న్యూఢిల్లీ: విచారణ, దర్యాప్తు దశలో ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని పోలీసులు మీడియాతో పంచుకోవడంపై స్పందన తెలియజేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించిం ది. 4 వారాల్లోగా దీనిపై సమాధానమివ్వాలని గడువు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేల ధర్మాసనం సోమ వారం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రం, సీబీఐలను గత ఆగస్టు 23న మౌఖికంగా ప్రశ్నించిన ధర్మాసనం తాజాగా రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.
ఉగ్రవాదం, అత్యంత సున్నితమైన కేసులు సహా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో సమాచారాన్ని మీడియాకు వెల్లడించేందుకు పోలీసులు ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందా? అని ప్రశ్నించింది. ఆ సమాచారాన్ని మీడియాకు వెల్లడిస్తున్న అధికారుల ర్యాంకుపై కూడా జడ్జీలు విచారం వ్యక్తం చేశారు. హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు సైతం కేసు దర్యా ప్తు పురోగతిపై మీడియాతో మాట్లాడడం తమ దృష్టికి వచ్చిందని, ఇలా ఏ స్థాయి అధికారైనా మీడియాతో మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. ఆరుషి, హేమరాజ్ హత్యల నేపథ్యంలో మీడియాతో పోలీసుల వ్యవహార శైలిపై దాఖలైన పిల్‌ను విచారిస్తున్న కోర్టు సోమవారం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.