నిన్న మహిళా ఎమ్మెల్యేలు,ఇవాళ మంత్రి పల్లె..
అమరావతి: ప్రజా సమస్యలపై శాసనసభలో మాట్లాడకుండా ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్న టీడీపీ సభ్యులు బుధవారం కూడా మీడియా పాయింట్ వద్ద అదే తీరును అవలంభిస్తున్నారు. నిన్న మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైఎస్‌ఆర్ సీపీ మహిళ సభ్యులను అడ్డుకుని టీడీపీ మహిళ సభ్యులు నానా రభస సృష్టిస్తే....ఇవాళ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు ఇతర టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. అధికార పార్టీ సభ్యుల తీరుపై చెవిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె, చెవిరెడ్డి మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది.
అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా తమ గొంతు నొక్కుతారా అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. సభలో తమను ఎలాగూ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, కనీసం మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనీయకపోవడం దారుణమన్నారు. అన్నిచోట్లా అధికారపక్షమే మాట్లాడాలనుకోవడం సరికాదన్నారు. రుణమాఫీ అమలు కాకపోవడం, ఇన్‌పుట్ సబ్సిడీ అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ అంశాన్ని సభలో లేవనెత్తితే ...మాట్లాడనీవ్వకుండా మైక్ కట్ చేస్తారని చెవిరెడ్డి అన్నారు.