న్యూఢిల్లీ: బాధ్యతారాహిత్యంగా, నోటికొచ్చింది మీడియా ముందు మాట్లాడవద్దని, మీడియాకు మనమే మసాలా ఇస్తున్నామని బీజేపీ చట్టసభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ వ్యక్తులను ఉద్దేశించి మోదీ తన మొబైల్ యాప్ ద్వారా సంభాషించారు. ‘కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నేతలు మీడియాతో మాట్లాడటానికి తెగ ఉవ్విళ్లూరుతుంటారు.
ఏదో ఒక వివాదంలో చిక్కుకుని చివరకు పార్టీకే కాకుండా తమకూ చెడ్డపేరు తెచ్చుకుంటారు. ఈ విషయంలో మీడియాను నిందించాల్సిన అవసరం లేదు.దాని పని అది చేస్తోంది. కెమెరా ముందు నిలబడి ప్రతి విషయంలోకి దూరి, దేశానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం మనకు లేదు. మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నవారే మీడియాతో మాట్లాడుతారు’ అని మోదీ అన్నారు. ‘మీడియా అది చేస్తోంది, ఇది చేస్తోందంటూ మన కార్యకర్తలు ఎన్నో మాటలంటుంటారు.
కానీ మన తప్పులతో మనమే మీడియాకు వివాదాలను అందిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? కెమెరా పట్టుకున్న వ్యక్తిని చూడగానే మనమేదో దేశంలోని ప్రతి సమస్యనూ విశ్లేషించగలిగే శాస్త్రవేత్తలమో, పరిశోధకులమో అని ఫీల్ అయిపోతాం. మనం మాట్లాడిన దాంట్లో నుంచి వారికి ఏది అవసరమో దానినే మీడియా ప్రతినిధులు తీసుకుంటారు. మనల్ని మనమే నియంత్రించుకోవాలి’ అని మోదీ హెచ్చరించారు. ‘అన్ని వర్గాల్లోనూ మన మద్దతుదారులు పెరుగుతున్నారు. బీజేపీలో అత్యధిక మంది చట్టసభ్యులు ఓబీసీలు, దళితులు, గిరిజనులే ఉన్నారు. వెనుకబడిన వర్గాల మద్దతు మనకు లభించిదనడానికి ఇది ఉదాహరణ’ అని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment