- ఫోన్లో సమాచారం తీసుకుంటే సరిపోతుందా
- బాధితులను కలిసిన సందర్భమే లేదు
- ఎంసెట్–2 లీకేజీపై బాధిత తల్లిదండ్రుల పెదవి విరుపు
- ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు?
ఇదేం విచారణ ?
Published Mon, Jul 25 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
పరకాల : ఎంసెట్–2 పేపర్ లీకేజీపై సీఐడీ కొనసాగిస్తున్న విచారణ పట్ల బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని ఆధారాలతో బయటపెట్టినా నామమాత్రపు విచారణే చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. బాధితులను, ఎక్కువ మార్కులు వచ్చిన వారిని సైతం కలిసిన సందర్భాలు లేవని, లీకేజీ వ్యవహారంలో పరకాల, భూపాలపల్లి ప్రాంతాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతాలను సందర్శించిన దాఖాలు లేవని అంటున్నారు. మొక్కుబడి విచారణ జరిపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్–2లో తమ పిల్లలతోపాటే కోచింగ్ తీసుకొని పరీక్షకు సరిగ్గా వారం రోజుల ముందే రహస్య ప్రాంతాలకు తరలిపోవడం, తమకు తెలియని ప్రాంతంలో పరీక్షకు హాజరు కావడం, ఫలితాల్లో మార్కులతోపాటు ర్యాంకులు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసి తాము నిజాయితీతో విచారణ జరిపించామనే వాదనను వినిపించడం కోసం తాత్కాలికంగా అలా ప్రకటన చేశారని కొందరు చెబుతున్నారు. ఎక్కడో ఉండి ఫోన్లో సమాచారాన్ని సీఐడీ అధికారులు తీసుకున్నారని, పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో నుంచి ర్యాంకుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను స్వయంగా కలిసి వివరాలు సేకరించలేదని చెబుతున్నారు. ఎంసెట్–2లో లీకేజీపై లోతైన విచారణకు అధికారులు దూరంగా ఉన్నట్లు తెలుస్తుందని ఓ బాధిత విద్యార్థి తండ్రి చెబుతున్నాడు. విచారణను నిష్పాక్షపాతంగా జరిపించడం కోసం అవసరమైతే ప్రత్యక్ష్యంగా ఆందోళన చేపడుతామని చెబుతున్నారు. ఇప్పటికే ఎంసెట్–2లో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి నిరసన తెలుపాలని భావిస్తున్నారు.
–ప్రైవేటులో చేద్దామని దళారుల చేతికి డబ్బు
ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. తమ పిల్లలను ఎలాగైన ఎంబీబీఎస్ చదివించాలనే లక్ష్యంతో కొందరు విద్యార్థుల తండ్రులు దళారులను ఆశ్రయించారని తెలుస్తోంది. డబ్బుకు కొదవ లేని ఆ కుటుంబాలు.. దళారులు అడిగినంత డబ్బు సమర్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రైవేటులో లక్షలు ఖర్చవుతాయని, అవే డబ్బులు తమకిస్తే గవర్నమెంటు సీటు లభిస్తుందని చెప్పిన దళారుల మాటలు నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంసెట్–2లో జరిగిన అక్రమాల వల్ల తమ పిల్లలకు మంచి ర్యాంకులు రాలేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో చివరకు సర్టిఫికెట్ల పరిశీలన వాయిదాపడే వరకు వెళ్లింది. కానీ ఎంసెట్–2లో ఫలితాలను తారుమారు చేసిన బాధ్యులను ఇంకా గుర్తించలేదు.
Advertisement