మీడియాను సంతృప్తి పరచిన కేథరిన్
‘మెడ్రాస్’ చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన అందాల తార కేథరిన్ ట్రెసా. ఆ తర్వాత అమ్మడు కథకళి చిత్రంలో నటించింది. ఇటీవల కేథరిన్ నటించిన ‘కడంబన్’ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్ర విడుదలకు ముందు ప్రమోషన్ పనుల కోసం చెన్నై కొచ్చిన కేథరిన్ ట్రెసా మీడియాతో మాట్లాడింది. అప్పుడు ఆమెతోపాటు భద్రతకు జిమ్ బాయ్స్, మేకప్ ఉమెన్, టచ్ అప్ ఉమెన్ సహా అంతా వచ్చారు. అమ్మడు భేటీ ఇచ్చే సమయంలో టచ్ అప్ ఉమెన్ టచ్ చేస్తూ ఉంది. ఆమె సొంత ఊరు, తల్లిదండ్రుల గురించి ఓ పత్రికా ప్రతినిధి ప్రశ్నించగా తాను నాలుగైదు సినిమాల్లో నటించాననంది.
తానేమీ కోలీవుడ్‌కు కొత్తదాన్ని కాదుకదా, మరెందుకు ఇటువంటి పాత ప్రశ్నలు అంటూ బదులు చెప్పడానికి నిరాకరించింది. అప్పుడు తమిళ భాష కూడా రాని కేథరిన్ తెలిసి తెలియని తమిళంలో మాట్లాడింది. చివరిలో తన భేటీని తాను చెప్పినట్టే వేయాలని ఆదేశించింది. మార్చి ప్రచురించవద్దని తెలిపింది. ఏమైనా సందేహం ఉంటే ఇప్పుడే అడగండి అని తెలిపింది. తన భేటీ తప్పుగా రాకూడదని చెప్పింది. సందేహం వస్తే అడగడానికి మీ ఫోన్ నంబరు ఇవ్వండని విలేకరులు అడిగారు. అయితే తన సెల్‌ఫోన్ నంబరును ఎవరికీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అవసరమనుకుంటే నా మేనేజర్ ఫోన్ నంబరుకు సంప్రదించండి అని తెలిపి వెళ్లిపోయింది. మూడు చిత్రాల్లో మాత్రమే నటించిన స్థితిలో కేథరిన్ నడుచుకున్న విధానం మీడియా ప్రతినిధులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ విషయం గ్రహించిన అమ్మడు ‘కడంబన్’ విడులైన తర్వాత మళ్లీ అదే చోట మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సారి భద్రతకు జిమ్ బాయ్స్, టచ్ అప్ ఉమెన్ లేకుండా వచ్చింది. తమిళంలో మాట్లాడింది. మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది. అడిగిన వారికందరికీ తన సెల్‌ఫోన్ నంబరు ఇచ్చింది. కేథరిన్ ట్రెసాలో వచ్చిన ఈ మార్పు మీడియా మిత్రులను ఆశ్చర్యపోయారు. ఎట్టకేలకు తప్పు తెలుసుకున్న కేథరిన్ మిడియా మిత్రులను సంతృప్తి పరిచింది.