
హీరోయిన్లంటే అలుసా?
‘‘ఈ ప్రపంచంలో ఎన్నో విశేషాలు జరుగుతున్నప్పుడు మరీ నా వ్యక్తిగత జీవితాన్నే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు’’ అని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు సోనమ్ కపూర్. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తతో సోనమ్ వివాహం జరగనుందనే వార్త షికారు చేస్తోంది. ఈ వార్త పై ఆమె షూటుగా స్పందించారు. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. నా గురించి ఇలాంటి వార్తలను చెప్పేవారు మా ఫ్యామిలీ మెంబర్స్ కాదు.
ఒకవేళ నా పెళ్లి కుదిరితే స్వయంగా నేనే చెబుతా. సోనమ్ సన్నిహిత వర్గాలు ఆమె పెళ్లి కుదిరిందని చెప్పారని రాస్తున్నారు. నా సన్నిహితులు అని చెప్పుకుంటున్నవాళ్లందరూ నాకు సన్నిహితులైపోరు. అదేంటో కానీ, హీరోల గురించి పెద్దగా గాసిప్పులు రాయరు. బహుశా హీరోయిన్లంటే అలుసేమో. మేం ఎందులో తక్కువో అర్థం కావడం లేదు’’ అన్నారు సోనమ్ కపూర్. మొత్తానికి ఈ బ్యూటీకి బాగా కోపం వచ్చిందని అర్థం అవుతోంది కదూ!