
సాక్షి, ముంబై : ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మృతితో బాలీవుడ్ చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్‌లో మృతిచెందిన శ్రీదేవి భౌతికకాయం తరలింపుపై మీడియాలో వస్తున్న కథనాల పట్ల బాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పుడు ఆమెతో కలిసి సినిమాలు చేసిన అప్పటి హీరో రిషీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదేవిని కేవలం ‘మృతదేహం’గా పరిగణిస్తూ కథనాలు ఎలా ప్రసారం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
దుబాయ్‌లో మేనల్లుడు మోహిత్ మర్వా పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు భర్త బోనీ కపూర్, కూతురు ఖుషీతో కలిసి వెళ్లిన శ్రీదేవి గత శనివారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి శ్రీదేవి భౌతికకాయం తరలించేందుకు అధికారిక లాంఛనాల వల్ల జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీదేవి భౌతికకాయాన్ని ‘బాడీ’ అని ప్రస్తావిస్తూ.. మీడియా కథనాలు ప్రసారం చేయడాన్ని రిషీకపూర్ తప్పుబట్టారు. ‘ఎలా శ్రీదేవి అకస్మాత్తుగా బాడీ (మృతదేహం)గా మారిపోయింది. టీవీ చానెళ్లు ‘ఆమె బాడీని ముంబైకి తీసుకువస్తారంటూ’ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఉన్నఫలంగా శ్రీదేవి వ్యక్తిత్వం మాయమైపోయి.. ఆమె బాడీగా మారిపోయిందా?’ అని రిషీ కపూర్ ఆగ్రహంగా ట్వీట్ చేశారు. ‘ఇక చందమామ రాత్రులు ఉండవు. చాందినీ శాశ్వతంగా వెళ్లిపోయింది. అలాస్’ అంటూ రిషీ కపూర్ ఆదివారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Henceforth no more Moonlit nights! Chandni gone forever. Alas! pic.twitter.com/VUuO3dQebL
— Rishi Kapoor (@chintskap) February 25, 2018