చడీ చప్పుడూ లేకుండా మీడియా పీక నులమడానికి సాగిన కుట్ర భగ్నమైంది. నకిలీ వార్తల్ని అరికట్టే చాటునlపత్రికా స్వేచ్ఛకు ఉరి బిగిద్దామనుకున్నవారు పలాయనం చిత్తగించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం పాత్రికేయులనుద్దేశించి జారీ చేసిన అప్రజాస్వామిక ఉత్తర్వులు కాసేపట్లోనే మాయమయ్యాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను చూస్తున్నప్పుడు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలను కల్లోల కేంద్రాలుగా మార్చిన ఘనత స్మృతి ఇరానీది. పురిట్లోనే సంధికొట్టిన ప్రస్తుత ఉత్తర్వుల పుణ్యం కూడా ఆమెదే. వెనువెంటనే పాత్రికేయ సంఘాల నుంచీ, పౌర సమాజం నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో గత్యంతరం లేక వాటిని ఉపసంహరించు కున్నారు.
నకిలీ వార్తల్ని ప్రచురించినట్టు లేదా ప్రసారం చేసినట్టు పాత్రికేయులపై ఫిర్యాదులందితే అలాంటివారికిచ్చిన అక్రిడిటేషన్(ప్రభుత్వ గుర్తింపు)ను రద్దు చేస్తామన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. మొదటిసారి ఇలా జరిగితే ఆర్నెల్లపాటు, రెండోసారైతే సంవత్సరంపాటు, మూడోసారి తప్పు జరిగితే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తామని లెక్కలు కూడా ఇచ్చారు. దారుణమైన విషయమేమంటే పత్రికలకు సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)కు, చానెళ్లకు సంబం ధించి న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్(ఎన్‌బీఏ)కు ఫిర్యాదులందిన పదిహేను రోజుల్లో అందులోని నిజానిజాలేమిటో ఆ సంస్థలు నిర్ధారించాలట.
అప్పటివరకూ ఆరోపణలొచ్చిన పాత్రికేయుల గుర్తింపును నిలిపి ఉంచుతారట. అంటే ఆరోపణలు రాగానే ముందు గుర్తింపు ఆగిపోతుందన్నమాట! ఏం తెలివి?! ఇది నకిలీ వార్తల మాటున తమకు ఇబ్బందికరమైన వార్తలు వెలుగు చూడకుండా చేసే కుట్రకాక మరేమిటి? నకిలీ వార్తలు లేదా తప్పుడు వార్తల గురించి ప్రభుత్వాలు అనవసర ఆదుర్దా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అందుకోసం అటు పత్రికలకూ, ఇటు చానెళ్లకూ వేర్వేరు నియంత్రణ వ్యవస్థలున్నాయి. అదీగాక పౌరులకు సరైన సమాచారాన్ని, విశ్లేషణల్ని అందించి వారి విశ్వసనీయతను పొందాలని మీడియా ఎప్పుడూ తహతహలాడుతుంది. క్షణక్షణమూ వచ్చిపడే సమాచారాన్నంతటినీ జల్లెడపట్టి ఏది సరైందో, ఏది కాదో నిర్ధారించుకున్న తర్వాతే దాన్ని పౌరులకు అందించే ప్రయత్నం చేస్తుంది.
ప్రజలకు గల తెలుసుకునే హక్కును గుర్తించి, గౌరవించి అందుకు అను గుణమైన కర్తవ్య రచన చేసుకుంటుంది. నిరంతరం తనను తాను సరిదిద్దు కోవడానికి, జనబాహుళ్యంలో విశ్వసనీయత పెంచుకోవడానికి తపిస్తుంది. ఇందుకు మినహాయింపుగా తప్పుడు వార్తల్ని ప్రచారంలో పెట్టే, వక్రీకరించే మీడియా సంస్థలు కూడా లేకపోలేదు. అయితే అలాంటి సంస్థలు చాలా త్వరగా విశ్వసనీయతను కోల్పోతాయి. కాలగర్భంలో కలిసిపోతాయి. అన్ని రంగాల్లో మంచి చెడులున్నట్టే మీడియాలోనూ ఈ పోకడలుంటాయి. తప్పదు. ఆ మాదిరి సంస్థలపై వచ్చే ఆరోపణలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడానికి పీసీఐ, ఎన్‌బీఏలున్నాయి.
అలాగే వృత్తిపరమైన విలువలను పరిరక్షించడానికి, ఈ రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వంటివి పనిచేస్తున్నాయి. వర్తమాన ప్రపంచంలో నకిలీ వార్తల బెడద ఎలా పెరిగిందో, వాటి పర్య వసానాలు ఏవిధంగా ఉంటున్నాయో అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ, బ్రిటన్ ‘బ్రెగ్జిట్’ రిఫరెండం సమయంలోనూ నకిలీ వార్తలు స్వైరవిహారం చేశాయి. తమ ఇష్టాయిష్టాలను వేరెవరో నియంత్రించారని ఆల స్యంగా తెలుసుకుని ఆ దేశాల పౌరులు లబోదిబోమంటున్నారు.
అంతెందుకు... ఈమధ్య బయటపడిన కేంబ్రిడ్జి ఎనలిటికా(సీఏ) వ్యవహారంలో దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలూ ఎన్నికల్లో తమ సేవల్ని ఉపయోగించుకున్నాయని సీఏకు ఇక్కడ భాగస్వామిగా ఉన్న ఒవలెనొ బిజినెస్ ఇంటెలిజెన్స్(ఓబీఐ) తన వెబ్‌సైట్లో సగ ర్వంగా ప్రకటించుకుంది. తప్పుడు వార్తల్ని ప్రచారంలో పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకకు చెందిన ‘పోస్టుకార్డ్ న్యూస్’ అనే వెబ్‌సైట్‌ను ఆమధ్య కేంద్రమంత్రి అనంత్‌కుమార్ వెనకేసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు 2014 నాటి ఎన్నికల్లో ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేయడంతో పాటు తన పార్టీ డిజిటల్ మీడియా విభాగం ద్వారా నకిలీ వార్తల్ని ప్రచారంలోపెట్టి లబ్ధిపొందారు. ఇలా నకిలీ వార్తలతో, తప్పుడు సమాచారంతో ప్రజల్ని అయోమ యానికి గురిచేసి ఏలికలుగా మారినవారు మీడియాకు సుద్దులు చెప్పడానికి ప్రయత్నిస్తుండటమే వర్తమాన విషాదం.
ఈ ఉత్తర్వుల సంగతి ప్రధాని నరేంద్రమోదీకి తెలియదని... అది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్వీయ నిర్ణయమని చెబుతున్నారు. ప్రధాని కార్యా లయానికి తెలిసిన వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోమని ఆదేశాలు వెళ్లాయంటున్నారు. మంచిదే. అయితే ఉత్తర్వుల జారీ మొదలుకొని ఉపసంహరణ వరకూ సాగిన ప్రహసనాన్ని గమనిస్తే అంతిమంగా మొత్తం ప్రభుత్వంపైనే అనుమానాలు రేకెత్తుతాయి. అంతకు వారం ముందునుంచీ డజనుమంది కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు నకిలీ వార్తల్ని ఫలానా వెబ్‌సైట్ బట్టబయలు చేసిందంటూ సామాజిక మాధ్యమాల ద్వారా దాని లింకుల్ని ప్రచారంలో పెట్టడం గమనిస్తే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక్కటే ఈ ఉత్తర్వుల వెనకున్నదని ఎవరికీ అనిపించదు.
నచ్చని మీడియా సంస్థల అడ్డు తొలగించుకునేందుకు గత ప్రభుత్వాలు సైతం ప్రయత్నించాయి. ఇందిరాగాంధీ మొదలుకొని మొన్నీమధ్య వసుంధరరాజే వరకూ పత్రికా స్వేచ్ఛను అణగదొక్కేందుకు ఎందరో ప్రయత్నిం చారు. మన రాజ్యాంగంలోని 19వ అధికరణ భావ ప్రకటనా స్వేచ్ఛకు పూచీ పడుతోంది. ఆ హక్కుకు తూట్లు పొడిచే ఎలాంటి ప్రయత్నాలనైనా ప్రజలు తిప్పి కొడతారు. పాలకులు ఆ సంగతి గుర్తెరగాలి. మీడియాను నియంత్రించే పనులకు స్వస్తిపలకాలి.
Comments
Please login to add a commentAdd a comment