న్యూఢిల్లీ: కార్యాలయాల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు యంత్రాగాలను ఏర్పాటు చేసుకోవాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కారప్స్ (ఐడబ్ల్యూపీసీ) పలు మీడియా సంస్థలను సోమవారం కోరింది. తమ పై అధికారులు, సహోద్యోగులు తమను లైంగికంగా వేధించారంటూ పలువురు మహిళా విలేకరులు ఇటీవల బయటపెట్టడం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉండటంపై విచారం వ్యక్తం చేసిన ఐడబ్ల్యూపీసీ.. న్యాయం కోసం బాధితులు ఈ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను సంప్రదించాలని సూచించింది.
‘పై అధికారులు, సహోద్యోగుల చేతిలో లైంగిక వేధింపులకు గురై, ఆ విషయాన్ని బయటకు చెప్పేందుకు ధైర్యం ఉన్న మహిళా విలేకరులు, మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులకు ఐడబ్ల్యూపీసీ మద్దతుగా ఉంటుంది. అప్పట్లోనే ఫిర్యాదులు చేసినా మీడియా సంస్థల యాజమాన్యాలు పట్టించుకోకపోవడం దారుణం, హీనమైన విషయం. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రతి కార్యాలయంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు యంత్రాంగం ఉండాలి. కానీ చాలా మీడియా సంస్థల్లో అసలు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు’ అని ఐడబ్ల్యూపీసీ అధ్యక్షురాలు రాజలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని మీడియా సంస్థలూ తమ కార్యాలయ ప్రతి శాఖలోనూ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించడం తప్పనిసరని ఆమె స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment