
న్యూఢిల్లీ: దేశంలో మీడియా తన విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో అవకతవకలు, అక్రమాలను అరికట్టడానికి చట్టబద్ధమైన అధికారాలతో కూడిన మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని బుధవారం ప్రతిపాదించింది. మీడియాలో నకిలీ వార్తల బెడద పెరిగిపోతుండడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సును త్వరగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం ‘వార్తల ప్రచురణ/కవరేజీలో నైతిక విలువలు’ పేరిట ఒక నివేదికను పార్లమెంట్‌లో సమర్పించింది.