న్యూఢిల్లీ: రూ.30 లక్షలకు మించి విలువ కలిగిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు చెల్లిస్తున్న పన్నుల వివరాలను బినామీ వ్యతిరేక చట్టం కింద పరిశీలించనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) మంగళవారం వెల్లడించింది. అక్రమాస్తులను కలిగి ఉన్న వారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చామంది.
ఇటీవల ప్రభుత్వం రద్దు చేసిన డొల్ల కంపెనీలు, వాటి డైరెక్టర్లను కూడా ప్రస్తుతం విచారిస్తున్నామని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర చెప్పారు. అలాగే పెద్దనోట్ల ఉపసంహరణ తర్వాత అనుమానాస్పదంగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసి...ఆదాయపు పన్ను శాఖ సంప్రదించినా స్పందించని వారికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్లు సుశీల్ పేర్కొన్నారు.
ప్యారడైజ్ పత్రాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామనీ, వివరాలు అందిన వెంటనే విచారణ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్యారడైజ్ పత్రాల్లో ఇప్పటికి చాలా తక్కువ సమాచారం వచ్చిందనీ, నవంబరు 15 తర్వాత పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పెడతామని పరిశోధనాత్మక పాత్రికేయుల అంతర్జాతీయ సమాఖ్య ప్రకటించినట్లు చెప్పారు.
పాన్ దరఖాస్తుల్లో 300 శాతం వృద్ధి
నోట్లరద్దు తర్వాత పాన్‌కార్డు కోసం వస్తున్న దరఖాస్తుల్లో 300% వృద్ధి నమోదైందని సుశీల్ వెల్లడించారు. గతంలో పాన్‌కార్డు కోసం నెలకు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చేవనీ, ఇప్పుడు ఆ సంఖ్య 7.5 లక్షలకు చేరిందని చెప్పారు. ఇప్పటివరకు 33 కోట్ల పాన్ కార్డులను జారీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment