
సాక్షి, అమరావతి: చంద్రన్న సంచార చికిత్స (104 వాహనాలు) నిర్వహణ సంస్థ తన ఉద్యోగులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పథకం నిర్వహణలో ఉన్న లోపాలపై గానీ, మందుల కొరతపైగానీ ఉద్యోగులెవరైనా పత్రికలకు గానీ, చానెళ్లకు గానీ సమాచారమిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పథకం నిర్వహణ సంస్థ పిరమిల్ స్వాస్థ్య ఈమేరకు అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది. రెండు సంవత్సరాల క్రితం వరకూ 104 వాహనాల నిర్వహణను ప్రభుత్వమే చూసేది. ఆ తర్వాత పిరమిల్ స్వాస్థ్య అనే ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు. అప్పట్నుంచీ ఈ వాహనాల్లో మందులు తగ్గిపోయాయి. కనీసం 60 రకాల మందులు ఉండాల్సి ఉంది. కానీ 15 నుంచి 18 రకాల మందులు లేవు. రక్తపరీక్షలు జరగడం లేదు. దీంతో 104 సిబ్బందిపై గ్రామీణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ విషయాలను సిబ్బంది మీడియాకు చెబుతుంటే నిర్వహణ సంస్థ బెదిరింపులకు పాల్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెట్టడం, బదిలీలు చేయడం లాంటివి చేస్తున్నారని, నాలుగేళ్ల నుంచి వేతనాలు పెంచడం లేదని, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా పిరమిల్ స్వాస్థ్య సంస్థ పట్టించుకోవడం లేదని ఉద్యోగులు మీడియాకు చెబుతున్నారు. ఓవైపు నిర్వహణ సంస్థ ఇన్నిరకాలుగా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నా కనీసం కూడా పట్టించుకోవడం లేదు. ఒక్కో వాహనానికి నెలకు రూ.2.42 లక్షలు ఇస్తున్నా కనీసం మందులు ఇవ్వకపోగా సిబ్బందిని బెదిరిస్తున్నా పట్టించుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment