ఆ రెండు నంబర్ల కేంద్రంగానే విచారణ! | Chirumarthi Lingaiah investigation in the phone tapping case | Sakshi
Sakshi News home page

ఆ రెండు నంబర్ల కేంద్రంగానే విచారణ!

Published Fri, Nov 15 2024 4:56 AM | Last Updated on Fri, Nov 15 2024 4:56 AM

Chirumarthi Lingaiah investigation in the phone tapping case

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించిన పోలీసులు 

అదనపు ఎస్పీ తిరుపతన్నతో సంప్రదింపుల కారణంగానే విచారణకు.. 

కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన లింగయ్య 

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడిని విచారించారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం దాదా పు 2 గంటలపాటు ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్ని కల నేపథ్యంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌కు సహకరించారా? ఆ రెండు ఫోన్‌ నంబర్లు ఎందుకు పంపారనే కోణంలోనే లింగయ్య విచారణ సాగింది. 

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదు. అప్పటి అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశాడు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
 
లింగయ్యను సంప్రదించిన తిరుపతన్న 
బీఆర్‌ఎస్‌లో ఉంటూ ఆ పారీ్టకి వ్యతిరేకంగా పని చేస్తున్న, అసమ్మతితో ఉన్న నాయకులతోపాటు వారి అనుచరుల ఫోన్‌ నంబర్లను సేకరించిన ఎస్‌ఐబీ అధికారులు వాటిని నాటి డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఇచ్చి ట్యాపింగ్‌ చేయించారు. ఇందులో భాగంగా నకిరేకల్‌కు చెందిన వేముల వీరేశం (అప్పట్లో బీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత)తోపాటు ఆయన అనుచరులపై నిఘా ఉంచాలని అందిన ఆదేశాల మేరకు ఆ వివరాలు సేకరించే బా«ధ్యతను తిరుపతన్నకు అప్పగించారు. 

వీరేశంతో సన్నిహితంగా ఉంటున్న పెదకాపర్తికి చెందిన రాజ్‌కుమార్, నకిరేకల్‌కు చెందిన మదన్‌రెడ్డి ఫోన్లు ట్యాప్‌ చేయాలని భావించారు. ఆ ఇద్దరి ఫోన్‌ నంబర్ల కోసం తిరుపతన్న అప్పటి నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సంప్రదించారు. గతంలో నల్లగొండ జిల్లాలో పనిచేసి ఉండటంతో తిరుపతన్నకు లింగయ్యతో పరిచయం ఉంది. తొలుత రెండు–మూడుసార్లు ఫోన్‌లో సంప్రదించిన తిరుపతన్న ఆపై ఆ ఇద్దరి ఫోన్‌ నంబర్లు కావాలని కోరారు. దీంతో తనకున్న పరిచయాలతో మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ నంబర్లు తీసుకున్న లింగయ్య వాటిని తిరుపతన్నకు పంపారు. 

ట్యాపింగ్‌ కేసులో తిరుపతన్న అరెస్టుకు ముందే తన ఫోన్‌ను ఫార్మాట్‌ చేశారు. దీంతో డిలీట్‌ అయిన డేటాను రిట్రీవ్‌ చేయడానికి ఆ ఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఇటీవల ల్యాబ్‌ నుంచి ఆ నివేదిక పోలీసులకు అందింది. ఇందులో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తిరుపతన్న–లింగయ్య మధ్యఫోన్‌ కాల్స్, ఆపై లింగయ్యనుంచి తిరుపతన్నకు మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ల ఫోన్‌ నంబర్లు వచ్చినట్లు తేలింది. 

దీని ఆధారంగా నోటీసులిచ్చి పోలీసులు లింగయ్యను విచారించారు. ఫోన్‌లో తిరుపతన్న ఏం అడిగారు? ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం ఉందా? ఆ ఇద్దరి నంబర్లు ఎందుకు పంపారు? అనే వివరాలు ఆరా తీసి లింగయ్య వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్‌ చేశారు.  

అన్ని ప్రశ్నలకూ జవాబు చెప్పా..
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. చాలా కాలంగా పరిచయం ఉన్న అధికారి కాబట్టే తిరుపతన్నతో మాట్లాడాను. మదన్‌రెడ్డి, రాజ్‌ కుమార్‌ల ఫోన్‌ నంబర్లు అడిగితే నా అనుచరుల నుంచి తీసుకుని ఇచ్చా. అప్పట్లోనూ ఆ నంబర్లు ఎందుకని ప్రశ్నించా. 

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోందని, ఆ వివరాలు తెలుసుకోవడానికే వారి నంబర్లు తీసుకున్నట్లు చెప్పారు. వేముల వీరేశం అనుచరుల ఫోన్‌ ట్యాప్‌ చేశాననేది అవాస్తవం. కేవలం మీడియాలో ప్రాచుర్యం పొందాలనే నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తా. – మీడియాతో చిరుమర్తి లింగయ్య   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement