
కాబూల్: మేం మారిపోయామని, మునుపటిలా లేమని తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వాళ్ల మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన లేనట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలుస్తోంది. తాజాగా కాబూల్‌లో ఆ దేశ మీడియాకు చెందిన ఓ రిపోర్టర్‌ను విధులు నిర్వహిస్తుండగా చితకబాదారు. వివరాల ప్రకారం.. టోలో న్యూస్‌కు చెందిన జియార్ యాద్ ఖాన్ అనే జర్నలిస్టు తాను రిపోర్టింగ్ చేస్తుండగా తాలిబన్లు కొట్టినట్లు చెప్పాడు.
కాగా తొలుత తాలిబన్ల దాడిలో జియార్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఖండిస్తూ అవన్ని అవాస్తవాలని అతను ట్వీట్ చేశాడు. కాబూల్ న్యూ సిటీలో పలు అంశాలపై రిపోర్ట్ చేస్తున్న సమయంలో తాలిబన్లు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపాడు. అంతేగాక కెమెరాలు, సాంకేతిక పరికరాలతో పాటు తన మొబైల్ ఫోన్ కూడా తీసుకున్నారని చెప్పాడు.