ఆ మీడియాపై వైట్‌హౌస్ నిషేధం!
న్యూయార్క్ టైమ్స్, బీబీసీలను అడ్డుకున్న భద్రతా సిబ్బంది
వాషింగ్టన్ : అమెరికాలోని మెజారిటీ వార్తా సంస్థలు అమెరికన్లకు శత్రువుల్లా పనిచేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల తరువాత, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పైసర్స్ కార్యాలయంలో జరిగే రోజువారీ సమావేశానికి సీఎన్‌ఎన్, న్యూయార్క్ టైమ్స్, ద లాస్‌ఏంజిల్స్ టైమ్స్, బీబీసీ, ద గార్డియన్ వంటి ప్రముఖ వార్తా సంస్థలకు ఆహ్వానం అందలేదు. ఈ వార్తా సంస్థల ప్రతినిధులు సమావేశ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా జాబితాలో ఈ సంస్థల పేర్లు లేవని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలో ప్రతిరోజూ జరిగే ఈ సమావేశం టీవీల్లో ప్రసారం కావడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ప్రస్తుతం దీన్ని ఆఫ్ కెమెరా పద్ధతిలో నిర్వహించారు. సమావేశంలో స్పైసర్ మాట్లాడుతూ మీడియా నుంచి వచ్చే వాస్తవ దూరమైన కథనాలను ట్రంప్ సర్కార్ బలంగా తిప్పి కొడుతుందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను అంగీకరించ లేమని సీఎన్ ఎన్ వాస్తవాలు వారికి నచ్చకపోవడం వల్లే ఇటువంటి చర్యలు తీసుకున్నారని, అయినా వాస్తవాలు వెల్లడించడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధమైన పత్రికా స్వేచ్ఛపై వైట్‌హౌస్ వర్గాలు విషప్రచారం చేస్తున్నాయని, ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయమని నేషనల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పేర్కొన్నారు. కాగా, వ్యాపార నిర్వహణలో ఉద్యోగాల కల్పనకు అవరోధంగా ఉన్న నిబంధనల్ని తొలగించే లక్ష్యంతో టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పచ్చజెండా ఊపారు.