడుగు

ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని.. విద్యార్థుల కోణంలో రీసెర్‌‌చ అండ్ డెవలప్‌మెంట్ దిశలో తొలి అడుగుగా పేర్కొనొచ్చు. ఈ అప్రోచ్ ద్వారా విద్యార్థులకు తరగతి గదిలోనే రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఆర్ అండ్ డీ ఔత్సాహిక విద్యార్థులను గుర్తించి.. భవిష్యత్తులో వారు పీహెచ్‌డీ దిశగా వెళ్లే ప్రోత్సాహక సాధనంగానూ పీబీఎల్ విధానం తోడ్పడుతుంది. మన దేశంలో ఇంకా పూర్తి స్థాయిలో పీబీఎల్‌పై అవగాహన కలగడం లేదు. దీనికి సంబంధించి విద్యా సంస్థలు, అధ్యాపకులు చొరవ తీసుకోవాలి. పరిశ్రమ వర్గాలతో సంప్రదించి చిన్నపాటి పరిశోధనలను కళాశాల లేబొరేటరీలు, తరగతి గదుల్లోనే పూర్తి చేయాలి. తద్వారా విద్యార్థుల్లో సహజ నైపుణ్యాలు ఆవిష్కృతమయ్యేలా చూడాలి.
 - ప్రొఫెసర్ వి. వాసుదేవరావు, క్రయోజనిక్ ఇంజనీరింగ్, ఐఐటీ-ఖరగ్‌పూర్
 
ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.. విద్యార్థులకు లభించే ప్రయోజనాలు

క్రియేటివిటీ స్కిల్స్ అలవడటం.
బృందాలుగా కలిసి పనిచేసే తత్వం.
పాఠ్యాంశాలపై ఆసక్తి పెరగడం.
భవిష్యత్తులో వాస్తవ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే అవకాశం
క్లాస్ రూం నుంచే కాంటెంపరరీ అంశాలపై అవగాహన పెంచుకునే వీలు.
ముఖ్యంగా పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలపై నిరంతరం ప్రాక్టికల్ నాలెడ్జ్ లభించడం.
 
 మేనేజ్‌మెంట్‌లోనూ పీబీఎల్‌కు ఆస్కారం

 పీబీఎల్.. కేవలం టెక్నికల్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లకే అనుకూలం అనుకుంటే పొరపాటు. మేనేజ్‌మెంట్, సోషల్ సెన్సైస్ విభాగాల్లోనూ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు ఆస్కారం ఉంది. మేనేజ్‌మెంట్ కోర్సుల విషయంలో ఆయా కేస్ స్టడీలకు సంబంధించి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా పరిష్కారాలు కనుగొనే అవకాశం లభిస్తుంది. పరికరాల వినియోగం లేకపోయినా.. ఆలోచనలు, వాస్తవ ప్రామాణికాలు, సృజనాత్మకత ఆధారంగా మేనేజ్‌మెంట్ కేస్ స్టడీస్ అనాలిసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో పీబీఎల్ ఎంతో దోహదపడుతుంది.
 - ప్రొఫెసర్ వి. సీత
 డీన్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, హెచ్‌సీయూ
 
 ఐటీ విభాగాల్లో ఆవశ్యకం

 ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.. ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంతో ఉపయుక్తం. రియల్ టైం ప్రాబ్లమ్ అనాలిసిస్, సాల్వింగ్‌కు దోహదం చేసే సాధనం. విద్యార్థులు తాము పాఠ్యాంశాల్లో నేర్చుకున్న అంశాల ఆధారంగా వాస్తవ సమస్యలను పరిష్కరించడం.. ఐటీ విభాగంలో ఉంటుంది. అందుకు.. పీబీఎల్ ద్వారా అకడెమిక్ స్థాయి నుంచే అవగాహన కల్పించొచ్చు.
 - ప్రొఫెసర్ సి. కృష్ణమోహన్, హెచ్‌ఓడీ-సీఎస్‌ఈ (ఐఐటీ-హైదరాబాద్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement