
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ ఎన్‌డీటీవీలో అదనపు వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభంకానుంది. షేరుకి రూ. 294 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. ఆఫర్ ఈ నెల 22న ప్రారంభమై డిసెంబర్ 5న ముగియనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు అనుమతించింది.
దశాబ్దంక్రితం వీసీపీఎల్ అనే సంస్థ ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలివ్వడం ద్వారా వారంట్లను పొందింది. వీసీపీఎల్‌ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్ వీటిని ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించింది. తద్వారా న్యూస్‌గ్రూప్ సంస్థలో 29.18 శాతం వాటాను హస్తగతం చేసుకుంది. ఫలితంగా అక్టోబర్ 17న వాటాదారుల నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది.
అయితే సెబీ నుంచి అనుమతులు ఆలస్యంకావడంతో తాజాగా ఇందుకు తెరతీసింది. వెరసి షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల ఎన్‌డీటీవీ ఈక్విటీ షేర్లను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఆఫర్‌కు పూర్తి స్పందన లభిస్తే రూ. 492.81 కోట్లు వెచ్చించనుంది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్‌డీటీవీ షేరు బీఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 382 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ 23 శాతం తక్కువ!
చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!