నగరంపాలెం (గుంటూరు): రాష్ట్రంలో ఒక వర్గం మీడియా ప్రజా వ్యతిరేక ధోరణులు, తప్పుడు కథనాల (ఫేక్ న్యూస్)పై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ, బెటర్ ఆంధ్రప్రదేశ్ (బాప్), నవ్యాంధ్ర ఇంటలెక్చ్యువల్స్ ఫోరం, ఎడిటర్స్ అసోసియేషన్, జనవిజ్ఞాన వేదిక తదితర సంఘాల నేతలు మండిపడ్డారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై పాలించే ప్రభుత్వాలను కొన్ని పత్రికలు, చానళ్లు శాసించడం సరికాదని హితవు పలికారు. ఈ పరిస్థితి దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి పత్రికా యాజమాన్యాలు, టీవీ ఛానెళ్ల కుట్రను ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలో బుద్ధి చెప్పే రోజులొస్తాయని వ్యాఖ్యానించారు.
ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివారం గుంటూరు నగరంలోని మహాత్మాగాంధీ కళాశాల ఆవరణలో ‘ఆంధ్రప్రదేశ్ మీడియా–నిరాధార, పక్షపాత వార్తలు– పర్యావసానాలు’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది అత్యంత ప్రమాదకరం
ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా అబద్ధపు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తప్పుడు వార్తలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఆ పత్రికలు, ఆ చానళ్లు చెప్పినట్టు ప్రజలు నడుచుకోవాలని చెప్పడం దుర్మార్గం. ఫేక్ న్యూస్‌పై యుద్ధం అనివార్యం. – డొక్కా మాణిక్య వరప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు
జర్నలిజం సిగ్గుపడుతోంది
ప్రస్తుతం జర్నలిజం సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఫేక్‌న్యూస్ ప్రచారం చేయడం కోసం అనేక కుట్రలు చేస్తున్నారు. ఒక విషయం కరెక్టా కాదా అనేది నిర్ధారించుకోకుండానే ప్రసారం, ప్రచారం చేస్తున్నారు. పెత్తందారులకు, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించడం సరైన పద్ధతికాదు. – చందన మధు, బెజవాడ మీడియా సెంటర్ అధ్యక్షుడు
తప్పుడు సమాచారమిస్తే శిక్షించాలి
ప్రస్తుతం మీడియా ప్రపంచంలో అసత్యమనేది ఎక్కువగా రాజ్యమేలుతోంది. నిజం తెలిసేలోగా ఫేక్ న్యూస్ ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ప్రభుత్వాలకు ఛాలెంజ్‌గా మారుతోంది. సోషల్ మీడియాలోని ఫేక్‌న్యూస్‌ను ప్రజలు గమనించాలి. తప్పుడు సమాచారం అందించే వారిని శిక్షించే రోజులు రావాలి. – చందు సాంబశివరావు, బీజేపీ నేత
మీడియా వ్యాపారమైంది
ప్రస్తుతం మీడియా రంగం వ్యాపార రంగంగా మారింది. దీని ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఎదగాలి, ఎలా ప్రభుత్వాన్ని వాడుకోవాలి, చివరికి కోరుకున్న వ్యక్తి సీఎంగా ఉండాలనేదే ప్రధానంగా మారింది. దీంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చర్చా వేదికలో వారికి కావాల్సిన వాళ్లను తీసుకొచ్చి కావాల్సినట్టు మాట్లాడిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు నిజాలు తెలియక గందరగోళానికి గురవుతున్నారు. – రామరాజు శ్రీనివాస్, ఏపీ ఇన్‌కంట్యాక్స్ ప్రాక్టిషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు
హుందాతనమే లేదు
మా చిన్నతనంలో మద్రాసు నుంచి ఒకట్రెండు పత్రికలొచ్చేవి. అందులో సినిమా వాళ్లపై అప్పుడప్పుడు ఫేక్ న్యూస్‌లు వచ్చేవి. వాటిని సరదాగా తీసుకునేవాళ్లం. ఈనాడు వచ్చాక పరిస్థితి మారింది. అవసరమైనప్పుడల్లా అబద్ధపు వార్తలతో ప్రజలను మభ్యపెట్టింది. ఆంధ్రజ్యోతి ఆ పరిస్థితిని మరింత దిగజార్చింది. డిబేట్లు నిర్వహించే వారు కూడా çహుందాతనాన్ని పక్కన పెట్టేశారు. అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఎప్పుడు ఏం చేయాలో వారే డిసైడ్ చేస్తారు. – డీఏఆర్ సుబ్రమణ్యం, నవ్యాంధ్ర ఇంటలెక్చ్యువల్ ఫోరం ఛైర్మన్
విష ప్రచారాన్ని ఆపాలి
ఫేక్ న్యూస్‌ను అడ్డుకోలేకపోతే సమాజం కొట్టుకుపోతుంది. లక్షల కోట్లంటూ సీఎం జగన్‌పై ఎన్నో ఆరోపణలు చేశారు. అవేవీ నిజం కాదని అందరికీ తెలుస్తోంది. ఈ సమయంలో పనిగట్టుకొని మళ్లీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఆలోచించే అవకాశం లేకుండా గందరగోళపరుస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా కర్లపాలెం వద్ద ఓ వ్యక్తి ఉబ్బసంతో చనిపోతే, పనుల్లేక అంటూ ఓ పత్రిక విష ప్రచారం చేసింది. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ సొసైటీæ, గుంటూరు జిల్లా కన్వీనర్
ఫుల్‌స్టాప్ పడాల్సిందే
ఫేక్ న్యూస్‌ను నిషేధించాల్సిన బాధ్యత వార్తా సంస్థలపై ఉంది. దీనిపై ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పడాలి. వ్యక్తిగత దూషణలతో మీడియా ఎటువెళ్తుందనేది అర్థం కావడం లేదు. – ఎం.కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు
ఎన్టీఆర్‌ను దింపిన రోజులు కావివి
తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మీడియా అధిపతులు అర్ధ సత్యాలు, అసత్యాలతో ప్రజల ఆలోచనలను కలుషితం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ రాజకీయాలపై తప్పుడు డిబేట్లు నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో గతంలో రామారావు ప్రభుత్వాన్ని గద్దెదింపిన రోజులు కావివి. డిబేట్‌ల తీరు మారాలని త్వరలో ఆయా యాజమాన్యాలకు లేఖలు రాస్తాం. – వీవీఆర్ కృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment