Kavitha Attended For ED Investigation In Delhi Liquor Policy Scam Case - Sakshi
Sakshi News home page

పిడికిలి ఎత్తి లోపలికి.. థమ్సప్‌తో బయటికి..

Published Sun, Mar 12 2023 3:36 AM | Last Updated on Sun, Mar 12 2023 1:03 PM

Kavitha Attended ED Investigation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరైన నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శనివారం ఉదయం కవిత విచారణకు హాజరయ్యే ముందు నుంచీ విచారణ పూర్తయి రాత్రి బయటికి వచ్చేదాకా ఉత్కంఠ కొనసాగింది.

ఆమెను ఈడీ అరెస్టు చేస్తుందనే ప్రచారంతో ఆందోళనలో ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు.. రాత్రి ఎనిమిది గంటలకు ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నాయి. పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ ఈడీ విచారణకు వెళ్లిన కవిత.. పూర్తయ్యాక థమ్సప్‌ చిహ్నాన్ని చూపిస్తూ బయటికి రావడం గమనార్హం. 

భారీగా నేతలు, కార్యకర్తల క్యూ 
కవిత ఈడీ విచారణకు వెళ్లేముందే ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌లోని సీఎం కేసీఆర్‌ నివాసంతోపాటు తెలంగాణభవన్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈడీ విచారణను ఎదుర్కొనే అంశంపై మంత్రులు, న్యాయవాదులతో కవిత సీరియస్‌గా చర్చలు జరపగా.. ఆమె అరెస్ట్‌ ప్రచారం నేపథ్యంలో మద్దతుగా వచ్చిన కార్యకర్తలు హడావుడి సృష్టించారు. దీంతో అధికారులు తుగ్లక్‌రోడ్‌లో, ఈడీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మంత్రి కేటీఆర్, పలువురు న్యాయవాదులు శుక్రవారం రాత్రి నుంచి తుగ్లక్‌రోడ్‌ నివాసంలోనే ఉండగా.. శనివారం ఉదయం ఏడున్నర గంటలకు మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు కేకే, నామా నాగేశ్వర్‌రావు, బీబీ పాటిల్, వెంకటేశ్‌ నేత, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గువ్వల బాలరాజు, గణేశ్‌ గుప్తా, పైలట్‌ రోహిత్‌రెడ్డిలతోపాటు వందలాది మంది కార్యకర్తలు కవితకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. వారందరికీ అక్కడే అల్పాహారం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలో పరిణామాలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో ఆరా తీశారు. 

పిడికిలెత్తి అభివాదం చేస్తూ.. 
తుగ్లక్‌రోడ్‌ ఇంటికి వచ్చి నేతలందరినీ పలకరించిన కవిత.. పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ, విక్టరీ సంకేతం చూపుతూ 10.58 గంటలకు ఢిల్లీ పోలీసుల భద్రత మధ్య ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. ఆమె వెంట భర్త అనిల్, న్యాయవాదులు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు కవితకు మద్దతుగా నినాదాలు చేస్తూ వాహనం ముందు నడిచారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని కట్టడి చేయాల్సి వచ్చింది.

ఈడీ కార్యాలయానికి చేరుకున్నాక కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ ఒక్కరే లోపలికి వెళ్లారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈడీ కార్యాలయం గేటు వరకు వెళ్లి వెనక్కి వచ్చారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి వచ్చారు. థమ్సప్‌ చిహ్నాన్ని చూపుతూ కారు ఎక్కి ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఆమె కారును చుట్టుముట్టిన నేతలు, కార్యకర్తలు ‘ఆప్‌ సంఘర్ష్  కరో.. హమ్‌ తుమ్హారే సాత్‌ హై’అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. 

మంగళ హారతులతో స్వాగతం 
నేరుగా తుగ్లక్‌రోడ్‌లోని ఇంటికి వెళ్లిన కవితకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. మహిళా నేతలు గుమ్మడికాయతో దిష్టితీసి, మంగళ హారతులు పట్టారు. తర్వాత కేటీఆర్, హరీశ్‌లతో కవిత భేటీ అయి.. విచారణ తీరును వివరించారు. సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కవిత, కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం 
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన దిష్టి బొమ్మను దహనం చేశాయి. 

ఉదయం నుంచి రాత్రి దాకా టెన్షన్‌! 
కవితకు మద్దతుగా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి రావడంతో తుగ్లక్‌రోడ్, ఈడీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుగ్లక్‌రోడ్‌లో ఉదయం 7 గంటల నుంచే 100 మందికిపైగా పోలీసు సిబ్బందిని, సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ) బలగాలను మోహరించారు. కవిత ఈడీ విచారణకు బయల్దేరుతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు కొంతసేపు హల్‌చల్‌ చేయగా పోలీసులు బారికేడ్లు పెట్టి నిలువరించారు.

ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. అన్నివైపులా బారికేడ్లు పెట్టారు. అయినా 30–40 మంది నేతలు ఈడీ కార్యాలయం వద్ద తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. వారి లో కొందరు మీడియాతో మాట్లాడే ప్రయ త్నం చేయగా పోలీసులు ఆపి అక్కడి నుంచి పంపించేశారు. కేంద్ర, ఢిల్లీ ఇంటెలిజెన్స్‌ సిబ్బంది రంగంలోకి దిగి అక్కడి పరిణామాలపై ప్రభుత్వాలకు నివేదించినట్టు 
తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement