నిజం చెప్పే బాధ్యత మీడియాదే | Sudharshan Reddy Writes on Media | Sakshi
Sakshi News home page

నిజం చెప్పే బాధ్యత మీడియాదే

Published Fri, Sep 29 2017 12:42 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

Sudharshan Reddy Writes on Media - Sakshi

విశ్లేషణ
గత ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 220 మందికి పైగా పాత్రికేయులను హతమార్చారు. బలమైన మార్పు వస్తోందని, ఎంతో మేధో మథనం జరగాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఈ వాస్తవం సూచిస్తోంది. గౌరీ లంకేశ్‌ హత్య, ఆ మథనాన్ని మన ఇళ్లలోకి ఈడ్చుకొచ్చేసింది. అసమ్మతులకున్న ఉదారవాద అవకాశాలను హరించడమే లక్ష్యంగా పెట్టుకున్న సంస్థలు, బృందాలపై అప్పుడప్పుడూ చేపట్టే నిరసనలు ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. ఆమె హత్య వెన్నంటే జరిగిన శంతను భౌమిక్‌ హత్య దీన్ని స్పష్టం చేసింది.

ఈ సెమినార్‌లో కీలక ఉపన్యాసాన్ని చేయమని ఆహ్వానించినప్పుడు తొలుత నేను సున్నితంగా తిరస్కరించాలని అనుకున్నాను. కానీ ఇటీవల జరుగుతున్న వివిధ ఘటనల ధ్రుతి, ఉద్వేగాల తీవ్రత, అవి వ్యక్తమౌతున్న తీరు కారణంగా నిర్దిష్టమైన అభిప్రాయానికి చేరడం మరింత కష్టంగా మారిం దని మొదటగా అనిపించింది. బహుకోణాలూ, ప్రయోజనాలూ, సాంప్రదా యేతర దృక్పథాల నుంచి ప్రపంచాన్ని పరిశీలించవలసి ఉండగా తొందరపడి వ్యాఖ్యానించడం వల్ల సమంజసమైన, హేతుబద్ధమైన చర్చను పక్కదారి పట్టించినట్టు అవుతుంది. వివిధ రకాల సామాజిక, రాజకీయ, ఆర్థిక శక్తులు, కథనాలు, వివిధ అస్తిత్వ సమస్యలతో అవి కలసి ఏర్పడిన వివిధ కూటముల మిశ్రమం ఆవిష్కృతమౌతుంది. అది చాలా అస్పష్ట చిత్రాన్ని మాత్రమే అంది స్తుంది. కాబట్టి మనం ఎక్కడ, ఏ లక్ష్యాలతో ప్రారంభించాం, ఏం తప్పు జరిగింది అనే లోతైన పునరాలోచన అవసరం.

అంతర్జాతీయ, జాతీయ, స్థానిక స్థాయిలలోని సమష్టి కార్యాచరణ రూపాలు, ఉద్దేశాల ప్రామాణిక ప్రాతిపదికలు వేగంగా బలహీనపడిపోతున్నాయనేది మాత్రమే తక్కువ అస్ప ష్టంగా ఉన్నట్టుంది. పలు దృక్కోణాల పట్ల సహనం, శాంతియుతమైన చర్చ, భావాల సంఘర్షణకున్న శక్తి వంటి ప్రామాణిక ప్రాతిపదికలు మానవ సంస్కృతిలో లోతుగా వేళ్లూనుకుని ఉన్నవని మనం మాట్లాడుకుని ఎంతో కాలం కాలేదు. గత ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 220 మందికి పైగా పాత్రికే యులను హతమార్చారనే వాస్తవం క్రమంగా మింగుడుపడుతూ ఇప్పుడు వీస్తున్న గాలి దిశలో బలమైన మార్పు వస్తోందని, ఎంతో మేధో మథనం జర గాల్సిన ఆవశ్యకత ఉన్నదని సూచిస్తోంది.    

గౌరీ లంకేశ్‌ హత్య, ఆ మథనాన్ని మన ఇళ్లలోకి ఈడ్చుకొచ్చేసింది. అస మ్మతులకున్న ఉదారవాద అవకాశాలను హరించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాజకీయ సాంస్కృతిక సంస్థలు, బృందాలపై అక్కడక్కడా అప్పుడప్పుడూ చేపట్టే నిరసనలు, బహిరంగ చర్చ ఎలాంటి ప్రభావాన్ని చూపలేవని ఆమె హత్యను వెన్నంటే జరిగిన శంతను భౌమిక్‌ హత్య స్పష్టం చేసింది. ముందు ముందు మనం చేయాల్సి ఉన్న అనివార్యమైన గొప్ప పోరాటానికి  ముందస్తు సూచనగా ఈ హత్యలు కనిపిస్తున్నాయి. మాట్లాడరాదు అన్న క్షణికమైన నా విముఖతను మాట్లాడాల్సిన అవసరం అధిగమించింది. దాడి జరుగుతున్నది సరిగ్గా మాట్లాడే హక్కుపైనే అనే అవగాహనే మాట్లాడాలన్న నా కోరకకు ప్రాతిపదిక.

ఉదారవాద ప్రజాసామ్యం పునాదులపై దాడులు
మన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికీ, మన పరిస్థితులను వివరించడా నికీ, వివిధ స్థాయిల సమష్టి కార్యాచరణ కోసం ఏర్పడిన వివిధ సంస్థలలో భాగం కావడానికీ మనుషులుగా మనకున్న ప్రాథమిక హక్కే దాడికి గురవు తోంది. అస్తిత్వపరమైన ఈ ముప్పును ముందుకు నెడుతున్నది అసమానతా వాద శక్తులేనని, వాటితో మనం పోరాడాల్సిఉందనే అవగాహన హేతు బద్ధంగా ఉండే వారిలో క్రమంగా పెరుగుతోంది. కొద్దిపాటి సంఖ్యలో ఉన్న వారు సామాజిక కార్యాచరణ వల్ల కలిగే ప్రయోజనాలలో అత్యధికాన్ని సొంతం చేసుకుని, మిగతా వారికి దాదాపుగా ఏమీ లేకుండా చేసే సామాజిక హక్కు తమకు ఉన్నదనే వాదన ఈ శక్తులను బలోపేతం చేస్తోందని కూడా వారు గుర్తిస్తున్నారు. ఈ శక్తులు ఉదారవాద ప్రజాస్వామ్యం పునాదులపైన దాడులను రోజురోజుకీ ముమ్మరం చేస్తున్నాయి. ఉదారవాద ప్రజాస్వా మ్యంలో అతి ముఖ్యమైన లక్ష్యం ఆత్మగౌర వ పరిరక్షణ. ఇతర  లక్ష్యాలన్నిటికీ అదే ఆధారం. అన్నిటినీ సొంతం చేసుకునేవారికి మాట్లాడే స్వేచ్ఛ తప్పక సమస్యాత్మకమైనది అవుతుంది. కాబట్టి ప్రజలపైన, వారి అభిప్రాయాలు, స్వరాలపైన క్రమశిక్షణ ను రుద్దాలనే తర్కంలో వాక్‌ స్వాతంత్య్ర విధ్వంసం అనివార్యం అవుతుంది.

‘‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’కు రాజ్యాంగంలోని అధికరణం 19 హామీని, సమంజసత్వాన్ని కల్పిస్తోందని సుప్రీం కోర్టు పలు తీర్పుల ద్వారా చెప్పింది. పత్రికా స్వేచ్ఛను దానికి సమానమైనదిగా పరిగణించడాన్ని సైతం అనుమ తించారు. అలాంటి స్వేచ్ఛలు ప్రజాభీష్ట ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, పరిరక్షిస్తాయి కాబట్టి అది ప్రజాస్వామ్యపు ఆవశ్యకమైన లక్షణం అవుతుంది. సహేతుకమైన ఆంక్షలు తప్ప, పౌరులకు నిర్మొహమాటమైన బహిరంగ చర్చలు సాగించడానికి అవకాశాలు లభించడం ద్వారానే ప్రజాస్వామ్యం ప్రజల ప్రభుత్వంగా ఉండగలుగుతుందని మన రాజ్యాంగం చెబుతుంది. ప్రజల్లో నిరక్షరాస్యత, పేదరికం విస్తృతంగా ఉన్నాగానీ సార్వత్రిక ఓటు హక్కు ప్రాతిపదికపై నిర్మిస్తున్న మన ప్రజాస్వామ్యం ఎంతో కాలం మన లేదని పలువురు రాజ్యాంగ నిపుణులు గతంలో పెదవి విరిచారు.  కానీ, పేదలు, నిరక్షరాస్యులైన వారే ఓటు హక్కును వినియోగించుకునేవారిలో అత్యధికులని తర్వాతి కాలంలో రుజువైంది. సహనం, రాజకీయ సమానత్వం అనే సూత్రాలపై వివిధ రాజ్యాంగబద్ధ సంస్థలను జాగ్రత్తగా నిర్మించుకునే రీతిలో మన ప్రజాస్వామ్యం దాదాపు 70 ఏళ్లుగా మనగలిగింది. అందుకు ప్రధాన కారణం ప్రజలు ఓటు హక్కును ఉపయోగించుకోవడమే.

ఉదారవాద ప్రజాస్వామ్యం పునాదులపై దాడులు
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జనాకర్షక నాయకత్వం, పోటీతత్వం గల పార్టీ రాజకీయాలు కలసి అధికారం కోసం ఎన్నికల బరిలోకి దిగే క్రమం అధికార కేంద్రీకరణకు దారి తీయవచ్చని భారత మానవతావాదులలో అత్యంత ప్రముఖులైన ఎంఎన్‌ రాయ్‌ (1946) హెచ్చరించారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పనితీరును సమీక్షించేది మళ్లీ ఎన్నికలప్పుడే కాబట్టి, ఈలోగా అధికారం నెరపేవారి అన్ని చర్యలు, ప్రత్యేకించి ప్రజలకు  తెలి యకుండా చేసే పనులు కూడా సమంజసమైనవిగా ప్రజలకు కనిపించే అవకాశం ఉన్నదంటూ రాయ్‌ వ్యాఖ్యానించారు. పేదప్రజల పేరిట పెద్ద ఎత్తున అన్యాయాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఈ భయాందోళనలు సమంజసమైనవేనని చరిత్ర నిరూపిం చింది. ప్రజల తీర్పును ఫాసిస్టు ప్రభుత్వాలు వాడుకున్నాయి, నిర్ణయాలను తీసుకునే నిరపేక్ష అధికారాన్ని కట్టబెట్టేసుకుని పౌరులకు ప్రశ్నించే స్వేచ్ఛే లేకుండా చేశాయి. మతం, జాతి, భావజాలం, వ్యక్తిత్వం, భాష, వర్ణం వంటి రకరకాల ఉద్వేగపరమైన అంశాలను అందుకు అధికారంలో ఉన్నవారు విని యోగించుకున్నారు. వాటి సహాయంతో పౌరులలో చీలికలు తెచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఆవశ్యకంగా కావలిదారు పాత్ర పోషిం చాలి. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలనూ, వాటి పర్యవసానాలనూ  వార్తలూ, వ్యాఖ్యల ద్వారా మీడియా పౌరులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే క్రమంలో విధిగా జరగవలసిన సలహా సంప్రదింపుల కార్యక్రమానికి ప్రజలను దూరం చేయడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నివారించవలసిన బాధ్యత ప్రధానంగా మీడియాదే. ఈ అర్థంలో ప్రజాస్వామ్యం అంటే వోటు హక్కు వినియోగించు కోవడం మాత్రమే కాదు, అధికార దుర్వినియోగాన్నీ, అమాయక ప్రజల హక్కులకు గండి కొట్టడాన్నీ నివారించడంతో పాటు మీడియా వంటి పౌర సమాజ సంస్థలను నిర్మించడం కూడా. కాబట్టి, ‘‘వాక్‌ స్వాతంత్య్రం’’ ప్రజా స్వామిక భాగస్వామ్యాన్ని విస్తరింపజేసే సాధనమని చెప్పవచ్చు. కానీ, వాక్‌ స్వాతంత్య్రం అత్యంత ఆవశ్యకంగా మనిషి ఆత్మగౌరవం అనే భావనలో స్థాపితమై ఉంది. అది, మానవుడు కావడం వల్ల ప్రతి పౌరుడికీ/మనిషికీ ఉండే హక్కులన్నిటిలోనికీ  కీలకమైనదీ, ప్రాథమికమైనదీ.  

గౌరీ లంకేశ్, జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో సుప్రసిద్ధమైన అనే అర్థంలో  ‘‘విజయవంతమైన’’ పాత్రికేయురాలేమీ కారు. పరిమితమైన నిధులతో, తరచుగా ఎదురయ్యే అర్థిక ఇబ్బందులతో  ఆమె దాదాపు పది వేల సర్క్యు లేషన్‌ ఉన్న ఒక ప్రాంతీయ పత్రికను నడిపారు.  కానీ ఆమె భావాల శక్తి అంత కంటే ఎక్కువ ప్రాధాన్యం గలది. పేదలను, నిర్లక్ష్యానికిగురైన వారిని, దోపి డీకి గురయ్యే వారిని లెక్కలోకి తీసుకోకుండా వదిలేస్తున్న సువ్యవస్థిత రాజకీయ ఆర్థిక వ్యవస్థకు ఆమె ప్రమాదంగా కనిపించారు. సామాజిక న్యాయంకోసం నినదించిన ఆమె గొంతును శాశ్వతంగా మూగబోయేలా చేశారు. ఇంతకు ముందెన్నోసార్లు జరిగినట్టు, భారత రాజ్యాంగపు స్ఫూర్తిని, జాతి అంతరాత్మను దారుణంగా దెబ్బతీశారు.

ఆమె హత్య మనందరికీ పంపిన హెచ్చరిక
ఆమె హత్యా దృశ్యం తక్కువ భీకరమైనదేం కాదు. తన సొంత ఇంటి ముందే కారు పార్క్‌ చేసుకుందామని గేటు తీస్తుండగా మహిళను చీకట్లోంచి వచ్చిన హంతకుడు పాశవికంగా హతమార్చాడు. ఆ హత్య పంపిన సందేశం స్పష్టమే. రాజ్యాంగపరమైన సాధనాల గురించి మాట్లాడే వారు, వాక్‌ స్వాతంత్య్రం సహజ హక్కని చాటేవారు, కొందరి బాగు కోసం దేశాన్ని కొల్ల గొడుతున్న వారికి వ్యతిరేకంగా నిర్లక్ష్యానికి గురవుతున్నవారి పక్షాన మాట్లాడే వారు ఎవరైనాగానీ.. వారి ఇళ్లల్లో సైతం సురక్షితంగా ఉండరు.  

మనం చేయాల్సింది ఏమిటి? ఇలాంటి ప్రపంచంలో మనం భయం ఎరుగని పాత్రికేయతను ఎలా ముందుకు తీసుకుపోగలం? అధికారంతో నిజం మాట్లాడటం అనేది పాత్రికేయ వృత్తిలోని ప్రథమ సూత్రం. ఆ సూత్రాన్ని పాటించడమే జాతి ద్రోహమనే చోట ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు ఎన్నో సమాధానాలు ఉండొచ్చు. అయితే నేను ఒక చిన్న సూచన చేస్తాను. పాత్రికేయవృత్తి, దానికి అవిభాజ్యమైన వాక్‌ స్వాతంత్య్రం ‘‘అధికారంతో నిజం మాట్లాడటం’’ కోసమే అయితే... అప్పుడు దాన్ని నిజాయితీగా చెప్పండి. ప్రత్యేకించి ప్రజాబాహుళ్యపు ఆత్మగౌరవాన్ని దిగ జారుస్తుండటం గురించి మాట్లాడండి. మన ఎదుట నిలిచిన ఒకే ఒక్క సత్యం అదే. దాన్ని గుర్తించడానికి, దాని గురించి మనలో మనం మాట్లాడుకోడానికి, మన పేరిట, మన తరఫున అధికారాన్ని చెలాయిస్తున్న వారితో మాట్లాడటా నికి మనం నిరాకరిçస్తున్నాం.

ప్రభుత్వంతో నిజం మాట్లాడేవారికి హాని జరిగితే ప్రజలు తమను శిక్షిస్తారని శక్తివంతులు, వారి నియంత్రణలోని బృందాలు గుర్తించేలా చేయాలి. లేకపోతే మనమంతా గౌరి, శంతను ఎదుర్కొన్న పరిస్థితినే ఎదు ర్కోవాల్సి వస్తుంది. తిరోగమించే అవకాశం మనకు లేదు. అలాచేసినా మరో నెపంతో మనపై మరోసారి దాడి చేస్తారు. ప్రభుత్వంతో నిజం మాట్లాడ టాన్ని, శక్తిహీనులైన ప్రజాశ్రేణులకు ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలపైన నిజాయితీగా మాట్లాడటాన్ని మనం తిరిగి నేర్చుకోవడం అవ సరం. పాలకులకు నిజం చెప్పేందుకు దోహదం చేసే నైతిక వ్యవస్థ పునా దులను తిరిగి పటిష్ఠం చేసేందుకు మీలో ప్రతి ఒక్కరూ నడుం బిగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.
(హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో సెప్టెంబర్‌ 25న ‘మాట్లాడే హక్కు ఎవరి కోసం?’ అనే అంశంపైన జరిగిన సెమినార్‌లో చేసిన కీలకోపన్యాసం సంక్షిప్తంగా)

వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
బి. సుదర్శన్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement