న్యూఢిల్లీ: మీడియా తన పరిధికి కట్టుబడి ఉండాలని, కేసుల్ని ప్రభావితం చేసేలా మితిమీరి వ్యవహరించకుండా సమన్వయం పాటించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సున్నితమైన కేసుల్లో మీడియా సొంత విచారణ చేపట్టడం సరికాదని తేల్చి చెప్పింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మహిళలపై లైంగిక దాడుల కేసు దర్యాప్తునకు సంబంధించిన వార్తల సేకరణపై పట్నా హైకోర్టు ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
‘ఇది చిన్న విషయం కాదు. ఒక దశలో మీడియా పూర్తిగా పరిధి దాటి వ్యవహరించింది. సమన్వయం పాటించాలి. మేం అనుకుంటున్న దాన్ని చెపుతాం అని మీరు అనలేరు. మీరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ కేసును ప్రభావితం చేయకూడదు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండాలో మాకు చెప్పండి’ అని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శేఖర్ నఫాడే వాదిస్తూ.. ఈ కేసులో హైకోర్టు మీడియాపై పూర్తి నిషేధం విధించిందని కోర్టుకు తెలిపారు. మీడియాపై నియంత్రణ విషయంలో అభిప్రాయం చెప్పాలంటూ బిహార్ ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ముజఫర్‌పూర్ ఘటన బాధితులను ఇంటర్వ్యూ చేసేందుకు మహిళా లాయర్‌ను నియమిస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment