మరోసారి మీడియాపై మాల్యా దాడి
Published Wed, Jun 14 2017 12:28 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
లండన్ : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి యూకేలో దర్జాగా బతుకుతున్న విజయ్ మాల్యా మరోసారి మీడియాపై నిప్పులు చెలరేగారు. భారత మీడియా తనకు వ్యతిరేకంగా తీవ్రమైన దుష్ఫ్రచారం చేస్తుందంటూ బుధవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. ఎలాంటి హద్దులు లేకుండా తనకు వ్యతిరేకంగా మీడియా ప్రచారం చేస్తుందన్నారు. ఇప్పటికే పలుమార్లు మీడియాపై మండిపడిన సంగతి తెలిసిందే. మాల్యాను భారత్ కు అప్పగించే కేసుపై నిన్ననే లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు వెళ్లే ముందు కూడా తాను నిర్దోషినంటూ చెప్పుకొచ్చారు. కానీ విచారణ ప్రారంభమైన కొద్ది సేపటికే జూలై 6కు వాయిదాపడింది. మాల్యా బెయిల్ ను కూడా యూకే కోర్టు డిసెంబర్ వరకు పొడిగించింది.
మరోవైపు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలున్నాయని చెప్పిన మాల్యా, వాటిని మీడియాకు ఇవ్వడానికి మాత్రం నిరాకరించారు. ఏం చెప్పినా మీడియా వాటిని వక్రీకరిస్తుందని పేర్కొన్నారు. మీడియా అడిగే నిర్దిష్ట ప్రశ్నలకు సమాధాలు ఇవ్వడానికి కూడా మాల్యా తిరస్కరించారు. బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు ఎగొట్టి ఆయన యూకేకి పారిపోయారు. అప్పటి నుంచి ఆయన్ని ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా స్కాంట్లాండ్ పోలీసులు ఏప్రిల్ లో మాల్యాను అరెస్టు చేశారు.
Advertisement
Advertisement