లైంగిక వేధింపులు తగ్గాలంటే శిక్షించాల్సిందే!
లైంగిక వేధింపులు తగ్గాలంటే అందుకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటోంది నటి కథెరిన్ ట్రెసా. కేరళా కొట్టాయంకు చెందిన ఈ మలయాళం కుట్టి మెడ్రాస్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథకళి, కణిదన్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు మధ్యలో టాలీవుడ్‌లో మెరిసి తాజాగా కడంబన్ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది. ఆర్య కథానాయకుడిగా నటించి సూపర్‌గుడ్ ఆర్‌బీ.చౌదరితో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాఘవ దర్శకుడు.కడంబన్ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నటి క్యాథరిన్ ట్రెసా ఈ చిత్రంలో నటించిన అనుభవాలను నెమరవేసుకుంది.
అవేంటో చూద్దాం..మా స్వస్థలం కేరళలోని కొట్టాయం. అయితే నేను పుట్టి పెరిగింది దుబాయ్‌లో. నాన్న ఉద్యోగం కారణంగా కుటుంబం అంతా అక్కడే నివాసం. సినిమా అంటే ఆసక్తి కారణంగానే నటనను వృత్తిగా ఎంచుకున్నాను. తక్కువ చిత్రాలైనా గుర్తుండిపోయేలాఉండాలని కోరుకుంటున్నాను.అలా ఇష్టపడి నటించిన చిత్రం కడంబన్. చిత్ర షూటింగ్‌ను కోడైకెన్నాల్ సమీపంలోని దట్టమైన అడవుల్లో తీశారు.అక్కడ కరెంట్ లేదు, సెల్‌ఫోన్లు పనిచేయవు. మా కోసం ఆ ప్రాంతంలోని ఒక గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు.అక్కడ బస చేయడం,ఈ చిత్రంలో నటించడం వ్యత్యాసమైన అనుభవం.చిత్రం ఆధ్యంతం కాళ్లకు చెప్పులు లేకుండా నటించాను.ఆ ప్రాంతంలో షూటింగ్ అనగానే మొదట హడలిపోయాను. తమిళం,తెలుగు భాషల్లో నేను ఎంతగానో కష్టపడి నటించిన చిత్రం ఇదే. అన్నట్టు నేనీ చిత్రంలో ఫైట్స్ కూడా చేశాను.ఆర్యతో నటించడంతో ఆయన మీకు బిరియానీ వండి పెట్టారా?అని అడుగుతున్నారు.నట్టడవుల్లో బిరియాని ఎలా లభిస్తుంది చెప్పండి.
అయినా ఆహార విషయంలో నేను కొన్ని కట్టుబాట్లను విధించుకున్నాను. అలాగే వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తాను. ఒక తెలుగు చిత్రంలో సింగిల్ సాంగ్‌కు రూ.65 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నారటగా అని అడుగుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు చేస్తున్న చిత్రం అది.అందులో ఒక పాటకు నటించమని అడిగారు. నాకు నచ్చడంతో నా స్థాయికి తగ్గ పారితోషికాన్ని తీసుకుని నటించాను.అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ పోటీ ఉంది.అది మంచిదే. ప్రతిభను మెరుగుపరచుకునేలా చేస్తుంది.మహిళలపై లైంగిక వేధింపుల గురించి మీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నారు.అలాంటి చర్యలకు పాల్పడేవారిని తీవ్రంగా శిక్షించాలి.అప్పుడే నేరాలు,ఘోరాలు తగ్గుతాయి.