
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తెచ్చిన సిమెంట్‌ను అవసరమైన చోట్ల వాడామని, బిల్లులు వచ్చిన తర్వాత వెనక్కి తెప్పిస్తున్నామని ‘ఈనాడు’ పత్రికకు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా వక్రభాష్యాలు చెబుతూ కథనాలను ప్రచురించింది. దీంతో ఒత్తిడికి గురైన విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ జేఈ (కాంట్రాక్ట్ ఉద్యోగి) వి.రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను వైఎస్సార్‌సీపీ నాయకులకు ముడిపెడుతూ ఈనెల 30వతేదీన ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించింది.
ఈనెల 29న ఉదయం రేగిడి మండల జేఈ (కాంట్రాక్టు) వి.రామకృష్ణ రాజాం పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు మంగళవారం విచారణ ప్రారంభించారు. గ్రామ సచివాలయాల వారీగా వచ్చిన సిమెంట్ బస్తాలు, వినియోగంపై ఇంజినీరింగ్ అసిస్టెంట్లను రాజాం సీఐ ఎస్.శ్రీనివాస్ ఆరా తీశారు. అవసరాన్ని బట్టి ఒక సచివాలయం నుంచి మరో సచివాలయం పరిధిలో భవనాల నిర్మాణానికి సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఈనెల 25న ‘ఆ సిమెంట్ బస్తాల మాటేమిటి?’ శీర్షికతో ఈనాడులో కథనం వచ్చినప్పటి నుంచి తన భర్తపై ఒత్తిళ్లు ప్రారంభమైనట్లు రామకృష్ణ భార్య ఉమాదేవి వాపోతున్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సిమెంట్ బస్తాలు వేరే సచివాలయం పరిధిలోని భవనాలకు సరఫరా చేశామని రామకృష్ణ మొత్తుకున్నా ‘ఈనాడు’ కథనంపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో రామకృష్ణ మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.