విష ప్రచారం మానుకోండి | Ambati Rambabu comments on media | Sakshi
Sakshi News home page

విష ప్రచారం మానుకోండి

Published Mon, Mar 6 2023 4:47 AM | Last Updated on Mon, Mar 6 2023 11:44 AM

Ambati Rambabu comments on media - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా చైతన్యానికి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు దారి తప్పుతున్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తమ స్వలా­భం, వర్గ ప్రయోజనాల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. విలువలను వదిలేసి విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.

తప్పుడు కథనాలతో ఓ వర్గం మీడియా అంతిమంగా రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేదిగా మారుతోందన్నారు. నేడు నిబద్ధతతో పనిచేసే విలేకరుల అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం ‘జర్నలిజం మౌలిక సూత్రాలు–ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో మీడియా పాత్ర’ అంశంపై విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీఎన్‌ఆర్టీఎస్‌ చైర్మన్‌ మేడపాటి వెంకట్,  రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, పత్రికా సంపాదకుడు కృష్ణంరాజు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కేవీ శాంత కుమారి పాల్గొన్నారు.  

కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి.. 
రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియాది ప్రధాన పాత్ర. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అంశంఒక్కటే అయినా గత ప్రభుత్వంలో ఒప్పు అయింది.. ఈ ప్రభుత్వంలో తప్పు అయినట్టు కథనాలు ఉంటున్నాయి. విలువలను ఉల్లంఘించడమే సంప్రదాయంగా కొన్ని పత్రికలు, చానళ్లు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం మారగానే వార్తల రూపం, స్వరూపం, ప్రాధాన్యం మారిపోతున్నాయి.   – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి  

లేనిది ఉన్నట్టు రాయడం క్షమించరాని తప్పు 
విశాఖలో జీఐఎస్‌ సదస్సుకు ఎందరో పారిశ్రామికవేత్తలు వచ్చి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనిపైనా కొన్ని పత్రికలు వక్రీకరించి కథనాలు ప్రచురించాయి. దీనివల్ల ఎవరికి లాభం?.. నష్టపోయేది ఎవ­రు? అనేది పాత్రికేయులు ఆలోచించాలి. సైనికుడి చేతిలో ఆయుధం, విలేకరి చేతిలోని కలం ఒకటే. లేనిది ఉన్నట్టు రాయడం క్షమించరాని తప్పు.   – కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌  

సమాజ ప్రగతికి గొడ్డలిపెట్టు 
మీడియాలో విలువలు దిగజారిపోతున్నాయి. ఇది సమాజ ప్రగతికి గొడ్డలిపెట్టు. తమకు వ్యక్తులపై ఉన్న కక్షను వ్యవస్థపై రుద్దేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆ పత్రికలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు.. ప్రజాసంక్షేమం గిట్టదు.   – పి.విజయబాబు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు 

ఆ రెండు పత్రికలకు మంచి కనిపించదు..  
ఆ రెండు పత్రికలకు రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజలకు జరుగుతున్న మంచి కనిపించదు. జగన్‌ సీఎం అయి­నప్పటి నుంచి అవి అదే ధోరణి అవలంబిస్తున్నాయి.  –మల్లాది విష్ణు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement