డిప్యూటీ సీఎం ముందే మీడియా సిబ్బందిపై..
పట్నా: ఉప ముఖ్యమంత్రి సాక్షిగా మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఆయన వ్యక్తిగత సిబ్బంది ముక్కుమొహం చూడకుండా మీడియా ప్రతినిధులపై పిడిగుద్దులు కుప్పించారు. ఈ ఘటన పట్నాలోని బిహార్ సెక్రటేరియట్ వద్ద చోటు చేసుకుంది. బిహార్‌లో అధికార జేడీయూకు మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల మీద సీబీఐ అవినీతి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. లాలూ కొడుకు అయిన ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రజలకు నిజాలు చెప్పాలనీ, కేసులపై వివరణ ఇవ్వాలని జేడీయూ మంగళవారం డిమాండ్ కూడా చేసింది.
ఈ నేపథ్యంలో బిహార్‌లో రోజురోజుకు రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. తేజస్వి నుంచి రాజీనామాను కోరకపోయినా, దాదాపు అదే స్థాయిలో జేడీయూ స్పందించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం తేజస్వీ యాదవ్ కోసం సెక్రటేరియట్ వద్ద మీడియా ప్రతినిధులు ఎదురుచూస్తూ ఆయన బయటకు వచ్చే సమయంలో ప్రశ్నించేందుకు యత్నించగా ఆయన వ్యక్తిగత సిబ్బంది మీడియా ప్రతినిధులపట్ల దురుసుగా ప్రవర్తించింది. వారిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లి దాడులు చేసింది. దీనిపై పలు మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ముందే ఇది జరుగుతున్నా ఆయన పట్టించుకోకుండా ఉండటంపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.