enquery
-
ఆ రెండు నంబర్ల కేంద్రంగానే విచారణ!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడిని విచారించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం దాదా పు 2 గంటలపాటు ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్ని కల నేపథ్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌కు సహకరించారా? ఆ రెండు ఫోన్ నంబర్లు ఎందుకు పంపారనే కోణంలోనే లింగయ్య విచారణ సాగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదు. అప్పటి అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశాడు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లింగయ్యను సంప్రదించిన తిరుపతన్న బీఆర్ఎస్లో ఉంటూ ఆ పారీ్టకి వ్యతిరేకంగా పని చేస్తున్న, అసమ్మతితో ఉన్న నాయకులతోపాటు వారి అనుచరుల ఫోన్ నంబర్లను సేకరించిన ఎస్ఐబీ అధికారులు వాటిని నాటి డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఇచ్చి ట్యాపింగ్ చేయించారు. ఇందులో భాగంగా నకిరేకల్‌కు చెందిన వేముల వీరేశం (అప్పట్లో బీఆర్ఎస్ అసమ్మతి నేత)తోపాటు ఆయన అనుచరులపై నిఘా ఉంచాలని అందిన ఆదేశాల మేరకు ఆ వివరాలు సేకరించే బా«ధ్యతను తిరుపతన్నకు అప్పగించారు. వీరేశంతో సన్నిహితంగా ఉంటున్న పెదకాపర్తికి చెందిన రాజ్‌కుమార్, నకిరేకల్‌కు చెందిన మదన్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయాలని భావించారు. ఆ ఇద్దరి ఫోన్ నంబర్ల కోసం తిరుపతన్న అప్పటి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సంప్రదించారు. గతంలో నల్లగొండ జిల్లాలో పనిచేసి ఉండటంతో తిరుపతన్నకు లింగయ్యతో పరిచయం ఉంది. తొలుత రెండు–మూడుసార్లు ఫోన్లో సంప్రదించిన తిరుపతన్న ఆపై ఆ ఇద్దరి ఫోన్ నంబర్లు కావాలని కోరారు. దీంతో తనకున్న పరిచయాలతో మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ నంబర్లు తీసుకున్న లింగయ్య వాటిని తిరుపతన్నకు పంపారు. ట్యాపింగ్ కేసులో తిరుపతన్న అరెస్టుకు ముందే తన ఫోన్‌ను ఫార్మాట్ చేశారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ఆ ఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇటీవల ల్యాబ్ నుంచి ఆ నివేదిక పోలీసులకు అందింది. ఇందులో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తిరుపతన్న–లింగయ్య మధ్యఫోన్ కాల్స్, ఆపై లింగయ్యనుంచి తిరుపతన్నకు మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ల ఫోన్ నంబర్లు వచ్చినట్లు తేలింది. దీని ఆధారంగా నోటీసులిచ్చి పోలీసులు లింగయ్యను విచారించారు. ఫోన్లో తిరుపతన్న ఏం అడిగారు? ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉందా? ఆ ఇద్దరి నంబర్లు ఎందుకు పంపారు? అనే వివరాలు ఆరా తీసి లింగయ్య వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. అన్ని ప్రశ్నలకూ జవాబు చెప్పా..ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. చాలా కాలంగా పరిచయం ఉన్న అధికారి కాబట్టే తిరుపతన్నతో మాట్లాడాను. మదన్‌రెడ్డి, రాజ్ కుమార్ల ఫోన్ నంబర్లు అడిగితే నా అనుచరుల నుంచి తీసుకుని ఇచ్చా. అప్పట్లోనూ ఆ నంబర్లు ఎందుకని ప్రశ్నించా. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోందని, ఆ వివరాలు తెలుసుకోవడానికే వారి నంబర్లు తీసుకున్నట్లు చెప్పారు. వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశాననేది అవాస్తవం. కేవలం మీడియాలో ప్రాచుర్యం పొందాలనే నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తా. – మీడియాతో చిరుమర్తి లింగయ్య -
Fact Check: ఈనాడు కథనానికి ఇంజనీరు బలి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తెచ్చిన సిమెంట్‌ను అవసరమైన చోట్ల వాడామని, బిల్లులు వచ్చిన తర్వాత వెనక్కి తెప్పిస్తున్నామని ‘ఈనాడు’ పత్రికకు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా వక్రభాష్యాలు చెబుతూ కథనాలను ప్రచురించింది. దీంతో ఒత్తిడికి గురైన విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ జేఈ (కాంట్రాక్ట్ ఉద్యోగి) వి.రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను వైఎస్సార్సీపీ నాయకులకు ముడిపెడుతూ ఈనెల 30వతేదీన ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించింది. ఈనెల 29న ఉదయం రేగిడి మండల జేఈ (కాంట్రాక్టు) వి.రామకృష్ణ రాజాం పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు మంగళవారం విచారణ ప్రారంభించారు. గ్రామ సచివాలయాల వారీగా వచ్చిన సిమెంట్ బస్తాలు, వినియోగంపై ఇంజినీరింగ్ అసిస్టెంట్లను రాజాం సీఐ ఎస్.శ్రీనివాస్ ఆరా తీశారు. అవసరాన్ని బట్టి ఒక సచివాలయం నుంచి మరో సచివాలయం పరిధిలో భవనాల నిర్మాణానికి సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈనెల 25న ‘ఆ సిమెంట్ బస్తాల మాటేమిటి?’ శీర్షికతో ఈనాడులో కథనం వచ్చినప్పటి నుంచి తన భర్తపై ఒత్తిళ్లు ప్రారంభమైనట్లు రామకృష్ణ భార్య ఉమాదేవి వాపోతున్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సిమెంట్ బస్తాలు వేరే సచివాలయం పరిధిలోని భవనాలకు సరఫరా చేశామని రామకృష్ణ మొత్తుకున్నా ‘ఈనాడు’ కథనంపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో రామకృష్ణ మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
పిడికిలి ఎత్తి లోపలికి.. థమ్సప్‌తో బయటికి..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరైన నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శనివారం ఉదయం కవిత విచారణకు హాజరయ్యే ముందు నుంచీ విచారణ పూర్తయి రాత్రి బయటికి వచ్చేదాకా ఉత్కంఠ కొనసాగింది. ఆమెను ఈడీ అరెస్టు చేస్తుందనే ప్రచారంతో ఆందోళనలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు.. రాత్రి ఎనిమిది గంటలకు ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నాయి. పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ ఈడీ విచారణకు వెళ్లిన కవిత.. పూర్తయ్యాక థమ్సప్ చిహ్నాన్ని చూపిస్తూ బయటికి రావడం గమనార్హం. భారీగా నేతలు, కార్యకర్తల క్యూ కవిత ఈడీ విచారణకు వెళ్లేముందే ఢిల్లీ తుగ్లక్ రోడ్‌లోని సీఎం కేసీఆర్ నివాసంతోపాటు తెలంగాణభవన్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈడీ విచారణను ఎదుర్కొనే అంశంపై మంత్రులు, న్యాయవాదులతో కవిత సీరియస్‌గా చర్చలు జరపగా.. ఆమె అరెస్ట్ ప్రచారం నేపథ్యంలో మద్దతుగా వచ్చిన కార్యకర్తలు హడావుడి సృష్టించారు. దీంతో అధికారులు తుగ్లక్‌రోడ్‌లో, ఈడీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్, పలువురు న్యాయవాదులు శుక్రవారం రాత్రి నుంచి తుగ్లక్‌రోడ్ నివాసంలోనే ఉండగా.. శనివారం ఉదయం ఏడున్నర గంటలకు మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు కేకే, నామా నాగేశ్వర్రావు, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గువ్వల బాలరాజు, గణేశ్ గుప్తా, పైలట్ రోహిత్రెడ్డిలతోపాటు వందలాది మంది కార్యకర్తలు కవితకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. వారందరికీ అక్కడే అల్పాహారం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలో పరిణామాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో ఆరా తీశారు. పిడికిలెత్తి అభివాదం చేస్తూ.. తుగ్లక్‌రోడ్ ఇంటికి వచ్చి నేతలందరినీ పలకరించిన కవిత.. పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ, విక్టరీ సంకేతం చూపుతూ 10.58 గంటలకు ఢిల్లీ పోలీసుల భద్రత మధ్య ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. ఆమె వెంట భర్త అనిల్, న్యాయవాదులు ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కవితకు మద్దతుగా నినాదాలు చేస్తూ వాహనం ముందు నడిచారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని కట్టడి చేయాల్సి వచ్చింది. ఈడీ కార్యాలయానికి చేరుకున్నాక కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ ఒక్కరే లోపలికి వెళ్లారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈడీ కార్యాలయం గేటు వరకు వెళ్లి వెనక్కి వచ్చారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి వచ్చారు. థమ్సప్ చిహ్నాన్ని చూపుతూ కారు ఎక్కి ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఆమె కారును చుట్టుముట్టిన నేతలు, కార్యకర్తలు ‘ఆప్ సంఘర్ష్ కరో.. హమ్ తుమ్హారే సాత్ హై’అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. మంగళ హారతులతో స్వాగతం నేరుగా తుగ్లక్‌రోడ్‌లోని ఇంటికి వెళ్లిన కవితకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. మహిళా నేతలు గుమ్మడికాయతో దిష్టితీసి, మంగళ హారతులు పట్టారు. తర్వాత కేటీఆర్, హరీశ్‌లతో కవిత భేటీ అయి.. విచారణ తీరును వివరించారు. సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. కవిత, కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన దిష్టి బొమ్మను దహనం చేశాయి. ఉదయం నుంచి రాత్రి దాకా టెన్షన్! కవితకు మద్దతుగా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి రావడంతో తుగ్లక్‌రోడ్, ఈడీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుగ్లక్‌రోడ్‌లో ఉదయం 7 గంటల నుంచే 100 మందికిపైగా పోలీసు సిబ్బందిని, సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్బీ) బలగాలను మోహరించారు. కవిత ఈడీ విచారణకు బయల్దేరుతున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కొంతసేపు హల్చల్ చేయగా పోలీసులు బారికేడ్లు పెట్టి నిలువరించారు. ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అన్నివైపులా బారికేడ్లు పెట్టారు. అయినా 30–40 మంది నేతలు ఈడీ కార్యాలయం వద్ద తిరుగుతూ హల్చల్ చేశారు. వారి లో కొందరు మీడియాతో మాట్లాడే ప్రయ త్నం చేయగా పోలీసులు ఆపి అక్కడి నుంచి పంపించేశారు. కేంద్ర, ఢిల్లీ ఇంటెలిజెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి అక్కడి పరిణామాలపై ప్రభుత్వాలకు నివేదించినట్టు తెలిసింది. -
బరితెగించిన అమర రాజా ఫ్యాక్టరీ యాజమాన్యం
-
మీడియా సొంత విచారణ వద్దు
న్యూఢిల్లీ: మీడియా తన పరిధికి కట్టుబడి ఉండాలని, కేసుల్ని ప్రభావితం చేసేలా మితిమీరి వ్యవహరించకుండా సమన్వయం పాటించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సున్నితమైన కేసుల్లో మీడియా సొంత విచారణ చేపట్టడం సరికాదని తేల్చి చెప్పింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మహిళలపై లైంగిక దాడుల కేసు దర్యాప్తునకు సంబంధించిన వార్తల సేకరణపై పట్నా హైకోర్టు ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఇది చిన్న విషయం కాదు. ఒక దశలో మీడియా పూర్తిగా పరిధి దాటి వ్యవహరించింది. సమన్వయం పాటించాలి. మేం అనుకుంటున్న దాన్ని చెపుతాం అని మీరు అనలేరు. మీరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ కేసును ప్రభావితం చేయకూడదు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండాలో మాకు చెప్పండి’ అని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శేఖర్ నఫాడే వాదిస్తూ.. ఈ కేసులో హైకోర్టు మీడియాపై పూర్తి నిషేధం విధించిందని కోర్టుకు తెలిపారు. మీడియాపై నియంత్రణ విషయంలో అభిప్రాయం చెప్పాలంటూ బిహార్ ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ముజఫర్‌పూర్ ఘటన బాధితులను ఇంటర్వ్యూ చేసేందుకు మహిళా లాయర్‌ను నియమిస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. -
మైనింగ్ అక్రమాలపై విచారణ మమ
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని క్వారీల ప్రాంతం... శనివారం ఉదయం 11 గంటల సమయం... అక్రమ మైనింగ్‌పై విచారణకు ప్రభత్వం ఏర్పాటు చేసి అధికారుల కమిటీ పర్యటన అప్పుడే ప్రారంభమైంది... క్వారీల్లో నిత్యం హోరెత్తించే పేలుళ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అధికారుల బృందం క్వారీలను పరిశీలించి, మధ్యాహ్నం 2 గంటలకు వెనుతిరిగింది. వారి వాహనాలు ఆ ప్రాంతం నుంచి కిలోమీటర్ కూడా వెళ్లకముందే.. క్వారీల్లో పేలుళ్లు మళ్లీ మొదలయ్యాయి. భారీ శబ్దాలతో క్వారీలు దద్దరిల్లిపోయాయి. కీలక మంత్రి ఇలాకాలో మైనింగ్ పర్మిట్లు నెల క్రితమే రద్దయినా యథాతథంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.పరిటాల శివారులోని దొనబండలో అక్రమ మైనింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సృందించింది. మైనింగ్ అక్రమాలపై నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిది. కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులతో విచారణ కమిటీని నియమించారు. అధికారుల బృందం శనివారం పరిటాల కొండ పోరంబోకు భూముల్లో నిర్వహిస్తున్న మైనింగ్ క్వారీలను తూతూమంత్రంగా పరిశీలించి చేతులు దులుపుకుంది. అటవీ భూముల్లో అక్రమంగా సాగుతున్న తవ్వకాలపై కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఒకవైపు సరిహద్దును మాత్రమే పరిశీలించి అంతా సక్రమంగానే ఉందనే నిర్ధారణకు వచ్చారు. ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారుల బృందం ఆటువైపు వెళ్లలేదు. క్వారీల హద్దులపై మరోసారి తనిఖీలు చేస్తామని అన్నారు. క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ జరుగుతోందని చెప్పగా... ఆ విషయం మైనింగ్ సేఫ్టీ అధికారులు చూసుకుంటారని బదులిచ్చారు. తమపై రాజకీయ ఒత్తిడి ఉందని, ఇంకేమీ ప్రశ్నించవద్దని మైనింగ్ అధికారులు చెప్పడం గమనార్హం. మొత్తం 94 క్వారీలకుగాను, 20 క్వారీలను నిబంధనలు పాటించకపోవడంతో నిలిపివేశామని మైనింగ్ ఏడీ వైఎస్ బాబు తెలిపారు. ఆ 20 క్వారీలు యథాతథంగా పనిచేస్తున్నాయని, తమతో వస్తే చూపిస్తామని స్థానికులు చెప్పడంతో.. అలా జరగదంటూ దాటవేశారు. మైనింగ్ యథాతథం పరిటాల సమీపంలోని క్వారీల్లో సాగుతున్న అక్రమాలపై విచారణ కోసం అధికారుల బృందం వస్తోందని ముందుగానే సమాచారం అందుకున్న నిర్వహకులు మైనింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు తిరిగి వెళ్లిపోయిన వెంటనే క్వారీల్లో తవ్వకాలను ప్రారంభించారు. నెల క్రితమే పర్మిట్లు రద్దయినప్పటికీ క్వారీలు బ్లాస్టింగ్లతో హోరెత్తిపోయాయి. కంకర లోడ్లతో వాహనాలు తరలివెళ్లాయి. అక్రమాలు ఎక్కడా లేవట! అధికార పార్టీ నేతలే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. నిబంధనల ప్రకారమే మైనింగ్ జరుగుతోందని, ఎక్కడా అక్రమాలు లేవని నివేదిక ఇవ్వాలంటూ అధికారులపై ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అక్రమంగా కొనసాగుతున్న క్వారీల జోలికి వెళ్లొద్దని, అంతా సక్రమంగానే ఉన్నట్లు మీడియాకు చెప్పాలంటూ తమకు ఆదేశాలు అందాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
టేకులపల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తెలంగాణలో ఇటీవల జరిగిన టేకులపల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ వేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేసింది. విజయ వాడ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ‘టేకులపల్లి ఎన్కౌంటర్– రాజ్యహింస’ అనే అంశంపై మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు ప్రజాసంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు. టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ను ఉమ్మడి వేదిక తీవ్రంగా ఖండించింది. బూటకపు ఎన్‌కౌం టర్లు, అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమా లను బలోపేతం చేయాలని పిలుపునిచ్చింది. ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నంభి నరసిం హయ్య మాట్లాడుతూ, ప్రపంచ తెలుగు మహాసభ లకు తెలంగాణ ప్రభుత్వం రక్తంతో స్వాగతం పలికిం దన్నారు. గత పాలకుల విధానాలనే కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. ఏపీ రైతు కూలీ సంఘం ప్ర«ధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయు లు మాట్లాడుతూ, ఎన్కౌంటర్లు, అణచివేతలతో ప్రజాఉద్యమాలను ఆపలేరన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలపై నిర్బంధం కొనసాగుతోంద న్నారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) నేతలు రామా రావు, పోలారి, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి కె. అను రాధ, న్యాయవాది వై.కోటేశ్వరరావు, పీడీఎస్‌యూ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి సతీశ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, పీడీఎం నాయకులు రామ కృష్ణ, ఎన్వీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.30 లక్షలపైన రిజిస్ట్రేషన్లపై విచారణ
న్యూఢిల్లీ: రూ.30 లక్షలకు మించి విలువ కలిగిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు చెల్లిస్తున్న పన్నుల వివరాలను బినామీ వ్యతిరేక చట్టం కింద పరిశీలించనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) మంగళవారం వెల్లడించింది. అక్రమాస్తులను కలిగి ఉన్న వారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చామంది. ఇటీవల ప్రభుత్వం రద్దు చేసిన డొల్ల కంపెనీలు, వాటి డైరెక్టర్లను కూడా ప్రస్తుతం విచారిస్తున్నామని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర చెప్పారు. అలాగే పెద్దనోట్ల ఉపసంహరణ తర్వాత అనుమానాస్పదంగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసి...ఆదాయపు పన్ను శాఖ సంప్రదించినా స్పందించని వారికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్లు సుశీల్ పేర్కొన్నారు. ప్యారడైజ్ పత్రాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామనీ, వివరాలు అందిన వెంటనే విచారణ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్యారడైజ్ పత్రాల్లో ఇప్పటికి చాలా తక్కువ సమాచారం వచ్చిందనీ, నవంబరు 15 తర్వాత పూర్తి వివరాలను వెబ్సైట్లో పెడతామని పరిశోధనాత్మక పాత్రికేయుల అంతర్జాతీయ సమాఖ్య ప్రకటించినట్లు చెప్పారు. పాన్ దరఖాస్తుల్లో 300 శాతం వృద్ధి నోట్లరద్దు తర్వాత పాన్‌కార్డు కోసం వస్తున్న దరఖాస్తుల్లో 300% వృద్ధి నమోదైందని సుశీల్ వెల్లడించారు. గతంలో పాన్‌కార్డు కోసం నెలకు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చేవనీ, ఇప్పుడు ఆ సంఖ్య 7.5 లక్షలకు చేరిందని చెప్పారు. ఇప్పటివరకు 33 కోట్ల పాన్ కార్డులను జారీ చేశామన్నారు. -
అటవీభూముల్లో తవ్వకాలపై విజిలెన్స్ విచారణ
సైదాపురం: అటవీ భూముల్లో మట్టి తవ్వకాలపై విజిలెన్స్ డీఎఫ్ఓ శ్రీనివాసులురెడ్డి విచారణ చేపట్టారు. షామైన్ రోడ్డు నుంచి మొలకలపూండ్ల వరకు తారురోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ అటవీ అధికారుల అనుమతి లేకుండానే అడవిలో 900 మీటర్ల మేర మట్టిని తరలించడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ శ్రీనివాసులునాయుడు అనే వ్యక్తి సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మొలకలపూండ్ల అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. సైదాపురం పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. అటవీశాఖ అధికారులు ఈ విషయంలో నిజాయితీగా వ్యవహరించారని సర్పంచ్ బండి వెంకటేశ్వర్లు రాతపూర్వకంగా తెలిపారు. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, రహదారి నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని గ్రామస్తులు కోరారు. శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అనుమతులు వచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రావెల్ తవ్విన 900 మీటర్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉందన్నారు. ఈ విషయమై అధికారులు సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపితే అనుమతులు వస్తాయన్నారు. అప్పటి వరకు పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట నెల్లూరు, వెంకటగిరి రేంజర్లు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌రెడ్డి, విజిలెన్స్ రేంజర్ సుబ్బారెడ్డి తదితరులున్నారు. -
ఇదేం విచారణ ?
ఫోన్లో సమాచారం తీసుకుంటే సరిపోతుందా బాధితులను కలిసిన సందర్భమే లేదు ఎంసెట్–2 లీకేజీపై బాధిత తల్లిదండ్రుల పెదవి విరుపు ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు? పరకాల : ఎంసెట్–2 పేపర్ లీకేజీపై సీఐడీ కొనసాగిస్తున్న విచారణ పట్ల బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని ఆధారాలతో బయటపెట్టినా నామమాత్రపు విచారణే చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. బాధితులను, ఎక్కువ మార్కులు వచ్చిన వారిని సైతం కలిసిన సందర్భాలు లేవని, లీకేజీ వ్యవహారంలో పరకాల, భూపాలపల్లి ప్రాంతాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతాలను సందర్శించిన దాఖాలు లేవని అంటున్నారు. మొక్కుబడి విచారణ జరిపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్–2లో తమ పిల్లలతోపాటే కోచింగ్ తీసుకొని పరీక్షకు సరిగ్గా వారం రోజుల ముందే రహస్య ప్రాంతాలకు తరలిపోవడం, తమకు తెలియని ప్రాంతంలో పరీక్షకు హాజరు కావడం, ఫలితాల్లో మార్కులతోపాటు ర్యాంకులు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసి తాము నిజాయితీతో విచారణ జరిపించామనే వాదనను వినిపించడం కోసం తాత్కాలికంగా అలా ప్రకటన చేశారని కొందరు చెబుతున్నారు. ఎక్కడో ఉండి ఫోన్లో సమాచారాన్ని సీఐడీ అధికారులు తీసుకున్నారని, పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో నుంచి ర్యాంకుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను స్వయంగా కలిసి వివరాలు సేకరించలేదని చెబుతున్నారు. ఎంసెట్–2లో లీకేజీపై లోతైన విచారణకు అధికారులు దూరంగా ఉన్నట్లు తెలుస్తుందని ఓ బాధిత విద్యార్థి తండ్రి చెబుతున్నాడు. విచారణను నిష్పాక్షపాతంగా జరిపించడం కోసం అవసరమైతే ప్రత్యక్ష్యంగా ఆందోళన చేపడుతామని చెబుతున్నారు. ఇప్పటికే ఎంసెట్–2లో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి నిరసన తెలుపాలని భావిస్తున్నారు. –ప్రైవేటులో చేద్దామని దళారుల చేతికి డబ్బు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. తమ పిల్లలను ఎలాగైన ఎంబీబీఎస్ చదివించాలనే లక్ష్యంతో కొందరు విద్యార్థుల తండ్రులు దళారులను ఆశ్రయించారని తెలుస్తోంది. డబ్బుకు కొదవ లేని ఆ కుటుంబాలు.. దళారులు అడిగినంత డబ్బు సమర్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రైవేటులో లక్షలు ఖర్చవుతాయని, అవే డబ్బులు తమకిస్తే గవర్నమెంటు సీటు లభిస్తుందని చెప్పిన దళారుల మాటలు నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంసెట్–2లో జరిగిన అక్రమాల వల్ల తమ పిల్లలకు మంచి ర్యాంకులు రాలేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో చివరకు సర్టిఫికెట్ల పరిశీలన వాయిదాపడే వరకు వెళ్లింది. కానీ ఎంసెట్–2లో ఫలితాలను తారుమారు చేసిన బాధ్యులను ఇంకా గుర్తించలేదు.