![US newspapers promote press freedom after Trump attacks on media - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/17/TRUMP.jpg.webp?itok=UfenHMoR)
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 350 మీడియా సంస్థలు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సంపాదకీయాలను ప్రచురించాయి. 2016లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలను ట్రంప్ లక్ష్యంగా చేసుకోవడం తెల్సిందే. ఇటీవల ఆయన కొన్ని మీడియా సంస్థలను అమెరికా ప్రజలకు శత్రువులుగా అభివర్ణించారు. అంతేకాకుండా గతంలో ఓ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగినందుకు సీఎన్‌ఎన్ చానల్ రిపోర్టర్‌ను ఇటీవల జరిగిన పత్రికా సమావేశానికి హాజరుకాకుండా నిషేధం విధించారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలు, వ్యాఖ్యలను నిరసిస్తూ సంపాదకీయాలు రాయాలని బోస్టన్ గ్లోబ్ పత్రిక పిలుపునిచ్చింది. తమకు నచ్చినట్లు రాతలు రాయని పత్రికలపై దేశానికి శత్రువులుగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ముద్రవేస్తున్నారని బోస్టన్ గ్లోబ్ పత్రిక తన సంపాదకీయంలో విమర్శించింది. తమకు నచ్చని వార్తల్ని నకిలీ కథనాలుగా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది. న్యూయార్క్ పోస్ట్ స్పందిస్తూ.. ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వార్తలను పత్రికలు ప్రచురించినంత మాత్రన అవి నకిలీ వార్తలు అవిపోవని సంపాదకీయం రాసింది. ప్రతీకారం, వేధింపులు, శిక్షల నుంచి మీడియాకు స్వేచ్ఛ లేకపోతే.. ఆ దేశానికి, అక్కడి ప్రజలకు కూడా స్వేచ్ఛ లేనట్లేనని ఫిలడెల్ఫియా ఇన్‌క్వైరర్ సంపాదకీయం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment