పరిటాల శివారు దొనబండ వద్ద మైనింగ్ క్వారీ సరిహద్దును పరిశీలిస్తున్న జిల్లా అధికారులు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని క్వారీల ప్రాంతం... శనివారం ఉదయం 11 గంటల సమయం... అక్రమ మైనింగ్‌పై విచారణకు ప్రభత్వం ఏర్పాటు చేసి అధికారుల కమిటీ పర్యటన అప్పుడే ప్రారంభమైంది... క్వారీల్లో నిత్యం హోరెత్తించే పేలుళ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అధికారుల బృందం క్వారీలను పరిశీలించి, మధ్యాహ్నం 2 గంటలకు వెనుతిరిగింది.
వారి వాహనాలు ఆ ప్రాంతం నుంచి కిలోమీటర్ కూడా వెళ్లకముందే.. క్వారీల్లో పేలుళ్లు మళ్లీ మొదలయ్యాయి. భారీ శబ్దాలతో క్వారీలు దద్దరిల్లిపోయాయి. కీలక మంత్రి ఇలాకాలో మైనింగ్ పర్మిట్లు నెల క్రితమే రద్దయినా యథాతథంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.పరిటాల శివారులోని దొనబండలో అక్రమ మైనింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సృందించింది. మైనింగ్ అక్రమాలపై నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిది.
కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులతో విచారణ కమిటీని నియమించారు. అధికారుల బృందం శనివారం పరిటాల కొండ పోరంబోకు భూముల్లో నిర్వహిస్తున్న మైనింగ్ క్వారీలను తూతూమంత్రంగా పరిశీలించి చేతులు దులుపుకుంది. అటవీ భూముల్లో అక్రమంగా సాగుతున్న తవ్వకాలపై కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఒకవైపు సరిహద్దును మాత్రమే పరిశీలించి అంతా సక్రమంగానే ఉందనే నిర్ధారణకు వచ్చారు.
ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం
అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారుల బృందం ఆటువైపు వెళ్లలేదు. క్వారీల హద్దులపై మరోసారి తనిఖీలు చేస్తామని అన్నారు. క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ జరుగుతోందని చెప్పగా... ఆ విషయం మైనింగ్ సేఫ్టీ అధికారులు చూసుకుంటారని బదులిచ్చారు.
తమపై రాజకీయ ఒత్తిడి ఉందని, ఇంకేమీ ప్రశ్నించవద్దని మైనింగ్ అధికారులు చెప్పడం గమనార్హం. మొత్తం 94 క్వారీలకుగాను, 20 క్వారీలను నిబంధనలు పాటించకపోవడంతో నిలిపివేశామని మైనింగ్ ఏడీ వైఎస్ బాబు తెలిపారు. ఆ 20 క్వారీలు యథాతథంగా పనిచేస్తున్నాయని, తమతో వస్తే చూపిస్తామని స్థానికులు చెప్పడంతో.. అలా జరగదంటూ దాటవేశారు.
మైనింగ్ యథాతథం
పరిటాల సమీపంలోని క్వారీల్లో సాగుతున్న అక్రమాలపై విచారణ కోసం అధికారుల బృందం వస్తోందని ముందుగానే సమాచారం అందుకున్న నిర్వహకులు మైనింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు తిరిగి వెళ్లిపోయిన వెంటనే క్వారీల్లో తవ్వకాలను ప్రారంభించారు. నెల క్రితమే పర్మిట్లు రద్దయినప్పటికీ క్వారీలు బ్లాస్టింగ్‌లతో హోరెత్తిపోయాయి. కంకర లోడ్‌లతో వాహనాలు తరలివెళ్లాయి.
అక్రమాలు ఎక్కడా లేవట!
అధికార పార్టీ నేతలే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. నిబంధనల ప్రకారమే మైనింగ్ జరుగుతోందని, ఎక్కడా అక్రమాలు లేవని నివేదిక ఇవ్వాలంటూ అధికారులపై ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అక్రమంగా కొనసాగుతున్న క్వారీల జోలికి వెళ్లొద్దని, అంతా సక్రమంగానే ఉన్నట్లు మీడియాకు చెప్పాలంటూ తమకు ఆదేశాలు అందాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment